ఎయిర్‌టెల్‌ డీటీహెచ్, ‘డిష్‌’ విలీనం! Airtel And Dish TV Agree To Merge DTH Operations | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ డీటీహెచ్, ‘డిష్‌’ విలీనం!

Published Fri, Dec 13 2019 2:37 AM

Airtel And Dish TV Agree To Merge DTH Operations - Sakshi

ముంబై: దేశ టీవీ ప్రసార పంపిణీ విభాగంలో అతిపెద్ద కంపెనీ ఆవిర్భావానికి అడుగులు పడుతున్నాయి. ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ, డిష్‌ టీవీ విలీనానికి ఇరు కంపెనీల మధ్య కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చలు ముగింపు దశకు చేరాయి. ఇరు కంపెనీల ప్రమోటర్లతోపాటు, ప్రైవేటు ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్‌పింకస్‌ డీల్‌ విషయమై ఒక అంగీకారానికి వచ్చినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ముందుగా డిష్‌ టీవీ తన డీటీహెచ్‌ వ్యాపారాన్ని వేరు చేస్తుంది. ఆ తర్వాత భారతీ టెలీ మీడియాతో విలీనం చేస్తుంది. ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీకి భారతీ టెలీమీడియా మాతృ సంస్థగా ఉంది. ఇరు కంపెనీలు కలిస్తే 4 కోట్ల మంది టీవీ సబ్ర్‌స్కయిబర్లతో ప్రపంచంలో అతిపెద్ద టీవీ డి్రస్టిబ్యూషన్‌ కంపెనీగా అవతరిస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. విలీన పథకానికి సంబంధించి తుది అంశాలపై కసరత్తు జరుగుతున్నట్టు వెల్లడించాయి.   

ఆధిపత్యం..
ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ, డిష్‌ టీవీలు కలవడం వల్ల డైరెక్ట్‌ టు హోమ్‌ (డీటీహెచ్‌) టీవీ ప్రసారాల పంపిణీ మార్కెట్లో ఆధిపత్యానికి అవకాశం వచి్చనట్టు అవుతుంది. ఎందుకంటే అప్పుడు 87 శాతం మార్కెట్‌ కేవలం రెండు సంస్థల చేతుల్లోనే ఉంటుంది. ఎయిర్‌టెల్‌ డిజిటల్, డిష్‌ టీవీ విలీన కంపెనీకి 4 కోట్ల కస్టమర్లు ఉంటారు. తద్వారా 62 శాతం మార్కెట్‌ వాటా ఈ సంస్థ చేతుల్లోనే ఉంటుంది. సెపె్టంబర్‌ నాటికి డిష్‌ టీవీకి 23.94 మిలియన్‌ చందాదారులు, ఎయిర్‌టెల్‌ డిజిటల్‌కు 16.21 మిలియన్‌ చందాదారులు ఉన్నారు. టాటా స్కై 25 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉంది. మిగిలిన వాటా సన్‌ టీవీకి చెందిన సన్‌ డైరెక్ట్‌ సొంతం. టెలికం మార్కెట్‌ మాదిరే డీటీహెచ్‌ మార్కెట్లోనూ ఒకప్పుడు ఆరుగురు ప్లేయర్లు ఉండేవారు. ఎస్సెల్‌ గ్రూపునకు చెందిన డిష్‌ టీవీ, కొంత కాలం క్రితం వీడియోకాన్‌ డీటీహెచ్‌ను కొనుగోలు చేసింది. రిలయన్స్‌ డిజిటల్‌ టీవీని వేరొక సంస్థ కొనుగోలు చేసింది. కానీ, ఈ సంస్థ సేవలు చాలా నామమాత్రంగానే ఉన్నాయి. ‘‘విలీనం వల్ల యూజర్‌ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) పరంగా ఒత్తిడి తగ్గిపోతుంది. అప్పుడు రెండు దేశవ్యాప్త కంపెనీలు, ఒక ప్రాంతీయ కంపెనీయే ఉంటుంది’’ అని ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రోహిత్‌ డోకానియా తెలిపారు.

విలీన కంపెనీ లిస్టింగ్‌
భారతీ టెలీమీడియాలో 20 శాతం వాటాను వార్‌బర్గ్‌ పింకస్‌ 2017 డిసెంబర్‌లో కొనుగోలు చేసింది. ఇందుకు 350 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టింది. తాజా విలీనం తర్వాత కూడా వార్‌బర్గ్‌పింకస్‌ తన పెట్టుబడులను కొనసాగించనుంది. డీల్‌ అనంతరం భారతీ టెలీమీడియాను స్టాక్‌ మార్కెట్లలో లిస్ట్‌ కూడా చేయనున్నారు. డిష్‌ టీవీ డీటీహెచ్‌ వ్యాపారాన్ని భారతీ టెలీమీడియాలో విలీనం తర్వాత.. నాన్‌ డీటీహెచ్‌ సేవలతో కొనసాగుతుంది. ఇందులో డిష్‌ ఇన్‌ఫ్రా సేవలు ఉంటాయి. అలాగే, సీఅండ్‌ఎస్‌ మీడియానెట్‌లో 51% వాటా కలిగి ఉంటుంది. ‘‘సెప్టెంబర్‌ నాటికే ఒప్పంద దశకు వచ్చారు. సుప్రీంకోర్టు తీర్పుతో అంతా ఆగిపోయింది. మళ్లీ చర్చలు మొదలయ్యాయి’’అని ఈ వ్యవహారం గురించి తెలిసిన ఓ వ్యక్తి తెలిపారు. టెలికం కంపెనీలు ఏజీఆర్‌ బకాయిలను 3 నెలల్లోపు చెల్లించాలంటూ ఇటీవల సుప్రీం తీర్పు వచి్చన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement