
సాక్షి, న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సోమవారం వర్కింగ్ డే కావడంతో ముందుగానే ఏపీ భవన్‌లో వేడుకలు నిర్వహించినట్లు భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. జూలై 8న వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని ఆ రోజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్సార్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’చిత్రాన్ని అంబేడ్కర్ ఆడిటోరి యంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ చిత్రా న్ని వీక్షించేందుకు స్థానిక తెలుగు ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ చీఫ్ కమిషనర్, వైఎస్సార్ హయాంలో ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసిన సంపత్‌కుమార్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం చిత్ర విరామం వేళలో చిన్నారులతో కలసి ఆయన కేక్ కట్ చేశారు. నిబద్ధత, అంకితభావానికి వైఎస్సార్ మారుపేరని కొనియాడారు.