టాప్‌–3 ఇంధన సంస్థ.. ‘రిలయన్స్‌’

RIL becomes world's 3rd largest energy firm

టాప్‌ 10లో ఐవోసీ, 11వ స్థానంలో ఓఎన్‌జీసీ

ప్లాట్స్‌ టాప్‌ 250 గ్లోబల్‌ ఎనర్జీ కంపెనీల జాబితా

అగ్రస్థానంలో రష్యన్‌ సంస్థ గాజ్‌ప్రోమ్‌  

న్యూఢిల్లీ: దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌... ప్రపంచంలోనే 250 అతి పెద్ద ఇంధన సంస్థల జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే ఏడో స్థానం నుంచి నాలుగు స్థానాలు ఎగబాకింది. ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ప్లాట్స్‌ రూపొందించిన ఈ టాప్‌ 250 గ్లోబల్‌ ఎనర్జీ కంపెనీల జాబితాలో ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ 7వ స్థానంలో నిలిచింది. ఇది గతేడాది 14వ స్థానంలో ఉంది. మరోవైపు ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) 20వ స్థానం నుంచి 11వ స్థానానికి చేరుకుంది. 2017 ర్యాంకింగ్స్‌లో మొత్తం 14 భారతీయ ఇంధన కంపెనీలు చోటు దక్కించుకున్నట్లు గ్లోబల్‌ ప్లాట్స్‌ ఒక ప్రకటనలో తెలియజేసింది.

బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలోనే అతి పెద్దదైన కోల్‌ ఇండియా మాత్రం... ఈ జాబితాలో 38వ స్థానం నుంచి 45వ స్థానానికి పడిపోయింది. లిస్టులో భారత్‌ పెట్రోలియం(39), హిందుస్తాన్‌ పెట్రోలియం (48), పవర్‌ గ్రిడ్‌ (81), గెయిల్‌ (106) ర్యాంకులు దక్కించుకున్నాయి. అమెరికన్‌ సంస్థ ఎక్సాన్‌ మొబిల్‌ 12 సంవత్సరాల ఆధిపత్యానికి తెరదించుతూ.. రష్యాకి చెందిన గాజ్‌ప్రోమ్‌ ఈ లిస్టులో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అటు జర్మనీకి చెందిన ఇ.ఆన్‌ ఏకంగా 112 స్థానాలు ఎగబాకి 114వ ర్యాంకు నుంచి రెండో స్థానానికి చేరడం గమనార్హం.

ఇక ఇ.ఆన్‌ తరువాతి స్థానాల్లో రిలయన్స్, కొరియా ఎలక్ట్రిక్, చైనా పెట్రోలియం, రష్యన్‌ సంస్థ పీజేఎస్‌సీ లుక్‌ ఆయిల్‌ వరుసగా నిలిచాయి. ఎక్సాన్‌ మొబిల్‌ ఈసారి 9వ స్థానానికి పడిపోయింది. ఆస్తుల విలువ, ఆదాయాలు, లాభాలు, పెట్టుబడులపై రాబడులు అనే నాలుగు అంశాల ప్రాతిపదికగా ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ప్లాట్స్‌ ఈ జాబితాను రూపొందించింది.  టాప్‌ 10 కంపెనీల నికర లాభాలు గతేడాది 63.7 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top