
సాక్షి ప్రతినిధి, కాకినాడ/హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ సమర శంఖారావం సభ ఈ నెల 11న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు సర్పవరంలో మొదలయ్యాయి. బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సభలో ప్రతిపక్ష నేత జగన్ ప్రసంగిస్తారు. వచ్చే ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేలా పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేస్తారు. అంతకు ముందు ఉదయం 11 గంటలకు నాగమల్లి తోటలోని ద్వారంపూడి భాస్కరరెడ్డి పద్మావతి కళ్యాణ మండపంలో తటస్తులతో జరిగే సమావేశంలో జగన్ పాల్గొంటారు. కాగా, సమర శంఖారావం సభ కోసం సర్పవరంలోని జ్యూయల్ మెడల్స్ అపార్ట్‌మెంట్స్ వద్ద ఉన్న ఐదు ఎకరాల స్థలాన్ని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు శుక్రవారం పరిశీలించారు.
కాగా స్వతంత్ర జర్నలిజం ముసుగులో ఎల్లో మీడియాగా మారి టీడీపీకి వత్తాసు పలుకుతున్న టీవీ5 చానల్‌ను బహిష్కరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం తమ పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది.