breaking news
Awareness of the Convention
-
ఉద్యోగ సాధనకు ‘వారధి’ యువతకు బంగారు భవిష్యత్
- రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి - అవగాహన సదస్సులో ఎంపీ వినోద్‌కుమార్ - మొదటి రోజు 1000 మంది దరఖాస్తుల స్వీకరణ ముకరంపుర: ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో యువతకు బంగారు భవిష్యత్ ఉందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ అన్నారు. జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న వారధి స్వచ్ఛంద సంస్థ కార్యాలయాన్ని ఎంపీ బుధవారం కలెక్టరేట్లో ప్రారంభించారు. అనంతరం ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జిల్లా కేంద్రంలో వారధి సంస్థ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకోవడంలో యువత వెనుకంజలో ఉండడం విచారకరమన్నారు. ఇప్పటివరకుఎన్డీఏ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ) పరీక్షను ఎవరూ రాయలేదని పేర్కొనడంతో విచారం వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ సెక్టార్‌లోనూ ఆంధ్రావారికే ఉద్యోగాలున్నాయని, రానున్న 15 ఏళ్లలో రెండు రాష్ట్రాల్లోనూ సీమాంధ్ర ఐఏఎస్‌లు ఉండే అవకాశముందని పేర్కొన్నారు. తెలంగాణ యువత వచ్చే నాలుగేళ్లలో కనీసం 20 మంది ఐఏఎస్‌లు కావాలని ఆకాంక్షించారు. ఉద్యోగ సాధనకు పునాది లాంటి వారధి సంస్థ పనితీరును పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తానన్నారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్‌తోపాటు అన్ని రకాల ఉద్యోగాలను వారధి సంస్థ ద్వారా భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న యువత కలలు నెరవేరుతాయన్నారు. నగర మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ యువత కష్టపడితే సాధించలేని లేదని అన్నారు. ఎస్పీ శివకుమార్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో తమ శక్తి సామర్థ్యాల మేరకు లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు పోవాలన్నారు. ర్యాంకులు ముఖ్యం కాదని విషయ పరిజ్ఞానం అవసరమని సూచించారు. కార్యక్రమంలో ఏజేసీ నాగేంద్ర, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, ఆర్డీవో చంద్రశేఖర్ జిల్లా అధికారులు పాల్గొన్నారు. కిక్కిరిసిన కలెక్టరేట్ అవగాహన సదస్సుకు జిల్లా నలుమూలలనుంచి పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలిరావడంతో కలెక్టరేట్ కిక్కిరిసిపోయింది. 2 వేల మంది వరకు రావడంతో ఆడిటోరియం సరిపోక అవస్థలు పడ్డారు. చంటిపిల్లలతో వచ్చిన మహిళలు ఇక్కట్లకు గురయ్యారు. స్థలం లేక కొందరు బయటే ఉండి విన్నారు. ఆడిటోరియంలో వేడి భరించలేక, కుర్చీలు లేక చాలా మంది వెనుదిరిగారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ ఊహించినంతకంటే ఎక్కువ రావడంతో ఇబ్బందిని గమనించామని, మరోసారి అందరికీ సౌకర్యంగా ఉండే చోట సదస్సు నిర్వహిస్తామని, మిగతావారు వారధి కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. బుధవారం కేవలం వెయ్యి దరఖాస్తులు మాత్రమే ఇచ్చారు. అండగా ‘వారధి’ జిల్లా యువతకు వారధి సొసైటీ అండగా ఉంటుందని వారధి( నాలెడ్జ్ రేయిస్ ఫౌండేషన్, వరంగల్) సంస్థ కో ఆర్డినేటర్ భూపతిరాజు, సెక్రటరీ ఆంజనేయులు తెలిపారు. ఆడిటోరియంలో లైవ్ ప్రొజెక్టర్ ద్వారా ఉద్యోగ సాధనకు అవసరమైన అంశాలపై క్లుప్తంగా అవగాహన కల్పించారు. వారధి సంస్థ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకు ఆఫీసర్స్, రైల్వే ఉద్యోగాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, పోలీసు ఉద్యోగాలు, ప్రముఖ కార్పొరేట్ కంపెనీల ఉద్యోగాలపై అవగాహన కల్పిస్తూ నిష్ణాతుల ద్వారా శిక్షణ ఇప్పించనున్నట్లు వెల్లడించారు. కలెక్టరేట్ కాంప్లెక్స్ మొదటి అంతస్తులోని రెడ్‌క్రాస్ కార్యాలయం పక్కన సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. -
బలోపేతం
సంస్థాగతానికి వైఎస్సార్ సీపీ కార్యాచరణ నియోజకవర్గస్థాయి సదస్సులు 6న పాడేరు నియోజకవర్గ సదస్సు హాజరుకానున్న త్రిసభ్య కమిటీ సభ్యులు, ముఖ్యనేతలు విశాఖపట్నం సంస్థాగత బలోపేతం దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాచరణకు ఉపక్రమించింది. గ్రామస్థాయి నుంచి పార్టీ పటిష్టతకు ఉద్యుక్తమైంది. అందుకోసం స్థానిక నేతలకు అవగాహన కల్పించేందుకు నియోజకవర్గస్థాయి సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ అవగాహన సదస్సులను జిల్లా నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 6న పాడేరు నియోజకవర్గస్థాయి అవగాహన సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి.విజయసాయిరెడ్డి, సాగి ప్రసాదరాజు ఈ సదస్సును నిర్వహిస్తారు. వారితోపాటు పార్టీ ఉత్తరాంధ్ర పరిశీలకుడు సుజయ్‌కృష్ణ రంగారావు, పార్టీ రాష్ట్ర వాలంటీర్ల సెల్ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు, బూడి ముత్యాల నాయుడుతోపాటు జిల్లా పార్టీ ముఖ్యనేతలు పాల్గొంటారు. స్థానిక నాయకత్వ పటిష్టతే లక్ష్యం క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా స్థానిక నాయకత్వాన్ని పటిష్ట పరచాలని వైఎస్సార్ కాంగ్రెస్ నిర్ణయించింది. అందుకోసం పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు, పట్టణ, మండల, గ్రామస్థాయి నేతలతో చర్చించాలని భావించారు. పార్టీ బలోపేతం, వర్తమాన రాజకీయాలు, ప్రభుత్వ వాగ్దానాలు అమలు చేయని పరిస్థితి, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రజల్లో వెల్లువెత్తుతున్న ప్రభుత్వ వ్యతిరేకత తదితర అంశాలపై స్థానిక నాయకత్వాన్ని పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ సదస్సుల ముఖ్య లక్ష్యం. తద్వారా పార్టీని మరింతగా ప్రజాబాహుళ్యంలోకి తీసుకువెళ్లాలన్నది పార్టీ ఉద్దేశం. త్రిసభ్య కమిటీ సభ్యులు, ఇతర ముఖ్యనేతలు పార్టీ స్థానిక నేతలకు దిశానిర్దేశం చేస్తారు. స్థాని నేతల అభిప్రాయాలు, సూచనలు కూడా తీసుకుని భవిష్యత్తులోపార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చిస్తారు. తదుపరి దశలో... సోమవారం పాడేరులో నిర్వహించే సమావేశంతో నియోజకవర్గస్థాయి అవగాహన సదస్సులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల నేతలతో అవగాహన సదస్సులు కూడా తదనంతరం నిర్వహిస్తారు. అవి ఎప్పుడెప్పుడు నిర్వహించేది షెడ్యూల్‌ను త్వరలోనే ఖరారు చేస్తారు.