సమరోత్సాహం

YSRCP to  Racha Banda & Palle Nidra - Sakshi

అనంతపురం సెంట్రల్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దుష్టపాలనపై ప్రజలు నేతలకు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రజా సమస్యలను వింటున్న నేతలు రానున్నది వైఎస్సార్‌ ప్రభుత్వమని.. ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తున్నారు. రెండోరోజు ఆదివారం జిల్లా వ్యాప్తంగా రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు పార్టీ నేతలు నిర్వహించారు. ఇళ్లు, పింఛన్లు, నిరుద్యోగ భృతి రావడం లేదని ప్రజలు ఫిర్యాదు చేశారు. ఉపాధి లేక వలస పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధిహామీ పనులకు పోతే రెండు, మూడు నెలలకు కూడా బిల్లులు మంజూరు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. 

అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలోని రుద్రంపేట పంచాయతీ ఎస్సీ కాలనీలో రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డితో జనం తన బాధలు చెప్పుకున్నారు. కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, రోడ్లు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని, డ్రైనేజి వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని వివరించారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ సమన్వయకర్త నదీం అహ్మద్, నగర అధ్యక్షుడు సోమశేఖర్‌రెడ్డిలు హాజరయ్యారు. 

► పెనుకొండ మండలం అడదాకులపల్లి పంచాయతీలోని జాలిపల్లితండాలో రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు శంకర్‌నారాయణతో తండా ప్రజలు తమ సమస్యలు చొప్పుకుని కన్నీటి పర్యంతమయ్యారు.  ప్రజల సమస్యలన్నీ విన్న శంకర్‌నారాయణ..సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని భరోసా ఇచ్చారు. సమస్యలన్నింటినీ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. 

► ఆత్మకూరు మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీలో రాప్తాడు మండలం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలు విన్న ఆయన పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు ఇళ్లపట్టాలు, భూమిలేని వారికి భూమి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. 

నల్లచెరువు మండలం ఉబిచెర్ల ఎస్పీకాలనీలో కదిరి నియోజకవర్గ సమన్వకర్త పీవీ సిద్దారెడ్డి పల్లె నిద్ర చేశారు. అంతకుముందు ఉబిచెర్ల పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఇంటిఇంటికీ తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దళితవాడలో పల్లెనిద్ర చేశారు. వచ్చేది వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమేనని, సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు.

►  తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామంలో నియోజకవర్గ సమన్వయకర్త పెద్దారెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు సమస్యలను ఏకరవు పెట్టారు. 

ధర్మవరం మండలం ఓబుళనాయునిపల్లిలోని దళితవాడలో నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ప్రజాసమస్యలను ఆలకించిన అనంతరం పల్లెనిద్ర చేశారు. 

బ్రహ్మసమద్రం మండలం బొమ్మగానిపల్లితండాలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వకర్త ఉషాశ్రీచరణ్‌ ప్రజల సమస్యలను ఆలకించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. 

►  రొళ్ల మండలం వన్నారణపల్లి ఎస్సీకాలనీలో మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి రచ్చబండ, పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. 

పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓడీసీ మండలం నల్లగుట్లపల్లిలో జరిగిన రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top