కేంద్రంలో వచ్చేది హంగే!

YS Jagan Meets Neutral Influencers,Opinion Makers - Sakshi

పలు సర్వేలు అదే సూచిస్తున్నాయి.. మన రాష్ట్రానికి అదే మేలు చేస్తుంది

ఏపీకి మేలు చేసేందుకు దేవుడు ఆ పరిస్థితులు కల్పిస్తున్నాడు

ఎన్నికల్లో మాకు ఎవరితోనూ పొత్తులుండవ్‌

మొత్తం 25 ఎంపీ సీట్లను గెలుచుకుని ఢిల్లీ పీఠాన్ని శాసిద్దాం

ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్లను సాధించుకుందాం

వాటిని మనకు ఎవరిస్తే వారికే మద్దతిద్దాం

నవరత్నాలను కాపీ కొడుతున్నారు

కాపీ కొట్టే స్టూడెంట్‌కు చివరకు మార్కులు రావు

యువతకు ఉపాధి కల్పనే మా ధ్యేయం

గ్రామ వలంటీర్లతో అందుకు నాంది

మేధావులు, తటస్తులతో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ భేటీ

స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇప్పిస్తామని స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకీ సొంతంగా మెజారిటీ రాదని, త్రిశంకుసభ(హంగ్‌) ఏర్పడుతుందని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ అభిప్రాయపడ్డారు. దేవుడు ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేయడం కోసమే కేంద్రంలో హంగ్‌ పరిస్థితులు సృష్టిస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాసిచ్చిన పార్టీకే వైఎస్సార్‌ సీపీ మద్దతు ఇస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ఏ పార్టీతోనూ తమకు పొత్తులుండవని జగన్‌ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు మాయమాటలతో ప్రజల్ని మరోసారి వంచించేందుకు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. మేధావులు, తటస్తులతో వైఎస్‌ జగన్‌ గురువారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. ‘అన్న పిలుపు’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ సమావేశానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వారి నుంచి సూచనలు, సలహాలను జగన్‌ తీసుకున్నారు. రానున్న రోజుల్లో 13 జిల్లాలో ఇటువంటి సమావేశాలు నిర్వహించనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో ప్రభావం చూపగల దాదాపు 60 వేల మందికి పైగా వ్యక్తులు జగన్‌ నుంచి వ్యక్తిగతంగా జనవరిలో ఈ ఉత్తరాలు అందుకున్నారు. వారిలో కొందరు తొలి విడత భేటీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సోదాహరణంగా సమాధానాలు చెప్పారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవీ..

వచ్చేది హంగ్‌ పార్లమెంటే...
ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌ కోసం మనం ప్రతిపక్షంగా పోరాడుతూనే ఉన్నాం. రేపొద్దున దేవుడు ఆశీర్వదిస్తాడనే నమ్మకం నాకుంది. రేపొద్దున కేంద్రంలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాదు అనేది క్లియర్‌కట్‌గా కనిపిస్తోంది. అది దేవుడు మన ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేయడం కోసమే చేస్తున్నాడు. కనీసం అప్పుడైనా మన రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు అంటే 25కి 25 మన చేతిలో ఉంటే మనం రేపొద్దున కేంద్రంపై ఏ స్థాయిలో ఒత్తిడి తెస్తామంటే... మనం ముందే పొత్తు పెట్టుకోవడాలూ ఇవన్నీ ఉండవు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోం. రేప్పొద్దున మనం 25 లోక్‌సభ సీట్లు గెలిచిన తర్వాత అప్పుడు మనమంటాం... నువ్వు సంతకం పెట్టు నేను సపోర్ట్‌ చేస్తా అని. ఇప్పుడు పొత్తు పెట్టుకోండి మేం చేస్తాం అని చెప్పే మాటలను నమ్మడానికి లేదు. ఇప్పుడు అలాగే చేస్తాం చేస్తాం అంటారు పనైపోయిన తర్వాత ఎవరూ చేయరు. నువ్వు సంతకం పెట్టు నేను సపోర్ట్‌ చేస్తా అనే స్టేజిలోకి మనం వెళ్లాలి. దేవుడు ఆశీర్వదిస్తే అది ఖచ్చితంగా జరుగుతుందని నాకు నమ్మకముంది. రాష్ట్రంలో కూడా నిన్నా మొన్నా సర్వే రిపోర్టులు చూస్తుంటే అదే పరిస్థితి కనిపిస్తోంది. దేవుడు ఖచ్చితంగా హంగ్‌ ఇస్తాడు, అది మన కోసమే ఇస్తాడు..ఖచ్చితంగా నువ్వు అడిగిన రైల్వేజోన్‌ వస్తుంది, ప్రత్యేక హోదా వస్తుంది...అది మన హక్కు కూడా.

