రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 7 నుంచి 3 వరకు)

Weekly Horoscope in Telugu (07-09-2019) - Sakshi

జన్మనక్షత్రం తెలియదా? నో ప్రాబ్లమ్‌! మీ పుట్టినరోజు తెలుసా? మీ పుట్టిన తేదీని బట్టి ఈవారం (సెప్టెంబర్‌ 7 నుంచి13 వరకు) మీ రాశి ఫలితాలు- డా‘‘ మైలవరపు శ్రీనివాసరావు జ్యోతిష్య పండితులు

మేషం(మార్చి 21 –ఏప్రిల్‌ 19)
ఎంతో ఇష్టంగా పెంచుకున్న సంతానంలో ఒకరితో ఓ వాగ్వివాదం రావచ్చు. యౌవనవంతులైన సంతానం ఆవేశంలో ఓ మాటని హద్దుమీరి మాట్లాడినా, దాన్ని నిజమని భావిస్తూ ప్రతిస్పందించకండి– ఆవేశపడిపోకండి– విశేషంగా తీవ్రంగా ఆలోచించేస్తూ ఉండిపోకండి. సంతానం కొద్దిగా ఎదురు తిరిగి మాట్లాడితే అప్పటికి తగ్గి ఉండండి. నీటిబోదె– ప్రవాహం ఉధృతీ తగ్గాక కదా దిగి అవతలి ఒడ్డుకెళ్లడం అనే పనిని బుద్ధిమంతుడు చేస్తాడు!
పదిరూపాయలలో అవుతుందనుకున్న పని కాస్తా తప్పనిసరి పరిస్థితి కారణంగా వంద రూపాయలతో పూర్తి కావచ్చు.
ఎంతమటుకూ ఆ వంద గురించే ఆలోచిస్తూ ఉండి పోకండి! సకాలంలో పని పూర్తి అయిపోవడమనేది మీ మంచికే అని గ్రహించుకోండి! జరిగిన విషయాన్ని కొద్ది నిశితంగా విశ్లేషిస్తే నిజం ఏదో అర్థం తుంది.
చేస్తున్న వ్యాపారం పెద్దగా లాభాలని తెచ్చిపెట్ట(లే)కపోవచ్చు. అంగడిలో ఉండవలసిన పనివాళ్లు మీకు కొద్దిగా విసుగునీ చిరాకునీ పెంచవచ్చు కూడా. సహించక తప్పదు. రెండుసార్లు ఉద్యోగాన్ని మానినవాడు మళ్లీ మీ వద్దకే ఉద్యోగానికై రావచ్చు. వద్దని చెప్పకండి. అయితే ఎంతలో ఉండాలో– వాళ్లని ఎంత దూరంలో ఉంచాలో కూడా గమనించి ప్రవర్తించుకోండి. ఎక్కువ చనువునియ్యడం– చనువుని ఆశించడం ఈ రెండూ సరికావు. గ్రహించుకోండి!
వ్యసనంగాని లోగడ ఉన్న పక్షంలో భార్యకి ప్రశాంతంగా చెప్పండి. వ్యసనం వల్ల వచ్చిన ఇబ్బందిని గురించి... దాచడం సరికాదు.

లౌకిక పరిహారం: విషయంలో దాపరికం వద్దు.
అలౌకిక పరిహారం: లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుంటూ ఉండండి.

