ఏంజెల్‌ ట్యాక్స్‌ సెక్షన్‌ ఎత్తివేయాలి 

Angel Taxes section should be lifted - Sakshi

ముంబై ఏంజెల్స్‌ నెట్‌వర్క్‌ అభ్యర్థన  

ముంబై: స్టార్టప్‌ సంస్థల్లో ఏంజెల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై పన్ను విధించాలన్న వివాదాస్పద సెక్షన్‌ను ఆదాయ పన్ను చట్టం నుంచి తొలగించాలని ముంబై ఏంజెల్స్‌ నెట్‌వర్క్‌ ప్రభుత్వాన్ని కోరింది. ఈ సమస్య పరిష్కారానికి ఇదొక్కటే మార్గమని సంస్థ సీఈవో నందిని మన్‌సింఖా పేర్కొన్నారు. అయితే, వివాద పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ.. సెక్షన్‌ ఎత్తివేయడం అంత సులభంగా జరగకపోవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. స్టార్టప్, ఏంజెల్‌ ఇన్వెస్టర్‌ పదాలను సముచితంగా నిర్వచించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని నందిని చెప్పారు. స్టార్టప్స్‌కి సంబంధించిన పన్నుల చట్టాలు దుర్వినియోగమవుతున్నాయనే ఉద్దేశంతో వీటిల్లోకి వచ్చే పెట్టుబడులపై ప్రభుత్వం ప్రత్యేక సెక్షన్‌ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 56 (2) ప్రకారం.. సముచిత వేల్యుయేషన్‌కి మించి స్టార్టప్స్‌లో చేసే పెట్టుబడులను ప్రీమియంగా పరిగణించి, 30 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది. ఇప్పటికే,  తొలి దశలో పెట్టుబడులు పెట్టే ఏంజెల్‌ ఇన్వెస్టర్ల నుంచి నిధులు దొరక్క సతమతమవుతున్న స్టార్టప్స్‌కి ఇది సమస్యాత్మకంగా మారింది. దీనివల్ల ఏంజెల్‌ ఇన్వెస్టర్లు పూర్తిగా దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్న స్టార్టప్‌ సంస్థలు.. ఈ సెక్షన్‌ను ఎత్తివేయాలని కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి సర్టిఫికేషన్‌ పొందిన సంస్థలకు దీన్నుంచి కొంత మినహాయింపు ఉంటుందని కేంద్రం చెబుతోంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top