75వ రోజు పాదయాత్ర డైరీ | ys jagan prajasankalpayatra dairy 75th day | Sakshi
Sakshi News home page

‘పట్టు’సడలుతున్న చేనేత బతుకులు

Jan 31 2018 3:55 AM | Updated on Jul 25 2018 5:17 PM

ys jagan prajasankalpayatra dairy 75th day - Sakshi

30–01–2018, మంగళవారం
తులపూరు క్రాస్‌రోడ్డు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా

సిద్ధలయ్యకోన ఎస్టీ కాలనీలో 90 ఏళ్ల అవ్వ దయనీయ పరిస్థితి చూశాక.. అసలీ ప్రభుత్వం సిగ్గెందుకుపడటంలేదా అనిపిస్తోంది. నడుం వంగిపోయి, జవసత్వాలుడిగిపోయి, ఇద్దరు మనుషుల ఆసరాతో దీనంగా నా వద్దకొచ్చి ఆమె బాధ చెప్పుకొంది. దశాబ్దాల కిందటే భర్త చనిపోయాడట. కన్నకొడుకు పట్టించుకోవడంలేదట. ఎక్కడో ఊరి బయట ఓ గుడిసెలో ఉంటుందట. చినుకు పడితే నీళ్లన్నీ ఇంట్లోనే.. సూర్యచంద్రులు కనిపించేలా ఉందట. ఊళ్లోవాళ్లు దయతో ఓ ముద్దపెడితే కడుపు నింపుకొంటోందట. ‘చావాలనిపిస్తోందయ్యా..’ అన్న ఆ అవ్వ మాటలు కలచివేశాయి. ప్రభుత్వ సాయం పొందడానికి ఇంతకన్నా ఇంకేం అర్హత కావాలి? కనీసం ఇలాంటి వాళ్లనైనా ఈ ప్రభుత్వం కనికరించదా?

కూలి పనులకెళ్లే సుమతి అనే అక్క బాధ వింటే.. మనసున్న ఏ గుండె అయినా కరిగిపోతుంది. 90 శాతం మానసిక, శారీరక వైకల్యంతో ఉన్న కొడుకుని చూస్తూ.. ఆ తల్లి కన్నీరు పెట్టని రోజు లేదని చెప్పింది. భర్త తాగుడుకు బానిసై.. పోషించే దిక్కులేకపోయినా, జీవితాన్ని కరగదీసి అతికష్టంమీద బతుకు బండిని లాగుతున్నానని చెప్పింది. ఇక ఓపిక నశించిందని కన్నీరు పెట్టింది. కనీసం పింఛన్‌ అయినా ఇవ్వాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ బావురుమంది. ఆ పరిస్థితుల్లో ఉన్న ఆ తల్లి గోడు చంద్రబాబు జన్మభూమి కమిటీలకు ఎందుకు వినిపించలేదు? బతకడానికైనా భరోసా ఇవ్వలేని ఈ ప్రభుత్వం.. ఆ కన్నీటికి ఏం సమాధానం చెబుతుంది?

కలిచేడు వద్ద ‘మా స్కూలు మూసేస్తారంట సార్‌.. మేం పేద పిల్లకాయలం, బయటికెళ్లి చదువుకోలేం. మా స్కూలు మాకు కావాలి సార్‌’ అంటూ మైకా కార్మిక సంక్షేమ పాఠశాల విద్యార్థినులు కన్నీరు పెట్టుకున్నారు. ఇక్కడున్న ఆస్పత్రిని కూడా మూసేశారని కార్మికులు, ప్రజలు వాపోయారు. రాయల్టీలు, సెస్‌ల రూపంలో కోట్లాది రూపాయల ఆదాయాన్ని గడిస్తున్న ప్రభుత్వం మైనింగ్‌ కార్మికుల గురించి, వారి పిల్లల గురించి పట్టించుకోకపోతే ఎలా?

వెంకటగిరి చేనేతకు ప్రసిద్ధి. తమ శ్రమతో, కళాత్మక నైపుణ్యంతో ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ చేనేత కుటుంబాల జీవితాలిక్కడ సమస్యల వలయాలు. చిన్న వయసులోనే రోగాల బారిన పడుతున్నవారు, బతుకీడ్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నవారు ఎందరెందరో. కలిచేడులో జరిగిన చేనేతల ఆత్మీయ సమ్మేళనంలో ఆ కుటుంబాల వ్యథా భరిత గాథలు వింటుంటే చాలా బాధేసింది. ఎన్నికలప్పుడు చంద్రబాబు బూటకపు హామీలిచ్చి ఒక్కటీ నెరవేర్చలేదు. నేతన్నలకు తోడుగా నేను గళం విప్పినప్పుడు మాత్రం ప్రభుత్వంలో కదలిక వస్తోందని, పరిహారమైనా, సబ్సిడీలైనా అప్పుడు మాత్రం హడావుడిగా ఇస్తున్నారని చెప్పారు. ‘అన్నా.. ఈ ప్రభుత్వం మూడేళ్లుగా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మీరొచ్చారు కాబట్టి, మీ నోట్లోంచి మాటొచ్చింది కాబట్టి.. ప్రభుత్వంలో కదలిక వస్తుందని ఆశిస్తున్నాం’ అన్న వారి మాటలు విన్నాక.. ఈ ప్రభుత్వం ఎంత అన్యాయంగా పనిచేస్తోందో మరింత తేటతెల్లమైంది. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. చేనేతలకు వెయ్యి కోట్లతో నిధి, ఆరోగ్య బీమా, వడ్డీ లేకుండా రుణాలు, ఇళ్లు, షెడ్లు, రుణమాఫీ.. అంటూ మీ మేనిఫెస్టోలోని 21వ పేజీలో 25 హామీలను గుప్పించారు గుర్తుందా? ఏ ఒక్కటైనా నెరవేర్చారా? ఇచ్చిన హామీలను గాలికొదిలేయడమేగాక ఉన్న సబ్సిడీలను, బీమాలను, ఇతర పథకాలను నిలిపివేయడం వంచన కాదా?

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement