వ్యయ నియంత్రణ చర్యలపై బీఎస్‌ఎన్‌ఎల్‌ దృష్టి

BSNL Focus on Cost control - Sakshi

అవుట్‌సోర్సింగ్‌ కార్యకలాపాల క్రమబద్ధీకరణపై కసరత్తు

ఏటా రూ. 200 కోట్ల దాకా ఆదా!

న్యూఢిల్లీ: నిధుల కొరతతో అల్లాడుతున్న ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ వ్యయ నియంత్రణ చర్యలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా అవుట్‌సోర్సింగ్‌కి ఇచ్చిన కార్యకలాపాలను క్రమబద్ధీకరించే ప్రయత్నాల్లో ఉంది. తద్వారా ఏటా రూ. 200 కోట్ల దాకా మిగుల్చుకోవచ్చని అంచనా వేస్తోంది. అలాగే టెలిఫోన్‌ ఎక్సే్చంజీల్లో విద్యుత్‌ బిల్లుల భారాన్ని కూడా తగ్గించుకోవడం ద్వారా  15 శాతం దాకా ఆదా చేయొచ్చని భావిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ పి.కె. పుర్వార్‌ ఈ విషయాలు వెల్లడించారు. నెలవారీ ఆదాయాలు, వ్యయాలకు (నిర్వహణ వ్యయాలు, జీతభత్యాలు) మధ్య ఏకంగా రూ. 800 కోట్ల తేడా ఉంటోందన్నా రు. వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టినా సవాళ్లు కొంత మేర ఉంటాయన్నారు. ఉద్యోగులకు జూలై నెల జీతాల చెల్లింపుల కోసం అంతర్గత వనరుల ద్వారానే నిధులు సమకూర్చుకున్నామని, టెలికం శాఖ నుంచి ఆర్థిక సహాయమేదీ కోరలేదని పుర్వార్‌ వివరించారు. ‘ఏయే నిర్వహణ వ్యయాలు తగ్గించుకోగలమో సమీక్షించి తగు చర్యలు తీసుకుంటాం. ఇందులో భాగంగా ముందుగా అవుట్‌సోర్సింగ్‌ వ్యయాలను తగ్గించుకుని ఆయా కార్యకలాపాలను అంతర్గతంగానే నిర్వహించేందుకు వీలుంటుందేమో పరిశీలిస్తున్నాం‘ అని ఆయన చెప్పారు. 

రూ.14 వేల కోట్ల నష్టాలు..
2018–19 లో బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలు రూ. 14,000 కోట్ల మేర ఉంటాయని, ఆదాయం క్షీణించి రూ. 19,308 కోట్లకు పరిమితం కావొచ్చని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌లో 1,65,179 మంది ఉద్యోగులు ఉన్నారు. మొత్తం ఆదాయంలో సిబ్బంది వేతన వ్యయాలు ఏకంగా 75 శాతంగా ఉన్నాయి. అదే ప్రైవేట్‌ రంగ సంస్థల విషయానికొస్తే.. 2.95–5.59% స్థాయిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నష్టాలు, రుణాల భారంతో కుంగుతున్న బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లను విలీనం చేసే ప్రతిపాదన కూడా కేంద్రం పరిశీలిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top