breaking news
cost controls
-
వాటాదారులకు మరింత విలువ
న్యూఢిల్లీ: వాటాదారులకు విలువ చేకూర్చడంపై దృష్టిపెట్టిన మౌలిక రంగ దిగ్గజం ఎల్అండ్టీ ఇందుకు మరిన్ని చర్యలను తీసుకోనున్నట్లు వెల్లడించింది. కీలకంకాని ఆస్తుల విక్రయం, వ్యయ నియంత్రణలు పాటించడం, టెక్నాలజీ వినియోగం ద్వారా ఉత్పాదకతను మెరుగుపరచడం వంటి అంశాలను అమలు చేయనున్నట్లు ఎల్అండ్టీ గ్రూప్ చైర్మన్ ఏంఎ నాయక్ పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా పలు విభాగాలలోగల వ్యాపార పోర్ట్‌ఫోలియో, ప్రాంతాలవారీ విస్తరణ, పటిష్ట బ్యాలన్స్‌షీట్, వృద్ధిలో ఉన్న ఆర్డర్‌బుక్ తదితరాలు కంపెనీ పురోభివృద్ధికి దోహదం చేయనున్నట్లు తెలియజేశారు. కంపెనీ సాధారణ సర్వసభ్య సమావేశం సందర్భంగా వాటాదారులనుద్దేశించి నాయక్ ప్రసంగించారు. తద్వారా పలు అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) లో కంపెనీ పనితీరుపై అప్రమత్తతతోకూడిన ఆశాభావంతో ఉన్నట్లు తెలియజేశారు. కాగా.. గతేడాది(2020–21)కిగాను వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున తుది డివిడెండ్ చెల్లించేందుకు తాజాగా బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే రూ. 18 మధ్యంతర డివిడెండ్ చెల్లించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్అండ్టీ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు యథాతథంగా రూ. 1,624 వద్ద ముగిసింది. -
టాటా మోటార్స్ ఉద్యోగులకు షాక్!
సాక్షి, ముంబై: అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన ఉద్యోగులకు చేదు వార్త అందించింది. అమ్మకాలు లేక ఆదాయాలు క్షీణించి ఇబ్బందులు పడుతున్న సంస్థ టర్నరౌండ్ ప్రణాళిక, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (విఆర్ఎస్) ప్రకటించింది. దాదాపు 42,597 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. సంస్థ మొత్తం ఉద్యోగులలో సగం మంది వీఆర్ఎస్ పథకానికి అర్హులని తాజా అంచనా ద్వారా తెలుస్తోంది. నాలుగేళ్లలో మూడోసారి వీఆర్ఎస్ పథకాన్ని టాటా మోటార్స్ ప్రకటించడం గమనార్హం. తాజాప్రకటన ప్రకారం ఐదేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం సంస్థలో పనిచేసినవారు ఈ పథకానికి అర్హులు. ఉద్యోగి వయసు, సంస్థలో వారి సర్వీసు ఆధారంగా పరిహారాన్ని లెక్కించునున్నారు. అర్హతగల ఉద్యోగులు డిసెంబర్ 11 నుండి జనవరి 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. (చైనాకు షాక్ : వేలకోట్ల పెట్టుబడులు ఇండియాకు) కాగా గత కొన్ని సంవత్సరాలుగా తన ఉద్యోగుల వ్యయాన్ని తగ్గించడానికి టాటా మోటార్స్ ప్రయత్నిస్తోంది. 2017లో మొదట వీఆర్ఎస్ పథకాన్ని ప్రారంభించింది. ఆ రువాత 2019 నవంబర్‌లో 1,600 మంది ఉద్యోగులకు వీఆర్ఎస్ అందించింది. 2019 నుండి ఆటో పరిశ్రమ మందగమనం మధ్య, ఇతర ఆటో మేజర్లైన హీరో మోటోకార్ప్ లిమిటెడ్, టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, అశోక్ లేలాండ్ లిమిటెడ్ ఇలాంటి పథకాలను అమలు చేశాయి. 2020, సెప్టెంబర్ 30తో ముగిసిన రెండవ త్రైమాసికంలో 314.5 కోట్ల రూపాయల నష్టాన్ని కంపెనీ నివేదించింది. అంతకు ముందు ఏడాది కాలంలో కంపెనీ రూ .216.56 కోట్ల నష్టాన్ని నమోదు చేయగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో 8,437.99 కోట్లు రూపాయలను నష్టపోయింది. ఆటో సంక్షోభానికి తోడు కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో డిమాండ్ పడిపోవడంతో ఆటో సంస్థలు మరింత కుదేలైన సంగతి తెలిసిందే. -
వ్యయ నియంత్రణ చర్యలపై బీఎస్ఎన్ఎల్ దృష్టి
న్యూఢిల్లీ: నిధుల కొరతతో అల్లాడుతున్న ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ వ్యయ నియంత్రణ చర్యలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా అవుట్‌సోర్సింగ్‌కి ఇచ్చిన కార్యకలాపాలను క్రమబద్ధీకరించే ప్రయత్నాల్లో ఉంది. తద్వారా ఏటా రూ. 200 కోట్ల దాకా మిగుల్చుకోవచ్చని అంచనా వేస్తోంది. అలాగే టెలిఫోన్ ఎక్సే్చంజీల్లో విద్యుత్ బిల్లుల భారాన్ని కూడా తగ్గించుకోవడం ద్వారా 15 శాతం దాకా ఆదా చేయొచ్చని భావిస్తోంది. బీఎస్ఎన్ఎల్ సీఎండీ పి.కె. పుర్వార్ ఈ విషయాలు వెల్లడించారు. నెలవారీ ఆదాయాలు, వ్యయాలకు (నిర్వహణ వ్యయాలు, జీతభత్యాలు) మధ్య ఏకంగా రూ. 800 కోట్ల తేడా ఉంటోందన్నా రు. వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టినా సవాళ్లు కొంత మేర ఉంటాయన్నారు. ఉద్యోగులకు జూలై నెల జీతాల చెల్లింపుల కోసం అంతర్గత వనరుల ద్వారానే నిధులు సమకూర్చుకున్నామని, టెలికం శాఖ నుంచి ఆర్థిక సహాయమేదీ కోరలేదని పుర్వార్ వివరించారు. ‘ఏయే నిర్వహణ వ్యయాలు తగ్గించుకోగలమో సమీక్షించి తగు చర్యలు తీసుకుంటాం. ఇందులో భాగంగా ముందుగా అవుట్సోర్సింగ్ వ్యయాలను తగ్గించుకుని ఆయా కార్యకలాపాలను అంతర్గతంగానే నిర్వహించేందుకు వీలుంటుందేమో పరిశీలిస్తున్నాం‘ అని ఆయన చెప్పారు. రూ.14 వేల కోట్ల నష్టాలు.. 2018–19 లో బీఎస్ఎన్ఎల్ నష్టాలు రూ. 14,000 కోట్ల మేర ఉంటాయని, ఆదాయం క్షీణించి రూ. 19,308 కోట్లకు పరిమితం కావొచ్చని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్లో 1,65,179 మంది ఉద్యోగులు ఉన్నారు. మొత్తం ఆదాయంలో సిబ్బంది వేతన వ్యయాలు ఏకంగా 75 శాతంగా ఉన్నాయి. అదే ప్రైవేట్ రంగ సంస్థల విషయానికొస్తే.. 2.95–5.59% స్థాయిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నష్టాలు, రుణాల భారంతో కుంగుతున్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లను విలీనం చేసే ప్రతిపాదన కూడా కేంద్రం పరిశీలిస్తోంది. -
పత్తి విత్తనం ధర తగ్గుతుందా?
