హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభంలో 18% వృద్ధి

18 Percent Growth in HDFC Bank Profits - Sakshi

రూ.5,676 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభం నమోదు

స్టాండలోన్   లాభంలో 21 శాతం వృద్ధి

షేరుకు రూ.5 ప్రత్యేక డివిడెండ్‌

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు జూన్  త్రైమాసికానికి ఎప్పటి మాదిరే మంచి ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు కన్సాలిడేటెడ్‌ లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.4,808 కోట్లతో పోలిస్తే 18 శాతం పెరిగి రూ.5,676 కోట్లకు చేరుకుంది. కన్సాలిడేటెడ్‌ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.28,000 కోట్లతో పోలిస్తే 19 శాతం వృద్ధితో రూ.34,324 కోట్లకు చేరింది. జూన్  త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం రూ.29,176 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.23,978 కోట్లుగానే ఉంది. ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం సైతం రూ.4,021 కోట్ల నుంచి రూ.5,148 కోట్లకు పెరిగింది.  హెచ్‌డీఎఫ్‌సీ స్టాండలోన్  లాభం జూన్  క్వార్టర్‌లో రూ.5,568 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.4,601 కోట్లతో పోలిస్తే 21 శాతం వృద్ధి సాధ్యమైంది.

స్టాండలోన్  ఆదాయం సైతం 22.7 శాతం వృద్ధితో రూ.32,361 కోట్లకు చేరుకుంది. బ్యాంకు స్థూల ఎన్ పీఏలు 1.40 శాతం, నికర ఎన్ పీఏలు 0.43 శాతంగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో స్థూల ఎన్ పీఏలు 1.33 శాతం, నికర ఎన్ పీఏలు 0.41 శాతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తోంది. విలువ పరంగా చూస్తే బ్యాంకు స్థూల ఎన్ పీఏలు మొత్తం రుణాల్లో రూ.11,768 కోట్లు, నికర ఎన్ పీఏలు 3,567 కోట్లుగా ఉన్నాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ.2,613 కోట్లుగా ఉన్నాయి. కన్సాలిటెడ్‌ రుణాలు 17 శాతం పెరిగి జూన్  చివరి నాటికి రూ.8,80,939 కోట్లుగా ఉన్నట్టు బ్యాంకు తెలిపింది. బ్యాంకు కార్యకలాపాలు 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతీ షేరుకు రూ.5 చొప్పున ప్రత్యేక మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వాలని బ్యాంకు బోర్డు నిర్ణయం తీసుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top