బాకీల వసూలుకు... బ్యాంకుల జట్టు!

Banks sign inter-creditor agreement on resolving NPAs - Sakshi

ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారానికి బ్యాంకుల మధ్య ఒప్పందం

మెహతా కమిటీ సిఫార్సులతో ఐసీఏ

రూ. 50 – 500 కోట్ల లోపు రుణాలపై దృష్టి

ఇలాంటి రుణాల మొత్తం రూ. 3.1 లక్షల కోట్లు

లీడ్‌ బ్యాంకర్‌కి పరిష్కార బాధ్యతలు  

న్యూఢిల్లీ: భారీగా పేరుకుపోతున్న మొండిబాకీల (ఎన్‌పీఏ) సమస్యను సత్వరం పరిష్కరించుకోవడంపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దృష్టి సారించాయి.  ఇందులో భాగంగా సునీల్‌ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు సుమారు 24 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సోమవారం అంతర్‌–రుణదాతల ఒప్పందాన్ని (ఐసీఏ) కుదుర్చుకున్నాయి. కన్సార్షియం కింద ఇచ్చిన రూ. 500 కోట్ల లోపు రుణబాకీల రికవరీకి ఇది తోడ్పడనుంది. ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో పాటు 18 ప్రభుత్వ రంగ బ్యాంకులు, మూడు ప్రైవేట్‌ రంగ బ్యాంకులు, ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

తమ తమ బోర్డుల నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత మిగతా బ్యాంకులూ దీన్లో భాగం అవుతాయని ఆశిస్తున్నాం. జూలై ఆఖరు నాటికి ఇది అమల్లోకి రావొచ్చు‘ అని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఎండీ సునీల్‌ మెహతా విలేకరులకు తెలిపారు. తమ ప్రధాన కార్యాలయాల నుంచి అనుమతులు పొందిన తర్వాత విదేశీ బ్యాంకులు కూడా ఐసీఏలో భాగమయ్యే అవకాశం ఉందని.. అయితే ఇందుకు కొంత సమయం పట్టొచ్చని ఆయన చెప్పారు.

ప్రధానంగా రూ.50 కోట్ల నుంచి రూ.500 కోట్ల దాకా విలువుండే ఎన్‌పీఏలను పరిష్కరించటం  లక్ష్యమని.. రూ. 500–రూ. 2,000 కోట్ల ఖాతాలను వేరేరకంగా డీల్‌ చేయడం జరుగుతుందని మెహతా వివరించారు. 2018 మార్చి ఆఖరు నాటికి రూ. 50– 500 కోట్ల కేటగిరీలో సుమారు రూ.3.10 లక్షల కోట్ల మేర, రూ.50 కోట్ల లోపు కేటగిరీలో రూ.2.10 లక్షల కోట్ల మేర ఎన్‌పీఏలున్నాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థలో దాదాపు 12 శాతం మేర మొండిబాకీలు పేరుకుపోయాయి.

గతేడాది డిసెంబర్‌ ఆఖరు నాటికి ఇవి రూ.9 లక్షల కోట్ల మేర ఉన్నాయి. ఎన్‌పీఏల పరిస్థితి మరింత దిగజారే అవకాశాలున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ సైతం ఇటీవలే హెచ్చరించిన నేపథ్యంలో బ్యాంకుల తాజా ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. మొండిబాకీల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు సాధ్యాసాధ్యాల పరిశీలనపై అధ్యయనం చేసిన సునీల్‌ మెహతా కమిటీ ఇచ్చిన ప్రాజెక్ట్‌ సశక్త్‌లో ఈ ఐసీఏ ప్రతిపాదన కూడా ఉంది.  

చరిత్రాత్మక సందర్భం..
మొండిబాకీల రికవరీ దిశగా ఐసీఏ కీలకమైన ముందడుగుగా కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ అభివర్ణించారు. భారీ మొత్తంలో రుణాలను రాబట్టడంతో పాటు అనేక ఉద్యోగాలను, జాతి సంపదను కాపాడగలిగే చక్కని ప్రణాళికలు రూపొందినా.. ఒకరిద్దరు బ్యాంకర్ల కారణంగా నెలలు, ఏళ్ల తరబడి పెండింగ్‌లో పడిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా బ్యాంకర్లంతా ఏకతాటిపైకి రావడం హర్షణీయమని చెప్పారు.

‘ఇది చరిత్రాత్మక సందర్భం. దేశ విశ్వసనీయతపై ప్రతికూల ప్రభావం చూపిన ఎన్‌పీఏల సమస్య భవిష్యత్‌లో మళ్లీ తలెత్తకుండా.. సమష్టిగా వ్యవహరించాల్సిన అవసరాన్ని బ్యాంకులు గుర్తించాయి. తమంతట తామే సమస్య పరిష్కారానికి ఈ ఒప్పందాన్ని రూపొందించుకున్నాయి. ఇది సమాంతర వ్యవస్థగా కాకుండా.. దివాలా చట్టానికి లోబడే పనిచేస్తుంది. ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ వంటి భారీ నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు కూడా ఐసీఏలో చేరుతున్నాయి. ఐసీఐసీఐ వంటి ఇతర బ్యాంకులు కూడా ఇందులో భాగం కానున్నాయి‘ అని ఆయన చెప్పారు.   

ఒప్పందం పనిచేసేదిలా...
నిరర్ధక ఆస్తుల సమస్య పరిష్కారం కోసం ఉద్దేశించిన పంచముఖ వ్యూహం ప్రాజెక్ట్‌ సశక్త్‌లో... ఈ ఒప్పందం భాగంగా ఉండనుంది. దీని ప్రకారం సదరు ఎన్‌పీఏకి సంబంధించి అత్యధిక మొత్తాన్ని రుణంగా మంజూరు చేసిన బ్యాంకు లీడ్‌ లెండర్‌గా ఉంటుంది. ఈ బ్యాంకు ఆర్‌బీఐ నిబంధనలతో పాటు ఇతరత్రా చట్టాలకు అనుగుణంగా తగు పరిష్కార ప్రణాళికను రూపొం దించి, పర్యవేక్షణ కమిటీకి సమర్పిస్తుంది. దాని సిఫార్సులను కూడా కలిపి.. మొత్తం ప్రణాళికను మిగతా రుణదాతల ముందు ఉంచుతుంది.

మొత్తం రుణంలో దాదాపు 66% వాటా ఉన్న రుణదాతలు(మెజారిటీ) దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఐసీఏలోని మిగతా సంస్థలన్నీ కూడా ఇందులో ప్రతిపాదనలకు కట్టుబడి ఉండాలి. ఒకవేళ ఏ రుణదాత అయినా దీన్ని వ్యతిరేకించిన పక్షంలో నిర్దిష్ట శాతం మేర వారి ఎన్‌పీఏని కొనుగోలు చేసేందుకు లీడ్‌ లెండరుకు హక్కు ఉంటుంది. అయితే, ఇదేమీ తప్పనిసరి కాదు.

అలాగే ప్రతిపాదనను వ్యతిరేకించిన రుణదాత.. మిగతా సంస్థల రుణ వాటాలను కొనుగోలు చేసేందుకూ వెసులుబాటు ఉంటుంది. కన్సార్షియంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కలిసి రుణ పరిష్కార ప్రణాళిక అమలుకు లీడ్‌ లెండరును తమ ఏజెంటుగా వ్యవహరించేందుకు నియమించుకుంటాయి. ప్రణాళిక అమలుకు లీడ్‌ లెండరే అవసరమైన నిపుణులను ఎంపిక చేసి, 180 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top