
సాక్షి, అనంతపురం: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. సోమవారం కూడేరు నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్.. తలుపూరులోకి చేరుకోగా.. అక్కడ స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రస్తుత పాలనలో తాము పడుతున్న ఇబ్బందులను వైఎస్ జగన్‌కు వివరించారు.
చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేరలేదని, అబద్ధపు హామీలతో చంద్రబాబు మోసం చేశాడని జగన్ ఎదుట వాపోతున్నారు. వారి బాధలు విన్న వైఎస్ జగన్...మరో ఏడాదిలో రాజన్నరాజ్యం వస్తుందని భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. వడ్డుపల్లి, మదిగుబ్బ క్రాస్ మీదుగా సాయంత్రం వరకు పాదయాత్ర సాగుతుంది. మైనార్టీలతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు లంచ్ క్యాంప్ నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. 3.30 గంటలకు వడ్డుపల్లి, 4.30 గంటలకు మదిగూడ గ్రామానికి చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకు వైఎస్ జగన్ 32వ రోజు పాదయాత్ర ముగుస్తుంది.