సంస్థాగత బలోపేతం దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాచరణకు ఉపక్రమించింది.
సంస్థాగతానికి వైఎస్సార్ సీపీ కార్యాచరణ
నియోజకవర్గస్థాయి సదస్సులు
6న పాడేరు నియోజకవర్గ సదస్సు
హాజరుకానున్న త్రిసభ్య కమిటీ సభ్యులు, ముఖ్యనేతలు
విశాఖపట్నం సంస్థాగత బలోపేతం దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాచరణకు ఉపక్రమించింది. గ్రామస్థాయి నుంచి పార్టీ పటిష్టతకు ఉద్యుక్తమైంది. అందుకోసం స్థానిక నేతలకు అవగాహన కల్పించేందుకు నియోజకవర్గస్థాయి సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ అవగాహన సదస్సులను జిల్లా నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 6న పాడేరు నియోజకవర్గస్థాయి అవగాహన సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి.విజయసాయిరెడ్డి, సాగి ప్రసాదరాజు ఈ సదస్సును నిర్వహిస్తారు. వారితోపాటు పార్టీ ఉత్తరాంధ్ర పరిశీలకుడు సుజయ్‌కృష్ణ రంగారావు, పార్టీ రాష్ట్ర వాలంటీర్ల సెల్ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు, బూడి ముత్యాల నాయుడుతోపాటు జిల్లా పార్టీ ముఖ్యనేతలు పాల్గొంటారు.
స్థానిక నాయకత్వ పటిష్టతే లక్ష్యం
క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా స్థానిక నాయకత్వాన్ని పటిష్ట పరచాలని వైఎస్సార్ కాంగ్రెస్ నిర్ణయించింది. అందుకోసం పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు, పట్టణ, మండల, గ్రామస్థాయి నేతలతో చర్చించాలని భావించారు. పార్టీ బలోపేతం, వర్తమాన రాజకీయాలు, ప్రభుత్వ వాగ్దానాలు అమలు చేయని పరిస్థితి, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రజల్లో వెల్లువెత్తుతున్న ప్రభుత్వ వ్యతిరేకత తదితర అంశాలపై స్థానిక నాయకత్వాన్ని పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ సదస్సుల ముఖ్య లక్ష్యం. తద్వారా పార్టీని మరింతగా ప్రజాబాహుళ్యంలోకి తీసుకువెళ్లాలన్నది పార్టీ ఉద్దేశం. త్రిసభ్య కమిటీ సభ్యులు, ఇతర ముఖ్యనేతలు పార్టీ స్థానిక నేతలకు దిశానిర్దేశం చేస్తారు. స్థాని నేతల అభిప్రాయాలు, సూచనలు కూడా తీసుకుని భవిష్యత్తులోపార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చిస్తారు.
తదుపరి దశలో...
సోమవారం పాడేరులో నిర్వహించే సమావేశంతో నియోజకవర్గస్థాయి అవగాహన సదస్సులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల నేతలతో అవగాహన సదస్సులు కూడా తదనంతరం నిర్వహిస్తారు. అవి ఎప్పుడెప్పుడు నిర్వహించేది షెడ్యూల్‌ను త్వరలోనే ఖరారు చేస్తారు.