వైఎస్సార్‌ చేయూత కింద అందరికీ సాయం...
‘‘పాదయాత్ర జరుగుతున్నప్పుడు బహుశా విశాఖలో అనుకుంటా.. మైనార్టీలతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. రసూల్‌ తదితరులు కూడా వచ్చారు. అప్పుడు ప్రధానంగా అడిగిందేమిటంటే మైనార్టీ కార్పొరేషన్‌తో మమ్మల్ని (దూదేకులను) ఏకం చేశారన్నా.. ఆ ప్రయోజనాలు మాదాకా రావడం లేదన్నా అంటూ చంద్రబాబు తమను ఏరకంగా మోసం చేశారో వివరించారు. చంద్రబాబు ఈ ఐదేళ్లలో రూ.40 కోట్లు కూడా ఇవ్వలేదన్నా  అని చెప్పారు. మీకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని అప్పుడు నేను హామీ ఇచ్చా. సంతృప్తస్థాయి (శాచురేషన్‌) విధానంలో మీ అందరికీ మేలు జరిగేటట్లు చేస్తానని చెప్పా. ఈ కార్పొరేషన్‌ ద్వారా ‘వైఎస్సార్‌ చేయూత’ కార్యక్రమం వర్తించేలా చేస్తా అని కూడా అన్నా. అందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఏమాత్రం వ్యత్యాసం చూపకుండా చేస్తానని చెప్పా. అదికాకుండా ఇతర పద్ధతుల్లో ఇంకా ఏం చేయవచ్చో మీరు సూచనలు, సలహాలు ఇస్తే వాటిని కూడా పరిశీలించి న్యాయం చేద్దాం. 

దూదేకులనూ ఆదుకుంటాం...
పాదయాత్ర జరుగుతున్నప్పుడు ప్రతివర్గం వారు మాకు కార్పొరేషన్‌ కావాలన్నా అని ప్రతిచోటా కోరారు. అందుకు ప్రధాన కారణమేమిటంటే ఏదైనా కార్పొరేషన్‌ ఉంటే దాని ద్వారా వాళ్లకు రుణాలు వస్తాయని, ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అంది మేలు జరుగుతుందనే. కానీ ఇప్పుడేం జరుగుతోందంటే.. ఊరు మొత్తానికి ఒక వెయ్యి మంది ఉంటే కేవలం ఏ ఐదుగురికో రుణాలిస్తున్నారు. వాళ్లకు ఇచ్చేది కూడా లక్ష రూపాయలంటారు, రూ.50 వేలు లోను అంటారు. ఆ లోను ఎలాగూ రాదు. బ్యాంకర్లు ఎలాగూ ఇవ్వరు. మిగిలిన రూ.50 వేలల్లో లబ్ధిదారుడి వాటా ఏ పది వేలో, ఇరవై వేలో అంటారు. ఆ మిగిలిన రూ.ముప్‌పై వేలో నలభై వేలో ప్రభుత్వం గ్రాంటు కింద ఇస్తుందని చెబుతారు. ఆ ముప్‌పై వేలో, నలభై వేలో గ్రాంటుగా తెచ్చుకునేందుకు కనీసం రూ.పది వేలో రూ.15 వేలో అంటే 25 శాతమన్నా లంచాలకింద ఇవ్వందే ఆ ఐదుగురికి కూడా వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రవ్యాప్తంగా నాకు ఈ పరిస్థితి కనిపించిందిది. అప్పుడు ఏం చేశానంటే.. పాదయాత్ర మధ్యలోనే నేనో సభలో ‘వైఎస్సార్‌ చేయూత’ అనే పథకాన్ని ప్రకటించా. ప్రతి కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని పాదయాత్రలో ప్రకటించాం. పారదర్శకంగా ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రతి ఒక్కరికి లబ్ధి అందేలా చూస్తామని చెప్పాం. వైఎస్సార్‌ చేయూత పథకం ప్రధాన ఉద్దేశం రాజకీయ నేతల అండదండలు లేనివారికి కూడా ప్రభుత్వ పోత్సాహకాలు అందేలా చూడడం. గ్రామ వాలంటీర్లను నియమించి ప్రతి ఊరిలోనూ గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తాం. అదే గ్రామానికి చెందిన పది మంది చదువుకున్న  పిల్లలకు ఉద్యోగాలిస్తాం.