వృషభం (ఏప్రిల్‌ 20 –మే 20)
పిత్రార్జితమైన ఆస్తి దాదాపుగా పంపకాల వరకు వచ్చే పరిస్థితి ఉంది. తెలుగులో ఓ సామెత ఉంది. పట్టూ విడుపూ కూడా ఉండాలని. ఆ కారణంగా ఒకే మాట మీద తిష్ఠ వేసుక్కూచుని దిగనే దిగనంటూ ఉండకండి. వ్యవహారాన్ని తెగేలా చేసుకోండి. నష్టమంటూ ఏమీ రాదుగాని, అనుకున్నంత లాభం రాకపోవచ్చు. ఇపేఉ్పడు వ్యవహారాన్ని తెగ్గొట్టుకోకపోతే మళ్లీ ఈ అవకాశం ఎప్పుడొచ్చేనో పరిస్థితులు ఎలా మారేనో.. గమనించుకోండి!
ఆదాయం ఎంత వస్తుంటుందో అష్టమశని ప్రభావం కారణంగా దానికి సరిపడినంత ఖర్చు కూడా దాదాపుగా సిద్ధమై కనిపిస్తుంది. జ్యోతిషం చెప్పేదొకటే– మిగులు లేదని బాధపడకు– ఖర్చుకి సరిపడ ఆదాయం రావడం ఓ యోగమే అని ఆనందపడు!– అని. అక్షర సత్యం కదా ఈ వాక్యం. తెలియని మరో ఖర్చు నెత్తిన పడక పోవడం ఎంత అదృష్టం మరి!
మీకు మీరుగా కయ్యానికి కాలు దువ్వడానికి ఇది అనుకూల కాలం కానేకాదు. మీకు కష్టాన్నీ నష్టాన్నీ ఎరవైనా కలిగించదలిస్తే గమనించి– మెత్తగా మందలించడంతో సరిపెట్టుకోండి తప్ప నోటిని పారేసుకోవడం, మీ సంబంధీకులతో దౌర్జన్యానికి దిగడం మంచిది కాదు. న్యాయస్థానం దాకా వ్యవహారం సాగిపోవచ్చు అలా చేసిన పక్షంలో. ఇది పిరికితనాన్ని నూరిపోయడం కాదు– ముందు చూపుతో ఇబ్బంది నుండి తప్పించుకునే మార్గాన్ని చూసుకోవడమని భావించండి.
మీ అభివృద్ధిని గమనిస్తున్న మీ విరోధులు కొందరు మీ గురించి చాటుగా అపనిందనీ, చాడీలనీ చెప్తూ ప్రచారం చేస్తూ ఉండవచ్చు. నలుగుర్నీ పోగు చేసుకుని వాళ్లనీ వాళ్ల మనస్తత్వాన్నీ సాక్ష్యాలతో నిరూపించండి మెత్తగా. కోపపడక్కర్లేదు. పదిమందిలో వాళ్లు పడేలా చేస్తే చాలు!

లౌకిక పరిహారం: నోరు పారేసుకోకండి. మెత్తని మందలింపు చాలు.
అలౌకిక పరిహారం: మహాలక్ష్మీ వ్రత కాలం కాబట్టి లక్ష్మీదేవిని తెల్లపూలతో అర్చించండి.

మిథునం(మే 21 –జూన్‌ 20)
విఘ్నాలొస్తే భయంతో నిరుత్సాహంతో అధైర్యం కారణంగా చేస్తున్న కార్యాన్ని మధ్యలో విడవకుండా అలా పూర్తి చేసేందుకు కృషి చేస్తారు. మొత్తమ్మీద కార్యాన్ని పూర్తి చేస్తారు. ఈ కృషిలో మీతో మీ మాటా– మీ శత్రువులతో చేరి వాళ్ల వైపు మాటా మాట్లాడుతూ ఉండే అనుకూల శత్రువులెవరో తెలిసి పరమానందపడతారు. శత్రువులు తమంత తాముగా వచ్చి ఏవేవో సాకులు చెప్తూ తమ తప్పుని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తే వెంటనే నిందించి పంపివేయకండి. వాళ్లు చెప్పేది పూర్తిగా విని మౌనంగా చిరునవ్వుని నవ్వి సాగనంపండి. గుత్తదారి పనుల్లో (కాంట్రాక్ట్‌) పెద్దగా లాభాలని ఆశించకండి. వచ్చిన ఆదాయంతో సంతృప్తి పొందండి. ధర్మబద్ధంగా గనుక ఉండగలిగితే మరొక పని మీకు లభించగలదనే మాట యథార్థం. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు సహోద్యోగులతో మిత్రులతో సత్సంబంధాలని నెరపడం మంచిది తప్ప, వాదులాటకి దిగడం సరికాదు ప్రస్తుత దశలో. భూమీ గృహం వాహనం స్థలం మొదలైన వాటిని కొని ధనాన్ని మంచి చోట పెట్టుబడిగా ఉంచడం మంచిదని భావిస్తారు గాని, తమ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో    తగిన సమయం దొరకని కారణంగా ఏ ఒక్క పనినీ చేయలే(కపోతా)రు. దాన్ని దురదృష్టంగా భావించండి.
ప్రణాళిక ప్రకారమే ఖర్చుని చేసుకోవడం, తగినంతలోనే ఉండాలనే నిర్ణయాన్ని తీసుకోవడం సర్వదా శ్రేయస్కరం. దాంపత్య విషయానికొస్తే ఏదో ఒక సత్రంలో కలుసుకున్న అతిథుల్లా ఉంటుంది తప్ప అన్యోన్యత అంతగా ఉండక పోవచ్చు. నేను– నా జీతం– నా అధికారం– నాది వంటి భావంతో ఉన్నా ఇద్దరికీ మధ్య ఉన్న ఈ అహం– కారం– (నా పెత్తనం)అనే ఈ గట్టిగోడ ఇద్దర్నీ దూరంగానే ఉంచుతుంది. పొరపాటు చేస్తున్నామనే భావం ఇద్దరికీ కలగడం ఎంతైనా మంచిది.

లౌకిక పరిహారం: శత్రువుని చేరనీయకండి. దాంపత్యంలో అహంకారం సరికాదు.
అలౌకిక పరిహారం: మహాలక్ష్మీ వ్రతకాలం కాబట్టి త్లెని వస్త్రాలు కట్టి తల్లిని పూజించుకోండి.

