ఏఆర్‌సీ ఏర్పాటు ఒక్కటే పరిష్కారం

Court Allows Bankruptcy Action Against India Power Producers - Sakshi

విద్యుత్‌ ఎన్‌పీఏలపై బీవోఏఎంఎల్‌ అభిప్రాయం  

ముంబై: విద్యుత్‌ రంగానికి సంబంధించి రూ.1.74 లక్షల కోట్ల మొండి బకాయిల (ఎన్‌పీఏలు) విషయంలో బ్యాంకులు ఆర్‌బీఐ నిబంధనల మేరకు దివాలా చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఎదురుకావడంతో... పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం ఓ అస్సెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌/ మేనేజ్‌మెంట్‌ కంపెనీని (ఏఆర్‌సీ/ఏఎంసీ) ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌ (బీవోఏఎంఎల్‌) పేర్కొంది. మార్చి 1 నాటికి ఎన్‌పీఏలుగా మారిన రుణ ఖాతాలకు ఆర్‌బీఐ ఇచ్చిన 180 రోజుల పరిష్కార గడువు ఆగస్ట్‌ 27తో ముగిసిన విషయం తెలిసిందే.

తమకు మరింత గడువు కావాలంటూ విద్యుత్‌ కంపెనీలు అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, మధ్యంతర ఆదేశాలు జారీ చేయటానికి కోర్టు నిరాకరించింది. దీంతో బ్యాంకులు ఆయా కంపెనీల రుణ ఖాతాలను దివాలా చర్యల కోసం ఎన్‌సీఎల్‌టీకి నివేదించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే, అదనపు గడువు కోసం ఆర్‌బీఐతో కేంద్రం సంప్రతించాలని కోర్టు సూచించింది.

ఈ నేపథ్యంలో విద్యుత్‌ రంగానికి సంబంధించిన ఎన్‌పీఏలను నేరుగా నిర్వహించేందుకు లేదా ఎన్‌సీఎల్‌టీ వేలంలో బిడ్డింగ్‌ వేసేందుకు ఏఆర్‌సీ/ఏఎంసీ ఏర్పాటు ఒక్కటే మార్గమని బీవోఏఎంఎల్‌ విశ్లేషకులు సూచించారు. ఏఆర్‌సీ ఏర్పాటు ఆలోచనను ఇప్పటికే ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాళ్‌ ఆచార్య, సునీల్‌ మెహతా కమిటీలు సైతం సూచించిన విషయాన్ని బీవోఏఎంఎల్‌ పేర్కొంది.  

9 బిలియన్‌ డాలర్లు అవసరం
ప్రతిపాదిత విద్యుత్‌ రంగ ఏఆర్‌సీ/ఏఎంసీకి 9 బిలియన్‌ డాలర్ల సీడ్‌ క్యాపిటల్‌ అవసరమని, బ్యాంకులకు కేంద్రం ఇవ్వదలిచిన 20 బిలియన్‌ డాలర్ల రీక్యాపిటలైజేషన్‌లో ఇది భాగంగా ఉండాలని సూచించింది. 2019–20లో 14 శాతం రుణ వృద్ధికి గాను ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం 26.5 బిలియన్‌ డాలర్లు అందించాల్సి ఉంటుందని, ఇందులో విద్యుత్‌ రంగ ప్రాజెక్టులకు ఇచ్చిన రుణాలపై 75 శాతం హేర్‌కట్‌ (రుణాలపై నష్టాలు) కోసం 19.4 బిలియన్‌ డాలర్లు అవసరం అవుతాయని బీవోఏఎంల్‌ తెలిపింది. విద్యుత్‌ రంగ 60 ఎన్‌పీఏలు ఎన్‌సీఎల్‌టీకి వెళ్లినట్టయితే బ్యాంకులు అదనంగా రూ.లక్ష కోట్ల మేర కేటాయింపులు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top