సాక్షి, చెన్నై: ఆడిటర్‌గా పనిచేస్తున్న వ్యక్తి స్టాక్ మార్కెట్లో తీవ్ర నష్టాలు చవిచూడటంతో మనస్తాపం చెంది భార్య గొంతుకోసి, కుమారుని గొంతు నులిమి ఆ తర్వాత రైలు కిందపడి ఆత్మహత్మ చేసుకున్నాడు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన నవీనఖన్నా (42) అన్నానగర్ లోని ఓ ఫ్లాట్లో ఉంటున్నాడు. తేనాంపేటలోని సెంట్రల్ కంప్రోల్టర్, ఆడిటర్ జనరల్ కార్యాలయంలో ఆడిటర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు తల్లి భువనేశ్వరి, భార్య నివేదిత (30), కుమారుడు లావిన్ కన్నన్ (7) ఉన్నారు.
నివేదిత పెరంబూరులోని లోకో ఆఫీసులో సూపర్వైజర్ పనిచేస్తున్నారు. సోమవారం నవీన్ బయటకు వెళ్లిన అనంతరం తల్లి భువనేశ్వరికి ఫోన్ చేసి భార్య, కుమారుడు చాలాసేపు నిద్రపోతారని, రాత్రి 11 గంటల వరకు ఇబ్బంది పెట్టొద్దని చెప్పి, ఫోన్ కట్ చేశాడు. అనుమానం వచ్చిన తల్లి బెడ్రూమ్ తలుపు తట్టినా తెరవకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా, లావిన్ కన్నన్ చనిపోయి ఉన్నాడు. మెడ తెగిపోయిన నివేదితకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో కీల్పాకం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
ఈక్రమంలోనే నవీన్ చెన్నైలోని విల్లివాక్కం రైల్వేస్టేషన్ సమీపంలో ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అయితే తాను పనిచేసే కార్యాలయంలో మాజీ సైనికోద్యోగులకు ఇవ్వాల్సిన కోట్లాది రూపాయల సొమ్మును దుర్వినియోగం చేసి, ఆ డబ్బును షేర్ మార్కెట్లో పెట్టినట్టు విచారణలో వెల్లడైంది. నష్టాలు రావడంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మొదట తన బిడ్డ గొంతు నులిమి చంపి, ఆపై కత్తితో భార్య గొంతు కోసినట్టు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