కర్కాటకం(జూన్‌ 21 –జూలై 22)
హృదయపూర్వకంగా ఏ పనిని ప్రారంభించినా ముగింపుకొచ్చే అవకాశమైతే ఉంది. పనికి దిగాలి తప్ప ఆగిపోవడమనేది ఉండదు. అన్య స్త్రీ/ పురుష పరిచయం ఏర్పడే అవకాశముంది. ఆ ఆలోచనలతో ఆ సమావేశాలతో సమయం ఎంతో వ్యర్థమయ్యే అవకాశముంది. దాంపత్యంలో సంఘర్షణకి బీజాన్ని వేసే కాలమని గుర్తించండి.
విద్యార్థులు కొద్ది ప్రయత్నాన్ని చేస్తే చాలు గట్టి అనుకూల ఫలితాలని పొందగలరు. అదే తీరుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలని చేసేవారు కూడా ప్రయత్నాన్ని విడవకుండా చేసిన పక్షంలో అధికాదాయం అధికలాభం అత్యంతాధిక ప్రచారమూ కలిగే అవకాశముంది. ఏదో చిన్న పొరపాటుని ఇతరులు చేశారనే భావంతో పదిమంది మధ్య నోటిని పారేసుకుని ప్రతిష్ఠని కోల్పోయే/ తగ్గించుకునే అవకాశం కనిపిస్తోంది. ఆ కారణంగా తక్కువగా మాట్లాడండి.
పదిమందీ మీకు సహకరించేందుకు గాను ఒకటయ్యే పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి పదిమందితోనూ సాహచర్యాన్ని పెంచుకోవడం మంచిది. ధనాదాయం బాగుంటుంది. కర్షక వృత్తి చేస్తు్తండే వారికైతే పొలాల మీద చక్కని ఆదాయం రాగలదనే నమ్మిక వస్తుంది.
న్యాయస్థానంలో మీకు దగ్గరైన లేదా రక్తసంబంధమున్న వారికి అభియోగం ఉన్న కారణంగా– వారికేమైనా వ్యతిరేకత ఎదురౌతుందమేనన్న మనోభయంతో ఉంటారు! రుణబాధలు తగ్గడం అత్యానందకరం. అలాగే శారీరక అనారోగ్యం కుదుట పడడాన్ని గమనించుకుని ఎంతో ఆనందపడుతూ దైవానికి ఓ మంచి సేవని (తోమాల సేవ– అష్టదళ పాదపద్మారాధన సేవ...) వంటివి చేయగలనని మొక్కుకుంటారు. అవకాశమున్నంతలో పేద విద్యార్థుల్ని ఎంచుకుని వాళ్లకి తోడ్పడాలనే ఆలోచనకి రండి.

లౌకిక పరిహారం: ధనాదాయం బాగుంది కదా అని వినోద విలాస వస్తువులను కొనద్దు.
అలౌకిక పరిహారం: లక్ష్మీదేవి పూజాకాలం కాబట్టి అమ్మకి ఆవుపాలతో అభిషేకాన్ని చేయండి.

సింహం(జూలై 23 –ఆగస్ట్‌ 22)
మీ పనిని సాధించుకోవలసిన అవసరం ఉంది కాబట్టి ఒకప్పుడు మీతో విభేదించి శత్రువైన వాణ్ణి కూడా అభిమానపడకుండా కలవండి. అతను మీకు ప్రత్యక్షంగా సహాయ పడకపోవచ్చు గాని మీ ఇతర శత్రువులతో చేరి మీకు అపకారాన్ని మాత్రం చేయడు. ఇదీ ఒక సహకారమే కదా! శత్రువు ఏమంటాడో అనుకుని జÆ కి కలవకుండా ఉండద్దు. ముఖ్యమైన మిత్రులతో వ్యవహరించేటప్పుడు కొద్ది లౌక్యాన్ని చూపించండి తప్ప స్పష్టంగా వాగ్దానాలని చేసెయ్యడం, హామీలని ‘తప్పనిసరి పరిస్థితులు సుమా!’ అనుకుంటూ ఇచ్చెయ్యడం వంటివి సరికాదు. అలాగని నిష్ఠురంగా మాట్లాడుతూ మిత్రత్వాన్ని తెగతెంపుకోవద్దు. మీకు ఇష్టం లేకున్నా విషయాన్ని సున్నితంగా ఎదుటివారికి అర్థమయ్యేలా చేసుకోండి. ఇంతకుముందు తీసుకున్న రుణాలని తిరిగి చెల్లించే సందర్భాల్లో కొంత అదుపు ఉండాలి. అంటే ఇంత తీరుద్దాం. ఇన్ని వాయిదాల్లో తీరుద్దామనే స్పష్టమైన ప్రణాళిక ఉండడం, కచ్చితంగా దాన్ని అమలు చేయడం ఉండాలి తప్ప, ఎవరు ఒత్తిడి చేస్తే వాళ్లకి తీరుస్తూ ఉండడం, ఎవరు మంచితనంతో మీ మీది గౌరవంతో ఉండలేకపోతున్నారో, వారికి ఇయ్యకుండా కాలం గడపడం చేస్తే పెద్ద ఇబ్బందికే గురి కాగలరు. అందరినీ పిలిచి మర్యాదపూర్వకంగా ప్రణాళికని చెప్తే ఒప్పుకునే పరిస్థితే ప్రస్తుతానికుంది. సమస్యని గట్టిపడేలా చేసుకోకండి. ఇలా తేలికగా పరిష్కరించుకోండి.
సంతానం చదువు విషయంలో ఒకరి చదువు బాగున్నా ప్రవర్తన మాత్రం అంత గొప్పగా ఊహించినంతగా ఉండకపోవచ్చు. పట్టించుకుంటూ ఉండండి. వాత్సల్యం అనురాగం అనేవి పిల్లల మీద ఉండచ్చు గాని అవి మాత్రమే పిల్లల మీద చూపిస్తూ ఉంటే మన గోతిని మనమే తవ్వుకున్న చందం కాక తప్పదని గ్రహించుకోండి.

