36 వేల దిగువకు సెన్సెక్స్‌

BSE Smallcap index outperforms Sensex  - Sakshi

బడ్జెట్‌పై అప్రమత్తత 

బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు 

69 పాయింట్ల నష్టంతో 35,965కు సెన్సెక్స్‌  

22 పాయింట్లు కోల్పోయి 11,028కు నిఫ్టీ

బడ్జెట్‌కు ముందు రోజు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో స్టాక్‌ మార్కెట్‌ బుధవారం హెచ్చుతగ్గులమయంగా కొనసాగింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగా ఉండటం కూడా ప్రతికూల ప్రభావం చూపడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 36వేల పాయింట్ల దిగువకు పడిపోగా,  ఇంట్రాడేలో నిఫ్టీ 11 వేల పాయింట్ల దిగువకు పతనమైంది. అయితే చివర్లో కొనుగోళ్ల కారణంగా నిఫ్టీ 11 వేల పాయింట్లపైన నిలదొక్కుకోగలిగింది. మోదీ ప్రభుత్వ చివరి బడ్జెట్‌ కావడంతో ఇన్వెస్టర్లు వరుసగా రెండో రోజూ జాగ్రత్తగా వ్యవహరించారు. దీంతో స్టాక్‌ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టపోయింది. చివరి గంటలో కొనుగోళ్లు ఒకింత పుంజుకోవడంతో నష్టాలు తగ్గాయి. మొత్తం మీద సెన్సెక్స్‌ 69 పాయింట్ల నష్టంతో 35,965 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో 11,028 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 215 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.  

నష్టాల్లో ఫార్మా షేర్లు... 
అమెజాన్, వారెన్‌ బఫెట్, జేపీ మోర్గాన్‌లు సంయుక్తంగా ఆరోగ్యరంగంలోకి ప్రవేశించనున్నాయన్న వార్తల నేపథ్యంలో మన ఫార్మా షేర్లు బాగా నష్టపోయాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ 3.7 శాతం పతనమైంది. హెచ్‌యూఎల్,  సన్‌ ఫార్మా, కోల్‌ ఇండియా, ఇన్ఫోసిస్, ఐటీసీ, టీసీఎస్, విప్రో, ఎల్‌ అండ్‌ టీ, పవర్‌ గ్రిడ్, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, యాక్సిస్‌ బ్యాంక్, బజాజ్‌ ఆటో ఎస్‌బీఐలు 3 శాతం వరకూ నష్టపోయాయి. కోటక్‌ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, టాటా మోటార్స్, యస్‌ బ్యాంక్, ఏషియన్‌ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు లాభాల్లో ముగిశాయి.  

అందరి కళ్లూ బడ్జెట్‌పైనే.. 
ఇన్వెస్టర్ల కళ్లన్నీ బడ్జెట్‌పైనే ఉన్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. అయితే  గత రెండేళ్లతో పోల్చితే బడ్జెట్‌పై అంచనాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని పేర్కొన్నారు. ద్రవ్య క్రమశిక్షణ, వృద్ధి సంస్కరణల మధ్య సమతూకం సాధించాల్సిన అవసరముందని వివరించారు. బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి కీలకం కానున్నదని, మౌలికాభివృద్ధి, సంస్కరణలు కూడా ముఖ్యమైన అంశాలేనని పేర్కొన్నారు. వ్యక్తిగత, కార్పొరేట్‌ పన్నుల్లో తగ్గుదల ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయని వివరించారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top