అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం కార్యక్రమం.. రేపు
కొరుక్కుపేట: అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ, సమైక్య భారతి– విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు కమిటీ ఛైర్మన్ కాకుటూరు అనిల్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15వ తేదీ సోమవారం సాయంత్రం 4.30 గంటలకు చైన్నె మైలాపూర్‌లోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనం వేదికగా జరుగనున్న ఈ కార్యక్రమం కమిటీ చైర్మన్ కాకుటూరు అనిల్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన వహిస్తారు. స్వాగతోపన్యాసంను కార్యదర్శి – కోశాధికారి వి కష్ణారావు చేయనున్నారు. ముఖ్యఅతిథిగా తెలుగు అండ్ సంస్కృత అకాడమీ– ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, ఆర్.డి. విల్సన్ (శరత్ చంద్ర) ,విశిష్ఠ అతిథిగా అఖిల భారత తెలుగు సమాఖ్య డాక్టర్ సిఎంకే రెడ్డి, గౌరవ అతిథులుగా సమైక్య భారతి–విశాఖపట్నం జాతీయ సమన్వయకర్త పి. కన్నయ్య, తమిళనాడు ప్రభుత్వం అదనపు సెక్రటరీ, టీఎన్‌ఈబీ లీగల్ అడ్వైజర్ జి.సి. నాగూర్, టామ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇశ్రాయేల్ లు విచ్చేయనున్నారని తెలిపారు.
భద్రత నడుమ తిరుప్పరకుండ్రంలో దీక్ష
సాక్షి,చైన్నె: తిరుప్పరకుండ్రంలో ఒక రోజు నిరసన దీక్షకు శనివారం భద్రత నడుమ జరిగింది. తిరుప్పర కుండ్రంలో దీపం వెలిగింపు అంశం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితులో తమకు దీపం వెలిగించేందుకు మధురై ధర్మాసనం అనుమతి ఇచ్చినా ప్రభుత్వం అడ్డుకుందని పేర్కొంటూ, పిటిషనర్ తరపున న్యాయ పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో తాజా పరిణామాలకు వ్యతిరేకంగా తిరుప్పర కుండ్రంలో ఒక రోజు నిరసన దీక్షకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ తరపున మధురై ధర్మాసనంలో విజ్ఞప్తి చేశారు. ఇందుకు న్యాయమూర్తి శ్రీమది అనుమతి ఇచ్చారు. ఒక రోజు కేవలం 50 మందితో మాత్రమే దీక్ష చేసుకోవాలని, వ్యక్తిగతంగా , రాజకీయంగా ఎవ్వరిమీద ఎలాంటి విమర్శలు చేయకూడదన్న ఆంక్షలు విధించారు. దీంతో శనివారం కోర్టు ఆదేశాలు, ఆంక్షలతోపాటూ గట్టి భద్రత నడుమ ఆలయం సమీపంలో నిరసన దీక్ష ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగింది.
ఉపాధి హామీ పేరు మార్చితే మూల్యం తప్పదు
సెల్వపెరుంధగై వ్యాఖ్య
కొరుక్కుపేట: మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2004లో తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం పేరును మార్చాలనుకోవడం భావ్యం కాదని తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సెల్వ పెరుందగై హితవుపలికారు. గ్రామీణ జనాభాలో నిరుద్యోగాన్ని తగ్గించడం, పేదరికాన్ని నిర్మూలించడం ఈ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. కాగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూజ్య బాబు గ్రామీణ రోజ్‌గార్ యోజనగా పేరు మార్చడానికి రాబోయే లోక్‌సభ సమావేశంలో బిజెపి ప్రభుత్వం ఒక బిల్లును ప్రవేశపెట్టబోతోందని వార్తలు వస్తున్నాయని, దీనికి తగిన మూల్యం మోదీ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇతరుల పేరును తుడిచివేయాలనే ఉద్దేశంతో మోదీ వ్యవహరిస్తే, భారత ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరన్నారు.
దుబాయ్ – చైన్నె విమానంలో ఇంజిన్ వైఫల్యం
సాక్షి, చైన్నె: దుబాయ్ నుంచి చైన్నెకు బయలుదేరాల్సిన విమానంలో హఠాత్తుగా ఇంజిన్ వైఫల్యం చెందడంతో ప్రయాణికులు ఆందోలనకు లోనయ్యారు. వివరాలు.. చైన్నె – దుబాయ్ మధ్య ఎయిర్ ఇండియా విమాన సేవలు జరుగుతున్నాయి. రోజూ ఉదయాన్నే ఇక్కడ బయలు దేరి, మధ్యాహ్ననికి దుబాయ్‌కు ఈ విమానం చేరుకుంటుంది. రాత్రి అక్కడ బయలు దేరి మరుసటి రోజు ఉదయాన్నే చైన్నెకు ఈ విమానం చేరుకుంటుంది. ఈ పరిస్థితులలో శుక్రవారం 172 మంది ప్రయాణికులతో ఈ విమానం టేకాఫ్‌నకు సిద్దం కాగా, హఠాత్తుగా ఇంజన్‌లో సాంకేతికంగా వైఫల్యం ఎదురు కావడంతో ఉత్కంఠ నెలకొంది. దీంతో ప్రయాణికులను విమానం నుంచి దించేశారు. మరమ్మతులపై దృష్టి పెట్టారు. మరమ్మతులు పూర్తి చేసినానంతరం ప్రయాణికులను చైన్నెకు తరలించేందు చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ విమానం కొన్ని గంటల ఆలస్యంగా ఇక్కడకు రావడం ప్రయాణికులను రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన వాళ్లు పడిగాపులు కాయాల్సి వచ్చింది.