లౌకిక పరిహారం: పిల్లల మీద అతి వాత్సల్యం వద్దు. అప్పుల్ని తీర్చడంలో జాగ్రత్త అవసరం.
అలౌకిక పరిహారం: మహాలక్ష్మీ వ్రతకాలం కాబట్టి అమ్మకి పాయసాన్ని నివేదించండి.

కన్య(ఆగస్ట్‌ 23 –సెప్టెంబర్‌ 22)
పట్టు వదలని విక్రమార్కుడనే మాటకి ఉదాహరణగా వ్యవహరిస్తారు. అది మంచిదే. అయితే కొన్ని సందర్భాల్లో అతిగా ప్రయత్నించడాన్ని మంచిది కాదని భావించండి. ఒకరి సహాయం తీసుకోదలచడం, వారిని ఒప్పించడం సరైనదే, అనుకూలమైదనే కాని, నిరంతరం పీడిస్తూ ఉన్నట్లుగా వాళ్లకి అన్పించేలా చేసుకోకండి. మీ ఆత్రుత మీకుండచ్చు గాని వాళ్లకి అది మరోలా తోచచ్చు.
కుటుంబ విషయంలో అంటే కుటుంబం గురించిన రహస్యాలని మీరు గుంభనతో ఉంటూ బయటకి వెళ్లనీయకుండా దాచినా దాచగలిగినా, కుటుంబ సభ్యుల్లో ఒకరి ద్వారా బహిరంగ పడే అవకాశాలున్నాయి కాబట్టి అలాంటి వారిని ఓ కంట కనిపెట్టి మెల్లగా నిదానంగా మాత్రమే వాళ్లకి అలా బహిరంగ పరచడం  వల్ల కలిగే ఇబ్బందుల్ని వివరించి చెప్పండి. దూకుడుతనంతో వ్యవహరిస్తే పరిస్థితి మరోలా సాగిపోవచ్చు.
రుణదాతలకి మీరు చెల్లిస్తున్న పద్ధతి సక్రమంగా ఉన్న కారణంగా ఎవరినుండీ ఒత్తిడి రాదు సరికదా, ఎప్పుడూ మీరు రుణాన్ని అడగదలిచినా వాళ్లు ఈయడానికి సిద్ధంగానే ఉన్నారని గ్రహించుకోండి. అలాగని అనవసరమనిపించినా రుణాన్ని తీసుకోవాలనుకునే నైజం మీది కాదు. అయితే ఇతరులకి హామీ ఉండి రుణాన్ని ఇప్పించడం నూటికి నూరుపాళ్లూ మీకు అప్రతిష్ఠని తెచ్చే అంశమే.
ఏదైనా ఒక పాత్ర ఒక కొంత పరిమాణం కలిగిన ద్రవ్యాన్నే తనలో నింపుకోగలుగుతుంది. అంతకిమించి పోస్తే ఒలికిపోయేలా చేస్తుంది. అదే తీరుగా ‘శరీరం సహకరిస్తూ(నే) ఉంది కదా!’ అనే ఉద్దేశ్యంతో ఎక్కువెక్కువగా పని చేయిస్తూ ఉంటే మధ్యలో మొరాయిస్తుందని గ్రహించి తగిన విశ్రాంతిని తీసుకోండి.
వారం మధ్యలో ఒక శుభవార్తని వినే అవకాశముంది. అహంకరించకండి.

లౌకిక పరిహారం: కుటుంబంలో గుంభన అవసరం.
అలౌకిక పరిహారం: మహాలక్ష్మీ వ్రతకాలం కాబట్టి లక్ష్మీదేవికి ఆవు పెరుగుతో అభిషేకం చేయించుకోండి.

తుల(సెప్టెంబర్‌ 23 –అక్టోబర్‌ 22)
లోతైన నదిలో పడవ మీద లేదా మరో నీటి వాహనం మీదా ప్రయాణిస్తూ ఉంటే చాలా సంతోషకరంగా ఉంటుంది– ఉండవచ్చు కాని ఒడ్డు చేరేంతవరకు చిన్నపాటి లో భయం తప్పక ఉండి తీరుతుంది. మీకు న్యాయస్థానంలో లభించిన అనుకూలమైన తీర్పుగాని, మీరు శత్రువుల మీద దాడి చేసిన తీరు వల్ల విజయాన్ని సాధించగలిగిన ధోరణి గాని మీకు ఆనందాన్ని కలిగించవచ్చునేమో గాని, దానివల్ల వచ్చే ప్రతికూల పరిణామాలని కూడా అంచనా వేసుకుంటూ ఉండాల్సిందే. పడ్డవాడు తప్పక మళ్లీ ఎలా లేవాలా? అని ఆలోచిస్తూ ఉంటాడని భావిస్తూ అప్రమత్తగా ఉండండి.
ఏవేవో కొత్త కొత్త వాహనాలని కుటుంబ సభ్యులకి కొని ఇయ్యాలనే ఆలోచనతో రుణాలకి వెళ్లే అవకాశముంది. మీకున్న పగ, ద్వేషం శత్రువుల మీదికి వెళ్లే ఉగ్రత గురించిన చర్చలని విస్తృతంగా ఇంట్లో నిరంతరం చేసుకుంటూ ఉంటే ఆ పద్ధతులని కొంతలో కొంత పిల్లలు గ్రహిస్తున్నారని భావించి, అది ముందు నాటికి వాళ్ల ప్రవర్తన మీద ప్రభావాన్ని చూపిస్తుందని గ్రహించి వాళ్ల ముందు ఈ తీరు చర్చల్ని చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి.

మీరు ఎవరికి సహాయ పడ్డారో వాళ్లు మీకు కృతజ్ఞతలని చెప్తారు. వాళ్లు మిమ్మల్ని ప్రశంసిస్తారు. అలా సహాయపడడమనే ధోరణిని– మీ కుటుంబ సభ్యుల్లో ఆప్తులో కొందరి విషయంలో కూడా చూపించడం వల్ల కుటుంబ కీర్తి ప్రతిష్ఠల్ని పొందగలుగుతుంది. మీకు శ్రేయస్సు కలుగుతుంది. ఆలోచించుకోండి.
ఉద్యోగంలో అలాగే మీ వృత్తి నిర్వహణలో మంచి విజయాలని సాధిస్తారు. అనుకూల కాలం కాబట్టి మీకు ఎదురు లేదు. న్యాయస్థానంలో ఉన్న విషయాలని గురించి మరింతగా కృషి చేసి అధర్మంగా పత్రాలని సమర్పించడం సరికాదు.

లౌకిక పరిహారం: పిల్లల సమక్షంలో వాదోపవాదాలు వద్దు.
అలౌకిక పరిహారం: మహాలక్ష్మీ వ్రతకాలం కాబట్టి లక్ష్మిని చెరుకు రసంతో అభిషేకించండి.

