రైడర్లతో టర్మ్‌ పాలసీ తీసుకోవాలా?

రైడర్లతో టర్మ్‌ పాలసీ తీసుకోవాలా?


నేను ఎల్‌ఐసీ జీవన్‌ సురక్ష–వన్‌ పాలసీని 1997లో  తీసుకున్నాను.  ఈ పాలసీ కోసం ఏడాదికి రూ.10,182 ప్రీమియమ్‌ చెల్లిస్తున్నాను. ఈ పాలసీ 2022లో మెచ్యూర్‌ అవుతుంది. ఈ పాలసీ మెచ్యూర్‌ అయిన తర్వాత నాకు వచ్చే ప్రయోజనాలేమిటి ? ఇప్పుడు ఈ పాలసీ నుంచి వైదొలిగితే నాకు ఏమైనా నష్టం వస్తుందా ? పాలసీని కొనసాగిస్తే మంచిదా? లేకుండా సరెండర్‌ చేస్తే మంచిదా ? తగిన సూచనలివ్వండి.

– అనంత్, విజయవాడ



ఎల్‌ఐసీ జీవన్‌ సురక్ష– వన్‌ అనేది డిఫర్డ్‌ యాన్యూటీ పాలసీ. ఈ పాలసీ మెచ్యూర్‌ అయిన తర్వాత, ఆ వచ్చిన సొమ్ములతో(బోనస్‌ కూడా కలుపుకొని) మీరు యాన్యూటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేదా ఈ పాలసీ మెచ్యూర్‌ అయిన తర్వాత వచ్చే మొత్తంలో 25 శాతం మొత్తాన్ని మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మొత్తంతో యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక యాన్యుటీ అంటే.. మీ మిగిలిన జీవితానికి క్రమం తప్పకుండా ఆదాయం రావడం కోసం ఇన్వెస్ట్‌  చేయాల్సిన ఒక తరహా మదుపు సాధనం. ఇక మీ విషయానికొస్తే, మీరు ఈ స్కీమ్‌ నుంచి వైదొలగడమే ఉత్తమం. ఈ తరహా డిఫర్డ్‌ యాన్యుటీ స్కీమ్‌లు మంచి రాబడులను ఇవ్వలేవు. ఎల్‌ఐసీ జీవన్‌ సురక్షను పరిశీలిస్తే, ఇటీవల కాలంలో  ఈ ప్లాన్‌ ఇచ్చిన బోనస్‌లు 3.5 శాతం రేంజ్‌లోనే ఉన్నాయి. ఈ రాబడి ఒక బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రాబడి కంటే కూడా తక్కువ, అంతే కాకుండా ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడి కూడా రాదు. మీరు ప్రీమియమ్‌గా చెల్లించే మొత్తాన్ని దీర్ఘకాలంగా ఇన్వెస్ట్‌ చేస్తే, ఇంతకంటే మంచి రాబడులే రావాలి. ఇన్వెస్ట్‌మెంట్, బీమా కలగలసి ఉన్న చాలా స్కీమ్‌లు ఎప్పుడూ  ఇన్వెస్టర్లకు సరైన రాబడులను ఇవ్వలేవు. మీరు ఇప్పుడు ఈ పాలసీని సరెండర్‌ చేస్తే, మీరు చెల్లించిన ప్రీమియమ్‌ల్లో 90 శాతం(తొలి ఏడాది ప్రీమియమ్‌ను మినహాయించుకొని) గ్యారంటీడ్‌ సరెండర్‌ విలువగా చెల్లిస్తారు. మీ విషయంలో ఈ ప్లాన్‌ను సరెండర్‌ చేస్తే, మీకు రూ.1.65 లక్షలు రావచ్చు. లేదా స్పెషల్‌ సరెండర్‌ వేల్యూను ఎల్‌ఐసీ ఇవ్వవచ్చు. ఇది గ్యారంటీడ్‌ సరెండర్‌ వేల్యూ కంటే అదనంగా ఉండొచ్చు. ప్రీమియమ్‌లు ఎన్నేళ్లపాటు చెల్లించారు. సరెండర్‌ చేసేటప్పుడు పాలసీ మెచ్యురిటీ కావడానికి ఇంకా ఎంత సమయముంది? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని స్పెషల్‌ సరెండర్‌ వేల్యూని నిర్ణయిస్తారు. బీమా అవసరాల కోసం టర్మ్‌ బీమాను తీసుకోవాలి. దీంట్లో ప్రీమియమ్‌లు తక్కువగానూ, బీమా కవరేజ్‌ అధికంగానూ ఉంటుంది. ఇక దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయాలి. ఇలా చేస్తే మంచి రాబడులు పొందవచ్చు.



నేను టర్మ్‌ బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. ప్యూర్‌ టర్మ్‌ పాలసీ తీసుకోవాలా ? లేకుండా రైడర్స్‌తో కూడిన టర్మ్‌ పాలసీ తీసుకోవాలా ? వివరంగా తెలియజేయండి.                

– మాధుర్, హైదరాబాద్‌

దీనికి సమాధానం అందరికీ ఒకేలా వర్తించదు. వ్యక్తుల బీమా అవసరాలు, వారిపై ఆర్థికంగా ఆధారపడి ఉన్న  వ్యక్తులు, బీమా తీసుకోవాలనుకుంటున్న వ్యక్తి చేసే వృత్తి లేదా వ్యాపారం తదితర అంశాలను బట్టి దీనికి సమాధానం ఉంటుంది. ప్యూర్‌ టర్మ్‌ పాలసీ తీసుకోవాలా ? లేక క్రిటికల్‌ ఇల్‌నెస్, యాక్సిడెంటల్‌ డెత్‌ బెనిఫిట్, ఇంకా ఇతర రైడర్లతో కూడిన టర్మ్‌ పాలసీ తీసుకోవాలా అనేది ఆయా వ్యక్తులను బట్టి ఉంటుంది. ఏ వ్యక్తిపై అయినా ఆర్థికంగా ఆధారపడే వాళ్లుంటే, ఆ వ్యక్తి తప్పనిసరిగా బేసిక్‌ టర్మ్‌ పాలసీ తీసుకోవాలి. దీనికి ఏదైనా రైడర్స్‌  తీసుకోవాలా ? వద్దా ? అనే విషయం ఆ వ్యక్తి ప్రత్యేక అవసరాలపై ఆధారపడి ఉండి ఉంటుంది. క్రిటికల్‌ ఇల్‌నెస్, యాక్సిడెంటల్‌ డెత్, పార్షియల్, పెర్మనెంట్‌ డిజ్‌ఎబిలిటీ, తదితర రైడర్లతో పలు బీమా కంపెనీలు టర్మ్‌  బీమా పాలసీలను ఆఫర్‌ చేస్తున్నాయి. అయితే వీటికి కొంత మొత్తం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్యూర్‌ టర్మ్‌ బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్న వ్యక్తి వీటన్నింటినీ తీసుకోవాలని ఏమీ లేదు. ఏది తనకు ఉపయోగపడుతుందో దానిని మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు చెప్పాలంటే ప్రయాణాలు అధికంగా చేసే వృత్తిని లేదా ఉద్యోగాన్ని చేస్తున్న వ్యక్తులకు యాక్సిడెంట్ల రిస్క్‌  అధికంగా ఉంటుంది. అందుకని అలాంటి వాళ్లు యాక్సిడెంటల్‌ డెత్‌ రైడర్‌ను ఎంచుకోవాలి. ఇక వివిధ బీమా సంస్థలు ఇలాంటి రైడర్ల విషయంలో విభిన్న రకాలైన విధానాలను, షరతులను విధిస్తున్నాయి. అందుకని మీరు తీసుకోవాలనుకుంటున్న రైడర్లకు సంబంధించిన వ్యయాలు, ప్రయోజనాలు, షరతులు.. అన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోండి.



నా కుమారుడికి బ్రిటిష్‌ పౌరసత్వం ఉంది. భారత్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాడు. అతడికి పాన్‌(పర్మనెంట్‌ అకౌంట్‌ నంబర్‌) ఉండాలా? కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌) నిబంధనలను పాటించాల్సి ఉంటుందా?

– పూర్ణచందర్‌రావు, విశాఖపట్టణం



భారత్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలంటే పాన్‌ తప్పకుండా ఉండాల్సిందే. అలాగే నో యువర్‌ కస్టమర్‌(కేవైసీ) నిబంధనలను కూడా పాటించాల్సి  ఉంటుంది. ఇక పాన్‌ కోసం విదేశీ జాతీయులు ఫార్మ్‌ 49ఏఏ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.  

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top