ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాం... కలసిరండి బాబూ!

ys jagan's prajasankalpa yatra - Sakshi

మాతో పాటు మీ పార్టీ ఎంపీలతో కూడా రాజీనామా చేయించండి

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పిలుపు

హోదా సాధించేవరకు మా పోరాటం ఆగదు

మహిళల ఆత్మీయ సమ్మేళనంలో ప్రతిపక్షనేత స్పష్టీకరణ

ప్రజా సంకల్ప యాత్ర నుంచిసాక్షి ప్రత్యేక ప్రతినిధి :
ఎంపీల రాజీనామాల నిర్ణయంతో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరో దశకు తీసుకువెళ్లిన వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారంనాడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో సంచలన సవాల్‌ విసిరారు. ‘మా ఎంపీలు రాజీనామా చేస్తున్నారు వారితోపాటు మీ ఎంపీల చేత కూడా రాజీనామా చేయించండి’ అని పిలుపునిచ్చారు. ఐదుకోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ మొదటి నుంచీ అనేక రూపాలలో పోరాడుతున్న సంగతి తెల్సిందే.

శ్రీపొట్టి శ్రీరాములునెల్లూరు జిల్లాలో ప్రజా సంకల్ప పాదయాత్రలో ఉన్న జగన్‌ గురువారం ఉదయగిరి నియోజకవర్గంలోని రేణమాలలో జరిగిన మహిళల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఒక విద్యార్ధిని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ జగన్‌ పై విధంగా పిలుపునిచ్చారు.  ప్రత్యేక హోదా సాధన కోసం కృషి చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలసి నడిచేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందా? అని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా ఆంధ్రప్రదేశ్‌కు ఊపిరి వంటిదని, దానిని సాధించే వరకు తమ పోరాటం ఆగదని జగన్‌ స్పష్టం చేశారు.

రాజీనామాలు చేద్దాం రండి..
‘చంద్రబాబు గారూ, మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలతో పాటు తెలుగుదేశం పార్టీ ఎంపీలందరూ.. ఏపీకి చెందిన మొత్తం 25 మంది ఎంపీలూ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే అçప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం ఎక్కడకు పోతుందో చూద్దాం’ అని జగన్‌ వ్యాఖ్యానించారు. ‘ఇప్పటికైనా మీరు ప్రత్యేక ప్యాకేజీ అన్న దానిని పక్కనపెట్టండి.

మోసపూరిత ప్యాకేజీ కోసమో.. అర్ధ రూపాయి, రూపాయి తగ్గింది, ఇవ్వండి అని అడగడం కోసమో ప్రయత్నాలు మాని ప్రత్యేక హోదా సాధించడం కోసం ముందుకు రండి’ అని చంద్రబాబుకు ఆయన పిలుపునిచ్చారు.  ‘ఈ వేళ మీ నోటి వెంట వచ్చిన మాటలతోనైనా చంద్రబాబును గట్టిగా డిమాండ్‌ చేస్తూ అడుగుతున్నాను. మీ అందరి తరఫున అడుగుతున్నా. ఇప్పటికైనా ఆయనకు జ్ఞానోదయం అవుతుందేమో..కాస్తోకూస్తో ముందుకొస్తారేమో ఆశిద్దాం’ అని సమ్మేళనానికి హాజరైన మహిళలతో జగన్‌ పేర్కొన్నారు.

ప్యాకేజీ కోసం హోదాను అమ్మేస్తారా..?
రాష్ట్రానికి  ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉద్యోగాలు వస్తాయని జగన్‌ స్పష్టం చేశారు. హోదా అన్నది బిక్షం వేసినట్టు ఇచ్చేది కాదని.. ఆ రోజు పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీ అని, హోదా ఇస్తామన్న హామీతోనే రాష్ట్రాన్ని విడగొట్టారని గుర్తు చేశారు. ‘విభజన చట్టం చేసే రోజు పార్లమెంట్‌లో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త ఫ్యాక్టరీ పెట్టడానికే మూడేళ్లు పడుతుందని.. హోదా ఐదేళ్లు ఏమి సరిపోతుంది, పదేళ్లు కావాలని అడిగారు. చంద్రబాబు కూడా హోదా  ఐదేళ్లు, పదేళ్లు కాదు 15 ఏళ్లు కావాలని అడిగారు.. హోదా సంజీవని అని ఆరోజు చెప్పారు.

