ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాటం

YSRCP Cadres Relay Hunger Strike For AP Special Status - Sakshi

పెనుమంట్ర : జగనన్న స్పూర్తితో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, నేతలు మడమ తిప్పని పోరాటం కొనసాగించాలని పార్టీ ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త కవురు శ్రీనివాసు పిలుపునిచ్చారు. మార్టేరులోని నాలుగు రోడ్ల కూడలిలో ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన నిరాహార దీక్ష శిబిరంలో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక హోదా భావితరాల కోసం ఎంతో అవసరమన్నారు. భవిష్యత్‌లో పిల్లల విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక హోదా అత్యవసరమన్నారు.

ఆంధ్రుల హక్కుగా ఉన్న ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం కరివేపాకులా తీసి పారేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో హోదా ఇస్తామని వాగ్దానం చేసిన మోదీ ఇప్పుడు మాట తప్పడం అన్యాయమన్నారు. హోదా కోసం టీడీపీ నేతలు కేంద్రంపై చిత్తశుద్ధితో పోరాటం చేయడంలేదని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయటం చరిత్రాత్మకమని కొనియాడారు. వారి త్యాగం తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. జగనన్న హోదా కోసం రాజీలేని పోరు సాగిస్తున్నారని అన్నారు. సోమవారం చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలను, నాయకులను కోరారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి తరలివచ్చిన నేతలు కార్యకర్తలు శిబిరంలో కూర్చుని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

జిల్లా నాయకులు వైట్ల కిషోర్, అల్లం బులిరెడ్డి, ఆచంట, పోడూరు, పెనుగొండ, పెనుమంట్ర మండలాల పార్టీ కన్వీనర్లు ముప్పాల వెంకటేశ్వరరావు, రుద్రరాజు శివాజీరాజు, దంపనబోయిన బాబూరావు, కర్రి వేణుబాబు, వెలగల శ్రీనివాసరెడ్డి, దొంగ దుర్గాప్రసాద్, పడాల కేశవరెడ్డి, వెలగల నారాయణరెడ్డి, వై.వరప్రసాద్, కర్రి సురేష్‌రెడ్డి, చింతపల్లి చంటి, రామచంద్రరావు, కొవ్వూరి వేణుమాధవరెడ్డి, కవురు శెట్టి, గుడాల సుబ్బారావు ఆదివారం నాటి రిలే దీక్షలో కూర్చున్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు తిరుపతి పెదకాపు, ఉన్నమట్ల మునిబాబు, అల్లం భాస్కరరెడ్డి, బుర్రా రవికుమార్, గుడిమెట్ల సత్యనారాయణరెడ్డి, వీరవల్లి స్వామి, బళ్ల బద్రి, పడాల కేశవరెడ్డి, షేక్‌ సాహెబ్, చిర్ల నరసింహారెడ్డి, కోనాల గంగాధరరెడ్డి, ఈది ప్రవీణ్‌ తదితరులు వారికి సంఘీభావం తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top