వారిని గ్రామ సచివాలయంలో నియమిస్తాం. ఊరిలో పెన్షన్లు కావాలన్నా, రేషన్‌ కార్డు కావాలన్నా, నవరత్నాలకు సంబంధించిన అంశాలలో సహాయం కావాలన్నా, ఇళ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ..మరేది కావాలన్నా ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. ఎవరి చుట్టూ తిరగాల్సిన పనిలేదు. అప్లికేషన్‌ పెట్టిన 72 గంటల్లోనే ఎవరి సిఫార్సు లేకుండా మంజూరు చేస్తాం. దీన్ని మరో అడుగు ముందుకు తీసుకుపోయే దిశగా ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమిస్తాం. గ్రామ వాలంటీర్‌గా సేవా దృక్పథం కలిగి చదువుకున్న  వ్యక్తులను (మహిళలు గానీ పురుషులు గానీ) నెలకు రూ.ఐదు వేల చొప్పున ఇచ్చి నియమిస్తాం. ఆ యాభై ఇళ్లకు సంబం«ధించిన పూర్తి బాధ్యతంతా ఆ వాలంటీర్‌ చూస్తారు. ఈ వాలంటీర్‌ గ్రామ సచివాలయంతో అనుసంధానమై పని చేస్తారు. రేషన్‌ బియ్యం కోసం ఎక్కడికో పోవాల్సిన పని లేదు. ఇంటి వద్దకే వస్తాయి. గ్రామ వాలంటీరే డోర్‌ డెలివరీ చేస్తారు. బియ్యం మొదలుకుని పెన్షన్, అమ్మ ఒడి వరకూ అన్నీ వారే చూస్తారు. నవరత్నాలలో భాగంగా ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ ప్రకటించా.ం ఇలా అన్ని పథకాలను డోర్‌ డెలివరీ చేస్తాం. ఇందులో  భాగంగానే చేయూత కూడా అమలు చేస్తున్నాం. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీల అక్కలకు ఈ చేయూత పథకం కింద సాయం నేరుగా వాళ్లింటికే వస్తుంది. వాళ్లకు 75 వేల రూపాయలను ఉచితంగా ఈ పథకం కింద అందిస్తాం.

ఇది లోను కాదు. ఎవర్నీ అడగాల్సిన పనిలేదు. నాలుగేళ్లలో నాలుగు దఫాలుగా ఇస్తాం. సంవత్సరానికి రూ.19 వేల చొప్పున నాలుగేళ్లలో ఈ మొత్తాన్ని ఆ అక్కల చేతికే నేరుగా అందిస్తాం. మీరు అడుగుతున్న కార్పొరేషన్‌ ద్వారానే ఈ పని చేయిస్తాం. ఈ డబ్బుతో ఏం చేస్తే బాగుంటుందో సూచనలు, సలహాలు కూడా ఇస్తాం. ఇలా చేయడం వల్ల విప్లవాత్మక మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరికి సాయం అందుతుంది. సంఖ్యాపరంగా తాము చిన్న కులం వారిమన్న తేడా లేకుండా అందరికి ఈ పథకం ద్వారా సాయం అందుతుంది. దూదేకుల కులానికి సంబం«ధించి ఇంకా సమస్యలను పరిశీలించి తగు న్యాయం చేస్తాం. ఆ మేరకు నేను మీకు భరోసా ఇస్తున్నా. మీ సూచనలు, సలహాల కోసమే మిమ్మల్ని ఇక్కడకు రమ్మన్నా. నన్ను అడగడం కన్నా.. మీరు సలహాలు ఇవ్వండి నేను నోట్‌ చేసుకుంటా. ఇంకా మెరుగ్గా ఎలా చేయాలో కూడా ఆలోచిస్తాం’’