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
అతి ప్రేమకీ అత్యంత గౌరవాన్ని చూపించిన దానికీ తీవ్రంగా నమ్మినందుకూ తగిలిన చెంపదెబ్బ ఇంకా మిమ్మల్ని బాధిస్తూనే ఉంటుంది. దుఃఖపడకండి మానసికంగా. శని ప్రభావం  తగ్గబోతోంది కొంతకాంలో. అప్పటివరకు మౌనంగా భరించక తప్పదు. వయసు చిన్నదే అయినప్పటికీ ఇంతటి తీవ్ర మనఃక్షోభని పడుతూ కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సక్రమంగా చేసుకోగలుగుతున్నందుకు నిజంగా మిమ్మల్ని మీరు అభినందించుకోవాల్సిందే. అదే ధర్మబద్ధ ధోరణిలో సాగండి. వ్యవహారానికంటూ విషయాన్ని ఎదుటి వారు తెచ్చాక సూటిగా ప్రవర్తిస్తాననడం కాకుండా లౌక్యంగా ఉండడం మౌనంగా ఉండడం మంచిది. దూర దూర బంధువులు మిమ్మల్ని పరామర్శించ వస్తే మీకు కలిగిన మనస్తాపాన్ని వివరించి చెప్పండి. సిగ్గుపడుతూ దాచకండి. అభిమాన పడుతూ విషయాన్ని గుంభనంగా ఉంచకండి. శత్రువుల పరిస్థితీ ప్రవర్తన మిత్ర ఆప్తబంధు వర్గానికి వర్గానికి తెలియనివ్వండి. అయితే ఉన్నదున్నట్లే చెప్పుకోండి. అదృష్టవశాత్తూ మీరు శారీరకంగా ఆరోగ్యవంతులై ఉండడం శని రాహువులు మీకిచ్చిన వరంగా భావించండి. ఒక ఉద్యోగాన్ని చేస్తూ మరొక స్వల్ప ఉద్యోగాన్ని చేయాలని భావించకండి. అలాగే వ్యాపారంలో ఎవరితోనో భాగస్వామిగా చేరుదామని కూడా ప్రయత్నించకండి. గొడుగు చిన్నదిగానూ తక్కువ విస్తృతితోనూ ఉన్నప్పుడు ఆ గొడుగులో మరొకరికి చోటునియ్యడం సరికాదు. ఉద్యోగ సంతృప్తి లేక మరో ఉద్యోగానికి మారదలిస్తే అనుభవజ్ఞుల్ని సంప్రదించి చెయ్యండి. శని కారణంగా అనుకూలత లేని ఈ కాలంలో మరో ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు వద్దు.
ఎంత తెలిసిన వ్యక్తి నుండైనా పత్ర పూర్వకంగానే వ్యవహారాలని పూర్తి చేసుకోనివ్వండి తప్ప నోటిమాటలు వద్దు.

లౌకిక పరిహారం: అనుభవజ్ఞుల్ని సంప్రదించి చెయ్యండి ఉద్యోగపు మార్పు గురించి.
అలౌకిక పరిహారం: మహాలక్ష్మీదేవికి నవనీతంతో అభిషేకాన్ని చేయండి.

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
బాగా దగ్గరైన వాళ్లే మిమ్మల్ని నమ్మకంగా మోసపుచ్చే అవకాశముంది కాబట్టి అనుక్షణం తగు మాత్రపు జాగ్రతతో ఉండడం అత్యవసరం. మోసపోబోతున్నామని తెలిసినా కూడ మొగమాటంతో ప్రతిస్పందించకపోవడం కూడ తప్పే అని దృఢంగా భావించండి. దానం ఈయడం వేరు మోసపోయి ధనాన్ని కోల్పోవడం వేరు. మీ జీతం ఇతరాదాయం ఆస్తిపాస్తులూ.. ఇతరులకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
మీ గొప్పదనాన్ని చెప్పుకోవాలనే భావంతో అతిశయం కోసం నలుగురిలో చెప్పుకున్న కారణంగానే మీకు ఇబ్బంది వస్తోందనే యధార్థాన్ని గ్రహించండి. మాట్లాడడం గాని రాతకోతలు గాని స్పష్టమైన అవగాహనతో ఉండాలి తప్ప తోచినట్లుగా మాట్లాడడం ఎక్కడ పడితే అక్కడ సంతకం చేయడానికి సిద్ధపడితే పెను ప్రమాదంలో చిక్కుకోవచ్చు. దశ ప్రస్తుతం అనుకూలంగా లేనందున ఇంత వివరంగా చెప్పాల్సి వస్తోంది.
శని ఎప్పుడూ చెడు చేయడు కాబట్టి, మీకు ఎన్ని అడ్డంకులు వస్తున్నా అవన్నీ సూర్యుడు రాగానే చీకటి తొలగిపోయినట్లు వాటంతట అవే తొలగిపోతూ ఆనందాన్ని కల్గిస్తున్నాయి మీకు. పరోక్షంగా శని మిమ్మల్ని అనుగ్రహిస్తూంటే తెలిసి తెలిసి ఇబ్బందిని తెచ్చుకోప్రయత్నించడం ఎంత సరైన పని? శత్రువులు– అజాతశత్రువని పేరుపడిన ధర్మరాజంతటి వానిక్కూడ ఉన్నారు. శత్రువులుండడం తప్పుకాదు గాని వాళ్లతో సంబంధ బాంధవ్యాలని ఏర్పాటు చేసుకోవడం సరికాదు. వారం మధ్యలో శుభవార్తని వినే అవకాశముంది. మీరు ఉద్యోగంలో చూపిస్తున్న నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆ కారణంగా పదవీ ఉన్నతిగాని, స్థానచలనం గాని ఈ రెండూ గాని ఏర్పడవచ్చు. ఉద్యోగం చేసేవాడికి స్వస్థలం పరస్థలం అనే భేదం ఉండ(కూడ)దు కాబట్టి వెళ్లడానికి సిద్ధపడి ఉండండి.

