కదం తొక్కిన ఉద్యోగులు
రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు
సాక్షి, చైన్నె: జాక్టోజియో ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు శనివారం కదం తొక్కారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ద్రావిడ మోడల్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. గతవారం డీఏ సైతం పెంచారు. అయినా ఉద్యోగులు మాత్రం తగ్గడం లేదు. తమకు పాత పింఛన్ విధానం అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈపరిస్థితుల్లో పాత పెన్షన్ విధానం అమలు, కొత్త విధానం రద్దు, ఖాళీల భర్తీ డిమాండ్ల పరిష్కారానికి ఒక రోజు సమ్మె నిరసనకు పిలుపు నిచ్చారు. ఈమేరకు గతవారం పెద్ద ఎత్తున ఉద్యోగులు విధులకు హాజరు కాలేదు. దీంతో ప్రభుత్వ కార్యకాలపాలకు అనేక చోట్ల ఆటంకాలు తప్పలేదు. విధులను బహిష్కరించిన ఉద్యోగుల తమ తమ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు. ధర్నాలతో నిరసన తెలియజేశారు.ఉపాధ్యాయులు సైతం విధులకు రాకపోవడంతో విద్యా బోధనలకు ఆటంకం ఏర్పడింది. అనేక జిల్లా కేంద్రాల్లో జాక్టోజియో నేతృత్వంలో నిరసనలు హోరెత్తించారు. డిమాండ్లను పరిష్కరించకుంటే, పోరాటం తీవ్రతరం చేయాల్సి ఉంటుందన్న హెచ్చరికలను జాక్టోజియో నేతలు జారీ చేశారు. విధులను బహిష్కరిస్తే చర్యలు తీసుకుంటుండడంతో, రెండవ శనివారం సెలవు రోజైన తాజాగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని నినదించారు. లేనిపక్షంలో మరింతగా నిరసనలు ఉధృతం అవుతాయని హెచ్చరించారు. కొన్ని చోట్ల ధర్నాలు, మరికొన్ని చోట్ల ఒక రోజు నిరసన దీక్షలు జరిగాయి. చైన్నెలో పలుచోట్ల జాక్టోజియో నిరసనలు జరిగాయి. చైన్నెలోని ఎళిలగం ఆవరణలో నిరసన దీక్ష నిర్వహించారు.


