ఇంగ్లిష్, మ్యాథ్స్‌.. చాలా ఈజీ!

360 Learning developed by Worksheets - Sakshi

వర్క్‌షీట్స్‌ను అభివృద్ధి చేసిన  360 లెర్నింగ్‌

3,500 మంది విద్యార్థుల నమోదు

త్వరలోనే పాఠశాలలతో ఒప్పందం

6 నెలల్లో రూ.5 కోట్ల  నిధుల సమీకరణ

‘స్టార్టప్‌ డైరీ’తో    కో–ఫౌండర్‌ జితేంద్ర

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విద్యా రంగంలో స్టార్టప్స్‌ అంటే? స్కూల్‌ సిలబస్‌ను స్మార్ట్‌ఫోన్లలోకి తీసుకొచ్చినవి.. ఆన్‌లైన్‌లో ఫీజులు, పాఠశాల నిర్వహణ చేసేవి.. లంచ్‌ బాక్స్‌లు అందించేవి..., స్కూల్‌ బిల్డింగ్స్‌ నిర్మాణం కోసం రుణాలిచ్చేవి... ఇలా చాలా ఉన్నాయి. కానీ, దేశంలో తొలిసారిగా వ్యక్తిగత విద్యార్థుల అభ్యసన ప్రక్రియలను అందుబాటులోకి తెచ్చింది మాత్రం హైదరాబాద్‌కు చెందిన ‘360 లెర్నింగే!’. అందులోనూ ఇంగ్లిష్, గణితం వంటి కీలక సబ్జెక్ట్స్‌ వర్క్‌షీట్స్‌ను కూడా అభివృద్ధి చేసింది. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్‌ జితేంద్ర మాచిరాజు ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.  ‘‘మాది తూర్పు గోదావరి జిల్లా. బీటెక్‌ పూర్తయ్యాక ఎక్స్‌సీడ్‌ ఎడ్యుకేషన్‌లో ఎనిమిదేళ్లు పనిచేశా. తర్వాత హయత్‌నగర్, చంపాపేట్‌లో సొంతంగా స్కూల్స్‌ పెట్టా. ఎక్స్‌సీడ్‌లో, స్కూల్స్‌లో ఉన్న సమయంలో గమనించిందేమిటంటే? విదేశాల్లో మాదిరిగా ఇక్కడి పాఠశాలల్లో వ్యక్తిగత అభ్యసన ప్రక్రియలు లేవు. దీనివల్లే విద్యార్థుల విద్యా విధానంలో తేడాలొస్తున్నాయని గమనించా! దీన్ని అధిగమించాలంటే స్టూడెంట్స్‌కు పర్సనల్‌ లెర్నింగ్‌ కావాలి. అందుకే మిత్రుడు కర్నాటి ప్రమోద్‌ కుమార్‌తో కలిసి 2015 నవంబర్‌ 14న రూ.10 లక్షల పెట్టుబడితో హైదరాబాద్‌ కేంద్రంగా 360 లెర్నింగ్‌ఎడ్యుటెక్‌.కామ్‌ను ప్రారంభించాం. 

ఇంటికే వర్క్‌షీట్స్‌.. 
ప్రస్తుతం 3 నుంచి 13 ఏళ్ల వయస్సు విద్యార్థులు లేదా 8వ తరగతి లోపు విద్యార్థులకు గణితం, ఇంగ్లిష్‌ సబ్జెక్ట్స్‌ వర్క్‌షీట్స్‌ అందిస్తున్నాం. పోటీ పరీక్షలతో సహా దేనికైనా మ్యాథ్స్, ఇంగ్లిష్‌పై పట్టుండాలి. అందుకే ఈ సబ్జెక్ట్స్‌ మీద ఫోకస్‌ చేశాం. విద్యార్థి పరిజ్ఞానం, అభ్యసన తీరును బట్టి ఒక్కొక్క విద్యార్థికి ప్రత్యేకంగా వర్క్‌షీట్స్‌ను రూపొందిస్తాం. ఇందుకోసం 8 మంది నిపుణుల బృందం ఉంది. ఇందులో సబ్జెక్ట్స్‌ నిపుణులతో పాటూ పిల్లల మానసిక వేత్తలూ ఉంటారు. వర్క్‌షీట్స్‌ను పరిష్కరించేటపుడు ఏమైనా సందేహాలొస్తే... వీడియోకాల్‌ ద్వారా నిపుణులు అందుబాటులోకి వస్తారు. ప్రతి వారం విద్యార్థికి వ్యక్తిగత వర్క్‌షీట్స్‌ను ఇంటికి తీసుకెళ్లి ఇస్తాం. వాటి ని పరిష్కరించాక నిపుణుల బృందం పరిశీలిస్తుంది. తర్వాత విద్యార్థి అభ్యసన శక్తిని అంచనా వేసి వేరే వర్క్‌షీట్స్‌ అందిస్తుంటాం. 

5 నెలలకు రూ.5 వేలు.. 
ప్రస్తుతం 360 లెర్నింగ్‌లో 3,500 మంది విద్యార్థులున్నారు. ఒక్క విద్యార్థికి ఒక్క సబ్జెక్ట్‌ వర్క్‌షీట్స్‌కు గాను 5 నెలలకు రూ.5 వేలు చార్జీ ఉంటుంది. త్వరలో ఐఐటీ ఫౌండేషన్‌ వర్క్‌షీట్స్‌ను విద్యార్థులకు అందిస్తాం. ఏడాదిలో మరో 2 వేల మంది విద్యార్థులను చేరుకోవటంతో పాటూ 10, 12వ తరగతుల గణితం, ఇంగ్లిష్‌ సిలబస్‌లను అందుబాటులోకి తేవాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం ఆయా సిలబస్‌ల వర్క్‌షీట్స్‌ రూపొందిస్తున్నాం. త్వరలోనే పాఠశాలలతో ఒప్పందం చేసుకుంటాం. ఏడాదిలో సుమారు 15 పాఠశాలలతో ఒప్పందంతో సుమారు రూ.కోటి వ్యాపారాన్ని లకి‡్ష్యంచాం.  

రూ.5 కోట్ల నిధుల సమీకరణ.. 
గతేడాది రూ.75 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది రూ.2 కోట్లు వ్యాపారాన్ని చేరుకుంటాం. త్వరలో బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో సేవలను ప్రారంభించనున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 40 మంది ఉద్యోగులున్నా రు. అజయ్‌ ఈడూరి, రవి మంథా  ఇద్దరు కలిసి సీడ్‌ రౌండ్‌లో రూ.1.2 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఏంజిల్‌ రౌండ్‌లో రూ.5 కోట్లు సమీకరించనున్నాం.  ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయి. 6 నెలల్లో డీల్‌ క్లోజ్‌ చేస్తాం’’ అని జితేంద్ర వివరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top