► మోన్శాంటో రాయల్టీకి కేంద్రం కోత; ధర నియంత్రిస్తూ గెజిట్ ► వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఒకేధర ► ఇలా చేస్తే కొత్త టెక్నాలజీ రాదంటూ కంపెనీల ప్రచారం ► లెసైన్స్ టెర్మినేట్ చేస్తామంటూ 9 కంపెనీలకు మోన్శాంటో బెదిరింపులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ; రైతులకు ప్రయోజనం చేకూర్చేలా బీటీ కాటన్ విత్తనాల ధరలను నియంత్రించడానికి కేంద్రం కదిలింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దేశ వ్యాప్తంగా బీటీ కాటన్ విత్తనాల గరిష్ట అమ్మకం ధరను, ఈ టెక్నాలజీపై చెల్లించే రాయల్టీని నిర్ణయించేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇప్పటికే గెజిట్‌ను విడుదల చేసింది. ఇది అమల్లోకి వస్తే 12 ఏళ్లుగా బీటీ టెక్నాలజీ పేరిట దేశ పత్తి విత్తన మార్కెట్లో ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న అమెరికా కంపెనీ మోన్‌శాంటోకి కొంతయినా కళ్లెం పడే అవకాశముంది. ఈ విత్తనాలకు దేశవ్యాప్తంగా ఒకే ధర అమల్లోకి రావటంతో పాటు రైతులకు, దేశీయ విత్తన కంపెనీలకు కొంత మేరకు ఊరట లభించనుంది. ప్రస్తుతం బీటీ కాటన్ విత్తన ధరలు, మోన్‌శాంటోకి చెల్లించే రాయల్టీ ధర రాష్ట్రానికొక రకంగా ఉన్నాయి. ఈ గెజిట్ అమల్లోకి వస్తే మోన్‌శాంటోకి చెల్లించే రాయల్టీ ధరలు తగ్గడంతో పాటు, దేశ వ్యాప్తంగా పత్తి విత్తనాల ధరలు ఒకే విధంగా ఉంటాయి. ఈ నిర్ణయాన్ని దేశీయ విత్తన కంపెనీలు స్వాగతిస్తుండగా, బీటీ టెక్నాలజీని అందిస్తున్న మహికో మోన్శాంటో బయోటెక్ ఇండియా (ఎంఎంబీఎల్) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ అభ్యర్థన మేరకు ఇప్పటికే కేంద్రం గెజిట్ జారీ చేయడంపై నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఏఐ) ప్రెసిడెంట్ మండవ ప్రభాకరరావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రైతులు, దేశీ విత్తన కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. బీటీ టెక్నాలజీపై మోన్శాంటో గుత్తాధిపత్యాన్ని దర్యాప్తు చేయాల్సిందిగా కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియాను (సీసీఐ) కేంద్రం ఆదేశించింది కూడా. మరోవైపు... ఇలా ధరలను కేంద్రం నియంత్రిస్తే తిరిగి దేశం ‘కంట్రోల్ రాజా’ హయాంలోకి వెళుతుందని బహుళజాతి విత్తన కంపెనీలు వాదిస్తున్నాయి. దీంతో పరిశోధనలు ఆగిపోయి రైతులకు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రాదన్నది వీరి వాదన. టెర్మినేషన్ బెదిరింపులు ఈ విషయంలో విత్తన కంపెనీలను దారిలోకి తెచ్చుకోవడానికి మోన్శాంటో సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇందులో భాగంగా దేశంలో అత్యధికంగా బీటీ కాటన్ విత్తనాలు విక్రయించే నూజివీడు సీడ్స్‌పై టెర్మినేషన్ అస్త్రం ప్రయోగించింది. రాయల్టీ బకాయిలు చెల్లించనందుకు నూజివీడు సీడ్స్, దాని అనుబంధ కంపెనీలు ప్రభాత్ సీడ్స్, ప్రభాత్ అగ్రిబయోటెక్లకు బీటీ టెక్నాలజీ లెసైన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాశి, కావేరితో పాటు కొన్ని కంపెనీల లెసైన్స్‌ల టెర్మినేషన్ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మీడియాకు లీకులిస్తోంది. కేంద్ర నిర్ణయంపై కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నట్లు సమాచారం. కాగా ఇండియా అతిపెద్ద మార్కెట్ కనక రాయల్టీ రేటు తగ్గించినా మోన్శాంటో ఎక్కడికీ పోదని, కంపెనీ ఒత్తిడికి తలొగ్గకుండా కేంద్రం తన నిర్ణయాన్ని అమలు చేయాలని ఒక విత్తన కంపెనీ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మోన్శాంటో రూ.183 రాయల్టీ తీసుకుంటుండగా, కేంద్రం ఈ రాయల్టీని రూ. 