35 విదేశీ  శాఖల మూసివేత  | 35 overseas Closure of branches | Sakshi
Sakshi News home page

35 విదేశీ  శాఖల మూసివేత 

Mar 2 2018 5:35 AM | Updated on Mar 2 2018 5:35 AM

35 overseas Closure of branches - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) విదేశీ కార్యకలాపాల క్రమబద్ధీకరణపై దృష్టి సారించాయి. లాభసాటిగా లేని 35 శాఖలు, రిప్రజెంటేటివ్‌ కార్యాలయాలను మూసివేశాయి. స్వచ్ఛమైన, బాధ్యతాయుతమైన బ్యాంకింగ్‌ విధానాల అమల్లో భాగంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా మొత్తం 216 విదేశీ శాఖలు, రెమిటెన్స్‌ సెంటర్లు మొదలైన వాటన్నింటినీ సమీక్షించి, క్రమబద్ధీకరించుకోవాలంటూ గతేడాది నవంబర్‌లో నిర్వహించిన పీఎస్‌బీ మంథన్‌లో బ్యాంకర్లు నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే తాజాగా బ్యాంకులు చర్యలు ప్రారంభించాయి. ఈ ఏడాది జనవరి 31 నాటికి.. పీఎస్‌బీలకు అనుబంధ సంస్థలు, జాయింట్‌ వెంచర్లు, ప్రాతినిధ్య కార్యాలయాలు కాకుండా 165 పైచిలుకు విదేశీ శాఖలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కి అత్యధికంగా 52 శాఖలు ఉండగా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు 50, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 29 ఉన్నాయి. పీఎస్‌బీ శాఖలు ఎక్కువగా బ్రిటన్‌ (32), హాంకాంగ్‌.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (చెరి 13), సింగపూర్‌లో (12) ఉన్నాయి.  

 ఆంధ్రా బ్యాంక్‌ దుబాయ్‌ ఆఫీసు మూసివేత.. 
విదేశీ శాఖల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా ఆంధ్రా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌.. దుబాయ్‌లో తమ తమ కార్యకలాపాలు నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే పీఎన్‌బీ, కెనరా బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా .. షాంఘై ఆఫీసులు మూసివేశాయి. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అటు యాంగాన్, బోట్స్‌వానా కార్యకలాపాలు కూడా నిలిపివేసింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ సైతం.. హాంకాంగ్‌ శాఖను మూసివేశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement