టీడీపీ దొంగల పార్టీ అని, హైదరాబాద్‌లో నేరం చేసి ఆంధ్రప్రదేశ్‌లో దాక్కుంటున్నారని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి ధ్వజమెత్తారు.
విజయవాడ: టీడీపీ దొంగల పార్టీ అని, హైదరాబాద్‌లో నేరం చేసి ఆంధ్రప్రదేశ్‌లో దాక్కుంటున్నారని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి ధ్వజమెత్తారు. విజయవాడలోని తన కార్యాలయంలో గౌతంరెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ఏడాది పాలనను దోపిడీ పాలనగా అభివర్ణించారు.
జీవో నంబరు 22 ద్వారా పారిశ్రామికవేత్తలకు రూ. 2,070 కోట్లు, గ్యాస్ బేస్‌డ్ విద్యుత్ కేంద్రాలకు రాయితీల పేరిట రూ. 2,500 కోట్లు, పట్టిసీమ ద్వారా రూ.600 కోట్ల కమీషన్ దోపిడీ జరిగిందన్నారు. ఇవికాకుండా 10 వేల ఎకరాల భూమిని సింగపూర్ సంస్థకు ఇచ్చి లక్షల కోట్లలో దోపిడీకి తెరలేపారని దుయ్యబట్టారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయట పడేందుకు టీఆర్‌ఎస్ నాయకుల కాళ్లు పట్టుకునే స్థాయికి టీడీపీ నేతలు దిగజారారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే జరిగిన కృష్ణాజలాల అథారిటీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం 299 టీఎంసీల కృష్ణా నీటిని ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవడానికి అంగీకరించారని చెప్పారు.
దీనివల్ల రాయలసీమ, కృష్ణాడెల్టాకు నీరు రాదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కర్ణాటక, మహారాష్ట్రలు మన రాష్ట్రానికి నీరందకుండా ప్రాజెక్టులు నిర్మించాయని, దీనివల్ల రైతాంగానికి తీరని ద్రోహం చేశారని గుర్తుచేశారు. కేసుల నుంచి బయటపడడానికి తెలంగాణ ప్రభుత్వం ముందు మోకరిల్లిన చంద్రబాబు రైతాంగానికి మళ్లీ ద్రోహం చేశారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన నిజాయితీ నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.