లౌకిక పరిహారం: అప్రమత్తంగా ఉండండి.
అలౌకిక పరిహారం: మహాలక్ష్మికి పుష్పాలతో అష్టోత్తర శతనామ పూజ చేయండి.

మకరం(డిసెంబర్‌ 22 – జనవరి 19)
సంతానం చదువులకీ వివాహాదులకీ కొంత ఖర్చు కొద్ది కాలంలోనే సిద్ధంగా ఉన్న ఈ దశలో పెద్ద ఆస్తిని కోనుగోలు చేయాలనుకోవడం ఎంతవరకు సరైన పనో కొద్దిగా పెద్దల్నీ అనుభవజ్ఞుల్నీ సంప్రదించి చేయడం ఎంతైనా సరైన పని. ఏది మనసులోకి ఆలోచనరూపంగా వస్తే దాని తప్పక చేసెయ్యడమనే లక్షణమున్న మీకు ప్రస్తుత దశలో అలా చేయడం వల్ల కొత్త సమస్య ఉత్పన్నం కావచ్చు.
 సాధారణంగా వారఫలాలు బాగా అనుకూలంగానూ, అంతా మంచే జరుగుతుందనే తీరులో ఉంటేనూ చాలా బాగుందని ఆనందిస్తూ ఉంటారు. జ్యోతిషం చెప్పేదొకటే – రాబోయే ఇబ్బందిని చెప్పి – చెప్పి భయపెట్టడం కాకుండా దానికి సరైన పరిష్కారాన్ని కూడ చెప్పింది ఇబ్బంది తొలిగే మార్గాన్ని అర్థమయ్యేలా వివరించి సంతోషపడేలా చేయవలసిం–దని. ఈ నేపథ్యంలో పెద్ద ఆస్తికి సంబంధించిన రాతకోతల్లోకి వెళ్లకండి ప్రస్తుతానికి. ఇళ్లకి కావలసిన మార్పుల్ని అంటే మరమ్మతుల్ని చేయించుకోవడం అవసరం.
పోటీపరీక్షలకి గాని వెళ్లగలిగితే తప్పక ముందు నాటికి సత్ఫలితాలుండచ్చు. వెనకాడద్దు. చక్కని బుధ్ది నైపుణ్యం మీకున్న కారణంగా మీ గురించే మీరు ఆలోచించుకుంటూ మీ జీవితస్థాయిని పెంచుకునే ప్రయత్నాన్నే చేసుకోండి. తప్పక ఎదగగలుగుతారు. అదృష్టవశాత్తూ మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కని పేరు లభించింది. దాన్ని కొనసాగేలా చేసుకుంటూ ఉండండి. బంధుమిత్రులతో అతిచనువు వద్దు. ఎంత దూరంలో ఉండాలో ఎంత దూరంలో ఉంచాలో తెలుసుకుని మసలడం అత్యవసరం. వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచనతో కొద్దిగా ప్రచారం చేసుకున్న పక్షంలో ఆదాయం మరింతగా పెరిగే అవకాశముంది. ఆధ్యాత్మికం వైపుకి దృష్టి మళ్లచ్చు. శృతిమించకండి.

లౌకిక పరిహారం: కొత్త ఆస్తుల కొనుగోళ్లూ రాతకోతలూ ఈ వారంలో వద్దు.
అలౌకిక పరిహారం: మహాలక్ష్మీ వ్రత కాలం కాబట్టి గంధజలంతో ఆ దేవిని అభిషేకించండి.

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఆప్తులైనవారికి సహాయపడే నిమిత్తం శరీరాన్ని మరింత శ్రమకి గురిచేసే అవకాశముంది. ఏ పనినైనా తగినంతలో చేసుకోవాలి తప్ప ‘అతి’ అనేది ఇబ్బందికి గురి చేస్తుంది. పొరపాటున నోరుజారిన కారణంగా పూర్వం ఎప్పుడో సమసిపోయిన అభిప్రాభేదం ఒకటి మళ్లీ చిగురించే ప్రమాదం ఉంది. ఒకవేళ అదే తిరిగి మొలకెత్తబోతే ఏ మాత్రమూ వెనుకాడకుండా ‘ఔను! అలా అనకుండా ఉండాల్సింది!’– అని మృదువుగా అనేసెయ్యండి.
అలా ఆ విషయం కాస్తా తేలిపోతుంది. మీ మనసు కూడ తేలికపడుతుంది. లేని పక్షంలో ఏ పనినీ చేయలేని మానసికమైన అలసట మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఉత్సవాలూ విందులూ వినోదాలూ మీ బంధుమిత్రుల ఇళ్లలో సాగినట్లయితే ఒక ప్రణాళిక వేసుకుని అంతే ఖర్చు చేయండి తప్ప, అట్టహాసం ఆడంబరం కోసం శృతిమించి వెళ్లకండి. ఇప్పుడెంత ఇచ్చారో దానికి మించే పై ఉత్సవంలో ఇయ్యాల్సి వస్తుంది. ఏదైనా కారణంగా ఇయ్య(లే)ని పరిస్థితిలో లోగడ ఇచ్చినప్పటి ప్రశంసకంటె ఎక్కువ మోతాదులో నింద వస్తుంది.
మీ అభివృద్ధిని గమనిస్తూ ఉన్నవాళ్లు ఎందరో మీకున్నారు కాబట్టి ఆదాయ వివరాల విషయంలో గుంభనగా ఉండడం మంచిది.
మరింత దగ్గరతనం ఉన్నవాళ్లెవరైనా మీ ఆదాయాన్ని గురించి గుచ్చి గుచ్చి అడుగుతూంటే – ‘అబద్ధం చెప్పలేను – నిజం చెప్పాలని లే’దని స్పష్టంగా తడుముకోకుండా చెప్పయ్యండి తప్ప లౌకంగా దాటుకుపోవడమో, తగ్గించి చెప్పడమో వద్దే వద్దు. చెప్పుకోదగ్గ సమస్యలూ ఇబ్బందులూ ఏమీ లేవు. సంతానం చదువు గూర్చి పట్టించుకోండి. చాలు.

