హైదరాబాద్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ మరో ప్లాంటు | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ మరో ప్లాంటు

Published Tue, Apr 18 2017 1:09 AM

హైదరాబాద్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ మరో ప్లాంటు - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సూర్య బ్రాండ్‌తో ఆహారోత్పత్తుల తయారీలో ఉన్న హైదరాబాద్‌ ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ మరో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు లేదా చిత్తూరులో ఏడాదిలో ఇది రానుంది. ప్లాంటు ఏర్పాటుకు కావాల్సిన మెషినరీకి రూ.10 కోట్ల దాకా వ్యయం చేయనున్నట్టు కంపెనీ ఎండీ రవీంద్ర మోదీ ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు.

5 ఎకరాల స్థలంలో అత్యాధునిక టెక్నాలజీతో ఫ్యాక్టరీని నిర్మిస్తామని, ముడి పదార్థాల లభ్యత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకున్నామని రవీంద్రమోదీ వివరించారు. ఇప్పటికే కంపెనీకి హైదరాబాద్‌లోని  జీడిమెట్లలో 17,000 టన్నుల వార్షిక సామర్థ్యం గల ప్లాంటుంది. 350కి పైగా ఉద్యోగులున్న ఈ సంస్థ... ఉత్పత్తుల అభివృద్ధికి ఆధునిక ల్యాబొరేటరీని సైతం సంస్థ నిర్వహిస్తోంది.

ఏడాదిలో దేశవ్యాప్తంగా..: సూర్య బ్రాండ్‌ ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించింది. మసాలాలు, మసాలా మిశ్రమాలు, పచ్చళ్లు, స్నాక్స్, స్వీట్లను విక్రయిస్తోంది. విదేశాలకూ వీటిని ఎగుమతి చేస్తోంది. వచ్చే ఏడాదికల్లా దేశవ్యాప్తంగా విస్తరించనుంది. మూడు నెలల్లో సొంతంగా ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెస్తున్నామని, త్వరితగతిన ఉత్పత్తులను కస్టమర్లకు సరఫరా చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రవీంద్ర మోదీ తెలియజేశారు. ఏపీ ప్లాంటులో పచ్చళ్లు, మసాలా పొడులను తయారు చేయనున్నట్లు చెప్పారు. 15,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో ఈ యూనిట్‌ను నెలకొల్పుతున్నామని, కొత్త ప్లాంటు ద్వారా 100 మందికి ఉపాధి లభిస్తుందని తెలియజేశారు.
 

Advertisement
 
Advertisement