సామాన్యుడి నేస్తం | YS Jagan Schemes For Common Man | Sakshi
Sakshi News home page

సామాన్యుడి నేస్తం

Apr 7 2019 2:07 PM | Updated on Apr 7 2019 2:07 PM

YS Jagan Schemes For Common Man - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: సామాన్యుడికి సరైన నేస్తం దొరికాడు. కష్టం పంచుకుని, కన్నీరు తుడవగలిగే మనసున్న స్నేహితుడు లభించాడు. డబ్బు లేదని పిల్లాడి చదువు ఆగిపోతోందని తెలిసి స్కూల్‌కు పంపితే డబ్బులిస్తానని హామీ ఇచ్చాడు. చేతిలో సొమ్ము ఉంటే గానీ పేదల ప్రాణం నిలబడదని తెలుసుకుని ఎక్కడికైనా వెళ్లి చికిత్స చేయించుకోండి డబ్బు ప్రభుత్వం ఇస్తుంది అని భరోసా ఇచ్చాడు. వైఎస్‌ జగన్‌ రూపంలో సగటు మనిషికి ఓ ధైర్యం దొరికింది. యూనివర్సల్‌ హెల్త్‌ స్కీమ్, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ కమిటీ ఆలోచనలతో జగన్‌ సామాన్యుడి మనసును ఎంతలా చదివారో అందరికీ అర్థమవుతోంది. ఈ పథకాలు అమలైతే దిగువ తరగతి జీవి మర్చిపోయిన నవ్వు మళ్లీ వారి పెదాలపై విరబూస్తుంది. దూరమైన సంక్షేమం వారింటికి తిరిగొస్తుంది.

ఫీజులుంనకు కళ్లెం!
ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో అధిక ఫీజుల వసూళ్ల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు తెలుగుదేశం హయాంలో ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నా కనీస నియంత్రణకు చర్యలు తీసుకోలేదు. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థల అధినేతలు అధికార పార్టీలోను, ప్రభుత్వంలోను కీలక భూమిక పోషిస్తుండడంతో కార్పొరేట్‌ విద్యా సంస్థల జులుంనకు ఎందరో విద్యార్థులు బలికావాల్సి వచ్చింది.

విద్యా సంవత్సరం చివరిలో ఏకపక్ష నిర్ణయంతో ఫీజులను పెంచేసి దాన్ని కట్ట కుంటే హాల్‌ టిక్కెట్లను ఇవ్వకుండా మానసిక వేదనకు గురిచేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇవే కాకుండా ఏటా పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర వస్తువులు తమ వద్దే కొనుగోలు చేయాలంటూ వేలాది రూపాయలను వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మానసిక ఆందోళనకు గురిచేస్తూ వచ్చాయి. ఐఐటీ శిక్షణ, ఎంసెట్‌ శిక్షణ అంటూ అదనపు ఫీజులను వసూళ్లు చేసినా ప్రభుత్వం చోద్యం చూస్తూ వచ్చింది. ప్రస్తుతం నర్సరీ విద్యార్థి ఫీజు రూ. 20వేల వరకు ఉండగా పదో తరగతి విద్యార్థి ఫీజు రూ. 60వేలకు పైబడి ఉంది.

జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ విద్యార్థుల నుంచి రూ. 45 వేల నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా కార్పొరేట్‌ విద్యా సంస్థలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను దోపిడీకి గురిచేస్తున్నా ప్రభుత్వం వారిని నియంత్రించలేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయకుండా పర్యవేక్షణ కమిటీని నియమిస్తామని, ఆ కమిటీలపై ప్రభుత్వ అజమాయిషీ ఉంటుందని ప్రకటించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసేలా పలు ప్రకటనలు చేయడంతో పేద వర్గాల నుంచి కూడా ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.

పేదల ఆరోగ్యానికి భరోసా
యూనివర్సల్‌ హెల్త్‌ కార్డు.. ఆరోగ్యశ్రీ పథకానికి 2.0 వెర్షన్‌ ఇది. రాజన్న ఆదర్శానికి జగన్‌ ఆలోచన కలగలిపితే రూపొందిన పథకమిది. రూ.5లక్షల్లోపు ఆదాయం గల కుటుంబాలకు ఈ కార్డుతో సకల వైద్య సదుపాయాలు అందిస్తారు. బడుగు జీవులు అధికంగా ఉండే శ్రీకాకుళం వంటి జిల్లాకు ఈ పథకం వరదాయినే. జిల్లాలో సుమారుగా 7.50 లక్షల కుటుంబాలకు ఈ పథకం వల్ల ప్రయోజనం కలగనుంది. ప్రధానంగా ఈ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా దీర్ఘకాలిక రోగులు కిడ్నీ, తలసేమియా వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 10 వేలు పింఛను కూడా అందిస్తామని చెప్పారు. వారికి వైద్యంతో పాటు పింఛన్‌ అందితే చాలా మంది బతుకులు బాగుపడతాయి.