లౌకిక పరిహారం: లౌక్యం వద్దు. లో అభిప్రాయాన్ని మృదువుగా చెప్పండి.
అలౌకిక పరిహారం: మహాలక్ష్మీ వ్రతకాలం కాబట్టి లక్ష్మీదేవిని మారేడు దళాలతో అర్చించండి.

మీనం(ఫిబ్రవరి 19 – మార్చి 20)
మీ దంపతులలో ఒకరు మానసికంగా అంత దృఢంగా లేని కారణంగా ఎవరేది చెప్పినా – ముఖ్యంగా ఆరోగ్యం ఆదాయం ఆయుష్యం– వంటి విషయాలన్ని గురించి వ్యతిరేకంగా చెప్పినట్లయితే మానసికంగా దృఢంగా ఉన్నవాళ్లు కుంగుదలతో ఉన్నవారికి ధైర్యాన్ని చెప్పడం అవసరం. ఏనుగు తన శరీరంతో ఎంత బలంగా ఉన్నా మద్దెల చప్పుళ్లని వింటే పరుగు లంకించుకుంటుంది. అదే మరి తనలో పదివేల వంతు బలం ఉన్న మావటి తన పక్కనుంటే ఎంత బరువునైనా అలా ఎత్తేయగలుగుతోంది కదా! ధైర్యాన్నిచ్చే ఓదార్పు అవసరం కుంగుదలకి. అనుకుని ఆగిపోయిన తీర్థయాత్రలపట్ల దృష్టి ప్రసరించవచ్చు. పిల్లల చదువులూ శారీరక ఆరోగ్యాలూ తగు సౌకర్యాలూ.. ఇన్నిటినీ చూసుకుని వెళ్లడం మంచిది. లేని పక్షంలో వాయిదా వేసుకోవడం మంచిదీ తప్ప– మొక్కున్నాం కదా! – అని వెంటనే ప్రయాణం కట్టడం అంత సరైన పని కాకపోవచ్చు. మీరు చేసిన రుణాలన్నీ మీకు ప్రయోజనాత్మకంగా ఫలించిన కారణంగా ఆర్థికంగా బలంగానూ ఆనందకరంగానూ మీరున్నారు కాబట్టి మీకు రుణదాతలౌతూ సహకరించిన ఆ వ్యక్తులకి రుణాలని తీర్చెయ్యండి ఇయ్యవలసిన ధనంలో కోత లేకుండా. ఇదే సరైన సమయం కూడ. తీసుకున్న సొమ్ముని తిరిగి ఇచ్చే వేళ రొక్కించడం కొంత తగ్గించవలసిందని అడగడం.. వంటి పనుల్ని చేయకండి. రుణాన్ని వసూలు చేసుకుంటే చాలుననుకునే ధోరణితో రుణదాతలు మీ మాటకి లోబడి ఉండచ్చు. మీ మాటని అంగీకరించవచ్చునేమో గాని, ‘ముందునాటికి వాళ్లు మీకు మళ్లీ రుణాన్ని ఇస్తారు కదా!’ అనుకోవడం సరికాదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. బంధువుల రాకతో ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. సంతానం చదువులో కూడ అభివృద్ధి కన్పిస్తూ ఉంటుంది.

లౌకిక పరిహారం: కుంగుదల ఉంటే ధైర్యాన్ని చెప్పడం అవసరం.
అలౌకిక పరిహారం: మహాలక్ష్మీవ్రతకాలం కాబట్టి లక్ష్మీదేవిని పసుపు జలంతో అభిషేకించండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top