విశాఖ రైల్వే జోన్‌ కోసం కచ్చితంగా పోరాడతాం
నాకు తెలిసినంత వరకూ అన్ని రాష్ట్రాలకు రైల్వే జోన్‌ ఉంది. మన ఖర్మకొద్దీ ఆంధ్రప్రదేశ్‌ ఆ జాబితాలో లేదు. విశాఖకు రైల్వేజోన్‌ ఇస్తామని మనకు వాగ్దానం కూడా చేశారు. అయితే ఆతర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఈ విషయంలో ఖచ్చితంగా పోరాటం చేసి తీరతాం. నాకు దీనిపై పూర్తి అవగాహన ఉంది. రైల్వే ఉద్యోగాల పరీక్షల కోసం భువనేశ్వర్‌కు వెళ్లాల్సి వస్తోంది. భువనేశ్వర్‌లో లోకల్, నాన్‌లోకల్‌ ఫీలింగ్‌ తెచ్చి మనల్ని రానివ్వరు. మనవారిని కొట్టి వెనక్కు పంపిస్తున్నారు. దీనిపై రెండుమూడు సార్లు నేను మాట్లాడాను కూడా.

పెన్షన్లలో ఏం జరుగుతుందో చూస్తున్నారుగా...
ఇక పెన్షన్లలోనే కాదు మిగతా అన్నింటిలో ఏం జరుగుతోందో మీకు తెలిసిందే. గతంలో జరిగిన ఒక విషయం చెబుతా. అప్పుడు నేను చిన్నపిల్లాణ్ని. ఎన్టీరామారావు గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు.ఎన్నికలకు 6 నెలల ముందు వచ్చారు. ప్రజలు కూడా ఆయనపై విపరీతమైన ప్రేమ చూపించడం మొదలు పెట్టారు. అప్పట్లో ఆయన 2 రూపాయలకే కిలో బియ్యం అధికారంలోకి రాగానే ఇస్తానని చెప్పారు. ఎన్టీఆర్‌ ఆ మాట చెప్పాక ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చింది. నిజంగానే అలాంటి మంచి కార్యక్రమం ఎవరూ చేయలేదు అప్పటిదాకా. ఈ స్పందన చూసి ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి విజయభాస్కర్‌రెడ్డి తాము రూ.1.90కే ఇస్తామన్నారు. అంటే ఎన్టీఆర్‌ చెప్పిన దానికంటే 10 పైసలు తక్కువ. కానీ ఆరు నెలల ముందునుంచే ఎన్టీఆర్‌ చెప్పిన దానికంటే 10 పైసలకు తక్కువకు ఇచ్చినా కూడా ప్రజలు విజయభాస్కర్‌రెడ్డికి పట్టం కట్టలేదు. నాలుగున్నరేళ్లు మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేశావు. ఎన్టీఆర్‌ చెప్పారు కాబట్టి, ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కనుకనే ఇలా వ్యవహరిస్తున్నారంటూ విజయభాస్కరరెడ్డికి ప్రజలు మైనస్‌ మార్కులు వేశారు. సరిగ్గా చంద్రబాబునాయుడి పరిస్థితి కూడా అంతే.