ఇవాళ మాత్రం చంద్రబాబు ప్యాకేజీ కోసం, లంచాలు, కమీషన్లు తీసుకోవడం కోసం హోదాను పూర్తిగా అమ్మేసిన పరిస్థితి కనిపిస్తోంది’ అని జగన్‌ దుయ్యబట్టారు. ‘అందుకే హోదా మన హక్కు ప్యాకేజీ కోసం మోసం చేయొద్దు చంద్రబాబూ అని గట్టిగా నినాదమిచ్చాం. హోదా మా హక్కు ప్యాకేజీ మాకొద్దు అన్న నినాదంతోనే పోరాటం చేస్తాం. ఆ పోరాటంలో భాగంగానే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల చివరి రోజు వరకు హోదా కోసం వీరోచితంగా పోరాటం చేస్తారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రతి ఒక్కరూ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద మార్చి 1న ధర్నా నిర్వహిస్తారు.

మార్చి 3న పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్లు నేను పాదయాత్ర చేస్తున్న ప్రదేశానికి వస్తారు. అక్కడి నుంచి నేను వారందరినీ జెండా ఊపి ఢిల్లీకి పంపుతాను.’ అని జగన్‌ వివరించారు. ‘పార్టీ నేతలంతా మార్చి 5న పార్లమెంటు వద్ద ధర్నా చేస్తారు. ఆ తర్వాత మార్చి 5 నుంచి ఏప్రిల్‌ 6 వరకూ పార్లమెంటులో మన ఎంపీలు హోదా కోసం పోరాటం చేస్తారు. ఫలితం లేకపోతే పార్లమెంటు సమావేశాల చివరి రోజైన ఏప్రిల్‌ 6న లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేసి ఆ రాజీనామాలను వారి మొఖాన కొట్టి మన రాష్టానికి తిరిగి వస్తారు’ అని జగన్‌ స్పష్టంచేశారు.

రాష్ట్రమంతటా టీడీపీ నేతల దాష్టీకాలే మహిళా సదస్సులో ప్రతిపక్ష నేత జగన్‌
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో నాలుగేళ్లుగా మహిళలకు భద్రత లేకుండా పోయిందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అండతో టీడీపీ నేతల అరాచకాలకు అడ్డే లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గురువారం 88వ రోజు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రెణమాలలో మహిళల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు.

పెందుర్తిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అండదండలతో ఆయన అనుచరులు దళిత మహిళ బట్టలు ఊడదీయించి కొట్టి.. భూములు లాక్కోవడం దారుణం అన్నారు. అలాంటి వారిపై కూడా కేసులు పెట్టని పరిస్థితిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పోరాడాల్సి వచ్చిందన్నారు. రోజా అక్కడికి వెళ్లి ధర్నా చేస్తే తప్ప కేసులు నమోదు కాని పరిస్థితి అన్నారు. పెందుర్తితో పాటు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఒక అక్కను బట్టలు ఊడతీసి, దారుణంగా కొట్టి, అది సోషల్‌ మీడియాలో చూపించే అన్యాయమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారన్నారు.

ఇసుక దోపిడీని అడ్డుకున్న మహిళా ఎమ్మారో వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని జుట్టుపట్టుకొని ఈడ్చినప్పుడు ఆయనపై కఠినంగా చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితులు ఏర్పడేవే కావన్నారు. ఆ పెద్దమనిషి (చంద్రబాబు) ఆ ఎమ్మెల్యేను ఆనాడు జైలులో పెట్టేందుకు ధైర్యం చేయకపోవడం వల్లే ఈ రోజు రాష్ట్రంలో మరే మహిళకూ రక్షణలేని పరిస్థితి నెలకొందని నిప్పులు చెరిగారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top