జిల్లాలో పరిస్థితి..
జిల్లాలో పేద, మధ్య తరగతి కుటుంబాల్లో వ్యక్తులకు ఏ చిన్న రోగం వచ్చినా, ప్రభుత్వం వైద్యం అందించే పరిస్థితి జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాల్లో లేదు. దీంతో ప్రతి రోగి ప్రైవేటు వైద్యంపైనే ఆధారపడుతున్నాడు. చిన్న చిన్న సమస్యలకు కూడా వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. జిల్లాలో ప్రభుత్వం పరంగా 82 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 15 కమ్యూనిటీ ఆస్పత్రులు, మూడు ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్రాస్పత్రి, ఇంకా వీటితో పాటుగా ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్‌) ఉన్నా సామాన్యుడు మాత్రం ప్రైవేటు వైపే చూస్తున్నాడు. ఐదేళ్లుగా రిమ్స్‌ను పట్టించుకోవడమే మానేశారు. దాదాపు 350 వరకు ఉన్న ప్రైవేటు వైద్య శాలలు రోగుల నుంచి రక్తాన్ని ఫీజుల రూపంలో పిండేస్తున్నాయి. యూనివర్సల్‌ హెల్త్‌ కార్డు గనక అందితే పేదలకు ఇక వైద్యం గురించి దిగులే ఉండదు.

కదిలించిన గాథ
టెక్కలి: కోటబొమ్మాళికి చెందిన దాసరి శ్రీదేవి అనే మహిళ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఖరీదైన వైద్యం చేయించుకోలేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా కొత్తపేట సమీపంలో జగన్‌మోహన్‌రెడ్డిని 2018 డిసెంబర్‌ 19న కలిసి తన కష్టాన్ని విన్నవించుకున్నారు. ఆమె బాధ విని చలించిపోయిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమెను ఆదుకోవడమే కాక.. తాను అధికారంలోకి రాగానే పేద, సామాన్య వర్గాలకు ఖరీదైన వైద్యం అందే విధంగా ప్రణాళిక రూపొందిస్తానని మాట ఇచ్చారు. ఇలాంటి ఎందరో బాధితుల కష్టాలు, కన్నీళ్లు చూసిన ప్రజా నేత ఈ రోజు యూనివర్సల్‌ హెల్త్‌ కార్డుల విప్లవానికి నాంది పలికారు. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి వ్యక్తికి అన్ని రకాల వైద్య సేవలు అందే విధంగా ప్రకటన చేశారు.

హామీలివే.. (ఆరోగ్య శ్రీ పథకం)
వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు కంటే తక్కువ ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తింపు.
వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం ూ ఎంత ఖర్చయినా ఆరోగ్య శ్రీ ద్వారా పూర్తి ఉచిత వైద్యం
వైద్యం చేయించుకున్నా (హైదారాబాద్, బెంగూలూరు, చెన్నై తదితర) పథకం వర్తింపు
అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లు ఆరోగ్య శ్రీపరిధిలోకి
ఆపరేషన్, జబ్బుచేసిన వ్యక్తి చికిత్స తర్వాత ఆ కుటుంబానికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం.
కిడ్నీ వ్యాధి తలసేమియా, ఇంకా ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి ప్రత్యేకంగా రూ. 10 వేలు పింఛను.  

అన్ని రకాల వైద్యసేవలు


గతంలో రాజశేఖరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వందలాది జబ్బులకు ఉచితంగా వైద్యం చేయించారు. టీడీపీలో అది పూర్తి నాశనమైంది. యూనివర్సల్‌ హెల్త్‌కార్డు ద్వారా అన్ని రకాల వైద్య సేవలు అందడం పేదల పాలిట వరం. నాటి ఆరోగ్యశ్రీ రాజన్న మానస పుత్రిక అయితే నేటి ఈ పథకం జగనన్న మానస పుత్రిక.
– వాన నాగేశ్వరరావు, టీ.లింగాలుపాడు, జలుమూరు 

తండ్రి కంటే రెట్టింపు సంక్షేమం
జగన్‌ ప్రవేశ పెట్టిన హెల్త్‌కార్డు వైఎస్సార్‌ కంటే రెట్టింపు సంక్షేమం ఇస్తుంది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి  కనీసం సరైన వైద్యం కూడా చేయించుకోలేని స్థితిలో ఉన్న పేదలకు ఆసరాగా ఈ పథకం నిలబడుతుంది.
– సనపల సురేష్‌కుమార్, ప్రైవేటు ఉద్యోగి, ఆమదాలవలస

రూ.లక్షల్లోనే ఖర్చు


ప్రస్తుత రోజుల్లో పిల్లలను చదివించుకోవాలంటే రూ.లక్షల్లోనే ఖర్చవుతోంది. ఫీజుల విషయంలో పాఠశాల యాజమాన్యాలు కనికరం చూపడం లేదు. తల్లిదండ్రులకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇలాం టి పరిస్థితుల్లో ఫీజుల నియంత్రణ అత్యవసరం.                        
– పడాల శాంతరావు, తీమర గ్రామం, పాతపట్నం

ప్రైవేటు దోపిడీ ఆపాలి 
ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలపై ఫీజుల విషయంలో పట్టించుకోకపోవడంతో అవి ఇష్టానుసారం దోపిడీ చేస్తున్నాయి. ఈ దోపిడీ వ్యవస్థపై జగన్‌ సరైన నిర్ణయం తీసుకున్నారు. పేద, మధ్య తరగతి వారికి ఈ నిర్ణయం ఊరటనిస్తుంది.
– అమర్‌ రామారావు, కొరసవాడ గ్రామం, పాతపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement