పేదలకు ఏపీ సర్కారు బంపర్‌ ఆఫర్‌ | Ys Jagan Mohan Reddy Approved For 1 Ruppe Registrstion | Sakshi
Sakshi News home page

2 సెంట్లలోపు వరకు.. రూపాయికే రిజిస్ట్రేషన్‌!

Published Fri, Oct 18 2019 5:42 AM | Last Updated on Fri, Oct 18 2019 8:40 AM

Ys Jagan Mohan Reddy Approved For 1 Ruppe Registrstion - Sakshi

సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లో అభ్యంతరాల్లేని అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. రెండు సెంట్లలోపు వరకు మొత్తం రూపాయికే రిజిస్ట్రేషన్‌ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అంతకు మించితే క్రమబద్ధీకరణ ఫీజు ఎంత ఉండాలన్న దానిపై ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన సూచించారు. అలాగే, వీటి క్రమబద్ధీకరణకు విధివిధానాలు తయారు చేయాలన్నారు. ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే విషయమై గురువారం ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) పిల్లి సుభాష్‌ చంద్రబోస్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.

కాల్వగట్ల వాసులకు ప్రాధాన్యం
నదీతీరాల వెంబడి, కాల్వగట్ల వెంబడి ఉన్న ఇళ్ల కారణంగా ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు పొంచి ఉన్నందున.. స్థలాలు, ఇళ్ల కేటాయింపులో ఇక్కడి వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. గతంలో స్థలం ఇచ్చినా రిజిస్ట్రేషన్‌ చేసే వారు కాదని.. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్‌ చేస్తున్నామన్నారు. చంద్రబాబు పేదలకు ఇచ్చిన స్థలాలను లాక్కున్నారని.. ఒకసారిఇచ్చిన తర్వాత ఎలా లాక్కుంటారని జగన్‌ ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణానికి వీలైనంత మేర ప్రభుత్వ స్థలాలనే వాడుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

విడివిడిగా ఇళ్లే ఇవ్వండి
పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్నచోట పేదలకు అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు కన్నా.. ఇళ్ల స్థలాలు కేటాయించి వాటిలో విడివిడిగా ఇళ్లు కట్టించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం పేదలు ఉంటున్న బహుళ అంతస్తుల సముదాయాల్లో నిర్వహణ సరిగ్గాలేదని.. ఫలితంగా ఫ్లాట్లు దెబ్బతింటున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. దీనికి పరిష్కారంగా లబ్ధిదారులకు విడివిడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. అలాగే, ప్రస్తుతం సమస్యలు ఎదుర్కొంటున్న ఫ్లాట్లను బాగుచేసుకునేలా ఏదైనా ఆలోచన చేయాలన్నారు.

లబ్ధిదారుల జాబితా విధిగా ప్రదర్శించాలి
ఇళ్ల స్థలాలు పొందే లబ్ధిదారుల జాబితాలను విధిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని కూడా సీఎం ఆదేశించారు. ఇళ్ల స్థలాల కోసం ఎవరికైనా అర్హత లేకపోతే అందుకు కారణాలను కూడా వారికి తెలియజేయాల్సిందేనని స్పష్టంచేశారు. ఈ సమయంలో మంత్రి బుగ్గన జోక్యం చేసుకుని.. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు, ఇళ్లు విషయంలో.. వైఎస్సార్‌సీపీకి ఓట్లేశారని, ఆ పార్టీ సానుభూతిపరులంటూ వారికి నిరాకరించారని తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించే లబ్ధిదారుల జాబితా కింద దరఖాస్తులు ఎవరికి చేయాలి.. ఎలా చేయాలి.. ఎవరిని సంప్రదించాలి వంటి సూచనలు కూడా ఇవ్వాలని సీఎం చెప్పారు.

జనవరి వరకూ దరఖాస్తులు స్వీకరించాలి
ఇళ్ల స్థలాల లబ్ధిదారుల నుంచి జనవరి వరకూ దరఖాస్తులు స్వీకరించాలని, లక్ష్యం కన్నా మరో 10 శాతం అదనంగా ఇళ్ల స్థలాలను బఫర్‌గా పెట్టుకుంటే దరఖాస్తుదారులు అనుకున్న దానికంటే ఎక్కువ ఉన్నా ఇబ్బందిలేకుండా ఉంటుందని సీఎం అన్నారు.

20,47,325 మంది లబ్ధిదారులు
ఇప్పటివరకూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల సంఖ్య 20,47,325గా తేలిందని, ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకూ 19,389 ఎకరాల భూమిని గుర్తించామని, ఇక్కడ మరో 8వేల ఎకరాలు అవసరమయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే, పట్టణ ప్రాంతాల్లో 2,559 ఎకరాలను గుర్తించామని, ఇక్కడ ఇంకా 11వేల ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. మొత్తం మీద పేదల ఇళ్ల స్థలాల కోసం సుమారు రూ.10 వేల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నారు.  (చదవండి: సీఎం జగన్‌ చరిత్రాత్మక నిర్ణయం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement