ఢిల్లీకి నైనార్!
సాక్షి, చైన్నె : కూటమిని బలోపేతం చేయడానికి అధినేతలు రంగంలోకి దిగనున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ శనివారం చైన్నె నుంచి ఢిల్లీ వెళ్లారు. అక్కడ పార్టీ అధినేతలు అమిత్ షా, జేపీ నడ్డా తదితరులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. వీరికి తమిళనాడులో బీజేపీ బలంగా ఉన్న 54 నియోజకవర్గాలకు సంబంధించిన జాబితాను సమర్పించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. వివరాలు.. అన్నాడీఎంకే – బీజేపీ కూటమి ఏర్పాటై ఆరు నెలలకు పైగా అవుతోంది. అయితే, ఇంత వరకు ఈ కూటమిలోకి కీలక పార్టీలను చేర్చలేదు. అదే సమయంలో బీజేపీ – అన్నాడీఎంకే వర్గాల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎన్నికలు మరికొన్ని నెలలు ఉన్న నేపథ్యంలో ఈ కూటమిని బలోపేతం చేయడానికి బీజేపీ అధినేతలైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాలు రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో అన్నాడీఎంకేలో విడివిడిగా ఉన్న నేతలను ఒకే వేదిక పైకి తెచ్చే వ్యూహాలకు సైతం పదును పెట్టారు. ఇందుకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి దారి ఇవ్వడం లేదు. తమ నేతృత్వంలోనే కూటమి, కూటమిలో ఎవ్వర్వెరు ఉండాలో అన్న నిర్ణయం తమదే అన్న స్పష్టతను సర్వసభ్య సమావేశం వేదికగా తెలియజేయడంతో బీజేపీ అధినేతలకు షాక్ తప్పలేదు.
ఢిల్లీకి నైనార్..
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామితో నైనార్ నాగేంద్రన్ గురువారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కూటమి గురించిన చర్చ , అన్నాడీఎంకే బహిష్కృత నేతలైన పన్నీరు, టీటీవీల చేరిక గురించి చర్చ జరిగినట్టు సమాచారం. అదే సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో ఒక రోజు ముందుగానే శనివారం చైన్నె నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రర్ బయలుదేరి వెళ్లారు. అధినేతలకు సమగ్ర వివరాలను సమర్పించడమే కాకుండా, కూటమిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న పీఎంకేలో సాగుతున్న వివాదాల ప్రస్తావన కూడా చర్చకు వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. డీఎండీకేతో పాటుగా మరికొన్ని పార్టీల చేరిక గురించిన సమాచారాలను అమిత్ షాకు నైనార్ వివరించినట్టు తెలిసింది. అదే సమయంలో తమిళనాట బీజేపీ 54 నియోజకవర్గాలలో బలంగా ఉన్నట్టు, ఈ స్థానాలలోపార్టీ అభ్యర్థులే పోటీలో ఉండాలన్న రాష్ట్రస్థాయి నేతల సూచనల మేరకు ఆ నియోజకవర్గాల జాబితాను ఢిల్లీలో నైనార్ అందజేసినట్టు చర్చ జరుగుతుంది. ఇందులో 8 నియోజకవర్గాలు చైన్నెలోనే ఉన్నట్టు సమాచారం. ఈ భేటి ముగించుకుని ఆదివారం చైన్నెకు తిరిగి వచ్చే నైనార్ నాగేంద్రన్ ఆమరుసటి రోజు 15వ తేది అమిత్ షా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి పెట్టనున్నారు. అమిత్ షా రానున్నడంతో రాజకీయంగా చర్చలు ఊపందుకున్నాయి. అన్నాడీఎంకేను గాడిలో పెట్టి బహిష్కృత నేతలను కూటమిలోకి అమిత్ షా తీసుకొచ్చేనా అనేది వేచి చూడాల్సిందే.
పన్నీరు భేటీ వాయిదా
అమిత్ షా రాక నేపథ్యంలో పన్నీరు సెల్వం తాను ఇచ్చిన అల్టిమేటం భేటీని వాయిదా వేసుకున్నారు. ఇటీవల అన్నాడీఎంకే అధిష్టానానికి పన్నీరు సెల్వం తీవ్ర హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. డిసెంబరు 15వ తేదీలోపు నిర్ణయం తీసుకోని పక్షంలో అదే తేదీన తాను కీలక ప్రకటన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ ప్రకటన తదుపరి పన్నీరు సెల్వంను అమిత్ షా ఢిల్లీకి పిలిపించి బుజ్జగించి పంపించారు. తనకు మళ్లీ అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీరు పదవి అప్పగించాలన్న విజ్ఞప్తిని అమిత్ షా ముందు పన్నీరు ఉంచారు. ఈ పరిస్థితులలో అన్నాడీఎంకే నుంచి ఎలాంటి సమాచారం, సమాధానం లేని దృష్ట్యా, 15వ తేదీన పన్నీరు ఏ ప్రకటన చేస్తారో అన్న ఎదురు చూపులు పెరిగాయి. అయితే, నైనార్ ఢిల్లీ వెళ్లడం, అమిత్ షా చైన్నెకు రానున్నడంతో ఈ నెల 15న జరగాల్సిన భేటీని, ఎంజీఆర్ దివంగతుడైన ఈనెల 24వ తేదిన కీలక ప్రకటన అని తేదీని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి పన్నీరుకు ఏర్పడటం గమనార్హం. అమిత్ షా భేటీ తదుపరి జేపీ నడ్డా చైన్నెకు రానున్నారు. జనవరి మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం రానున్నడం గమనార్హం.


