మా బ్యాంకులో మీ డబ్బు భద్రం!!

Customers' money safe with us, says PNB - Sakshi

ఖాతాదారులకు పీఎన్‌బీ భరోసా

న్యూఢిల్లీ: భారీ కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) తమ ఖాతాదారులకు డిపాజిట్లపై భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తోంది. కస్టమర్స్‌ సొమ్ముకు తమ బ్యాంకులో పూర్తి భద్రత ఉంటుందని, వారెప్పుడైనా డిపాజిట్‌.. విత్‌డ్రా చేసుకోవచ్చని పునరుద్ఘాటించింది. వీటిపై వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. వ్యవస్థలో అనైతిక విధానాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని, మోసపూరిత లావాదేవీల్లాంటివేమైనా జరిగాయని తెలిసిన మరుక్షణం దర్యాప్తు సంస్థలు, నియంత్రణ సంస్థలకు సమాచారం వెళ్లిపోతుందని .. కఠిన చర్యలు ఉంటాయని పీఎన్‌బీ తెలిపింది.

స్కామ్‌ ప్రభావం పడిన ఇతర బ్యాంకులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని, తాజా పరిణామాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నామని వివరించింది. ఇటీవలి రూ. 13,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఖాతాదారుల సందేహాలను నివృత్తి చేసేలా ఇచ్చిన వివరణలో పీఎన్‌బీ ఈ అంశాలు పేర్కొంది. వజ్రాభరణాల వ్యాపారి నీవర్‌ మోదీ, మెహుల్‌ చోక్సీలు రూ. 11,400 కోట్ల మేర పీఎన్‌బీని మోసం చేసినట్లు ఇటీవల బైటపడిన సంగతి తెలిసిందే.

మరింత లోతుగా దర్యాప్తు చేయగా ఈ మొత్తం రూ. 13,000 కోట్లకి చేరింది. పీఎన్‌బీ ఉద్యోగులతో కుమ్మక్కై, బ్యాంకు నుంచి తీసుకున్న నకిలీ లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌ (ఎల్‌వోయూ)తో మోదీ తదితరులు ఈ స్కామ్‌కి తెరతీశారు. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐతో పాటు యూనియన్‌ బ్యాంక్, అలహాబాద్‌ బ్యాంక్‌ మొదలైన దాదాపు 30 బ్యాంకులపై ఈ స్కామ్‌ ప్రభావం పడింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top