100 లోపునకు పరిమితం చేస్తుందనేది కంపెనీల అంచనా. నియంత్రణకు ఆద్యుడు వైఎస్.. మోన్శాంటో కంపెనీ దేశంలో తొలిసారిగా బీటీ టెక్నాలజీని (బోల్‌గార్డ్) ప్రవేశపెట్టింది. 2003 నుంచి 2005 వరకు 450 గ్రాముల బీటీ విత్తన ప్యాకెట్ రిటైల్ ధర రూ.1,600 వరకు ఉండేది. ఇందులో మోన్శాంటో వాటా రూ.750. దాన్ని బీటీ టెక్నాలజీ వినియోగించుకున్నందుకు రాయల్టీగా వసూలు చేసేది. రాయల్టీ పేరిట అడ్డగోలు వసూళ్లను గమనించిన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి నియంత్రణ చర్యలు తీసుకున్నారు. బోల్‌గార్డ్-1 టెక్నాలజీ విత్తన ధరను రూ. 750కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు మోన్శాంటో కంపెనీకి చెల్లించే రాయల్టీని కూడా రూ. 750 నుంచి రూ. 150కి తగ్గించారు. తర్వాతి కాలంలో మిగిలిన రాష్ట్రాలూ వైఎస్ బాటను అనుసరించాయి. ఇప్పటి వరకు మోన్శాంటోకు రాయల్టీ రూపంలో విత్తన కంపెనీలు రూ. 6,000 కోట్ల వరకు చెల్లించినట్లు ఒక అంచనా. ఇదీ వివాదం.. బీటీ టెక్నాలజీకి చెల్లించాల్సిన రాయల్టీపై విత్తన కంపెనీలకు మోన్శాంటోకు మధ్య తీవ్ర వివాదమే నడుస్తోంది. వివిధ రాష్ట్రాలు బీటీ కాటన్ విత్తనాల ధరలను నియంత్రించడమే కాకుండా, మోన్‌శాంటోకి చెల్లించే రాయల్టీ ధరలను కూడా తగ్గిస్తున్నాయి. ఉదాహరణకు 2011 నుంచి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక ప్యాకెట్‌కు రాయల్టీ రూ.90గా ఉంటే 2015లో తెలంగాణ రాష్ట్రం ఈ రాయల్టీని రూ.50కి తగ్గించింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రూ.90 కొనసాగుతోంది. ఇప్పుడు విత్తనాల ప్యాకెట్ రిటైల్ ధర తెలంగాణలో రూ.830గా, ఏపీలో రూ.930గా ఉంది. మోన్శాంటో మాత్రం రాష్ట్రాలు తగ్గించిన ధరలతో సంబంధం లేకుండా ఒప్పందం ప్రకారం 450 గ్రాముల బీజీ2 ప్యాకెట్‌కి దేశీయ కంపెనీలు రూ.183 రాయల్టీ చెల్లించాల్సిందేనంటోంది. నూజివీడు,రాశి,కావేరి,అజిత్ సీడ్స్ కంపెనీలు రాయల్టీ చెల్లించడం లేదంటూ ముంబై హైకోర్టును ఆశ్రయించింది కూడా. విత్తన కంపెనీలు రూ.450 కోట్ల రాయల్టీ బకాయి పడ్డాయన్నది మోన్శాంటో వాదన. ఇందులో ఒక్క నూజివీడు సీడ్సే రూ.160 కోట్లు చెల్లించాల్సి ఉంది. విత్తన కంపెనీలు మాత్రం మోన్‌శాంటోనే రూ.1,800 కోట్లు వెనక్కివ్వాల్సి ఉంటుందని వాదిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు రాయల్టీ తగ్గించినా తాము అధిక రాయల్టీనే చెల్లించాం కనక ఆ మొత్తం వెనక్కి ఇవ్వాలంటున్నాయి. మోన్శాంటో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాల జీవోలతో సంబంధం లేకుండా ఇరు కంపెనీల మధ్య ఒప్పందం ప్రకారం చెల్లించాలంటోంది. విత్తన ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నా రాష్ట్రాలు ఎంఆర్పీ ధరను తగ్గిస్తుంటే మోన్శాంటో మాత్రం పాత ధరే చెల్లించాలనడం ఎంతవరకూ సమంజసమని కావేరి సీడ్స్ చైర్మన్ జీవీ భాస్కరరావు ప్రశ్నించారు. కేంద్ర గెజిట్ ఆమోదం పొందితే ఈ వివాదానికి పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.