ఎందాకా కాపీ కొడతాడు?
ఓ స్టూడెంట్‌ బాగా చదువుతాడు. కష్టపడి చదివి టెన్త్‌క్లాస్‌ పరీక్షలకు హాజరవుతాడు. చాలా కష్టపడి చదివాడు కాబట్టి బాగా రాస్తాడు. ఇంకో పిల్లాడు పక్కనే ఉంటాడు. అసలు చదవడు. మోసం చేస్తా ఉంటాడు, అబద్ధాలాడుతూ ఉంటాడు. పక్కన కాపీకొట్టి రాస్తాడు. కానీ చివరకు వచ్చేసరికి ఎంత కాపీ కొడతాడు...? కాబట్టి కాపీ కొట్టే వారికి మార్కులు రావు. మీలాంటి యువతీ యువకులను బాగుపరచాలి అంటే ఈ వ్యవస్థలో సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ చాలా ముఖ్యమైనది. ఒకవైపు ఉద్యోగాలు సృష్టిస్తూ మరోవైపు సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ కల్పించేందుకు ఎంటర్‌ప్రెన్యూర్‌లను సపోర్ట్‌ చేయాలి. దీంతో నేను ఏకీభవిస్తా.నా మనసులో కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఎలా ఉందీ అంటే..ఉదాహరణకు ఆర్టీసీనే తీసుకోండి.. పేరుకే ఆర్టీసీ బస్సులు. మంచిరూట్లన్నీ ప్రైవేటుకు ఇస్తారు. దివాకర్‌ ట్రావెల్స్‌ అంటారు (దివాకర్‌రెడ్డి), కేశినేని నాని అంటారు...ఏదన్నా తీసుకోండి అంతా కాంట్రాక్టే. కాంట్రాక్టుకు ఇవ్వడం, డబ్బులు సంపాదించుకోవడం, బినామీలుగా వీళ్లే పంచుకోవడం. ఎంత దారుణం? 


ఆలయాల్లో పారిశుద్ద్య పనులనూ వదలడం లేదు..

చివరకు ఆలయాల్లో పారిశుద్ధ్యం పనులు కూడా. అన్ని గుళ్లకు సంబంధించి గతంలో నెలకు రూ.లక్ష అయ్యే పనులకు చంద్రబాబు బంధువు భాస్కర్‌నాయుడుకు నెలకు రూ.7 లక్షలకు ఇచ్చారు. ఇలా ప్రతిచోటా కాంట్రాక్టుకు ఇవ్వడం వీళ్లే పంచుకోవడం. ఇలా కాకుండా మీలాంటి యువతకే ఇవ్వవచ్చు కదా. చిన్న చిన్న కాంట్రాక్టులను పారదర్శకంగా చదువుకున్న వాళ్లకు, ఉద్యోగాలు వెతుక్కుంటున్న వాళ్లకు, ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలని ఆరాటపడే వాళ్లకు, కొద్దో గొప్పో పెట్టుబడి పెట్టే కెపాసిటీ ఉన్నవాళ్లకు ఇస్తే బాగుపడతారు. మీలాంటి ఎంతోమందికి మేలు చేయవచ్చు. ఇలాంటివన్నీ మనం చేస్తాం.విప్లవాత్మక విధానం తెస్తాం. కంపెనీల్లో కూడా ఒక రూల్‌ తెస్తాం. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనేది మొట్టమొదటి ఆసెంబ్లీలోనే యాక్ట్‌ తెస్తాం. ఆ ప్రాంతంలో చదువుకున్న వారికి కచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం తీసుకొస్తే పాత కంపెనీలు, కొత్త కంపెనీలు అవే లైన్‌లోకి వస్తాయి. ఈరోజు కూడా చూశా. కియా మోటార్స్‌ అంట. బాగానే ఉంది. నరేంద్రమోదీ కొరియా వెళ్లినప్పుడు అక్కడి ప్రధానితో మాట్లాడారు. ఆ తర్వాత మొదలైంది. ఫైనల్‌గా కియా ఏపీకి వచ్చింది. కానీ చంద్రబాబు ఆ క్రెడిట్‌ తనవల్లే అంటారు.

అయినా ప్రాబ్లం లేదు. కానీ స్థానికులకు 5 శాతం ఉద్యోగాలు కూడా కల్పించలేదు. మన పిల్లలకు మనమే ఉద్యోగాలు చూపించలేకపోతే ఎలా? ఆ ఫ్యాక్టరీలకు భూములు ఫ్రీ అంటాం. కరెంటు తక్కువ రేటుకు అంటాం.. ఇన్ని ప్రయోజనాలు మనం కల్పిస్తూ మనం కోరేది మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వమనే. అంతకన్నా మనం ఏమీ అడగడం లేదు. అది ఇవ్వనప్పుడు ఆ ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టడం వల్ల అర్థమేముంది? లాభమేముంది? దీనికి అర్థం లేదు. ఇలాంటి దానికి ఎందుకు ఆరాట పడాలి? అందుకే 75 శాతం లోకల్‌ రిజర్వేషన్లు ఇస్తాం. మన పాలనలో ఉద్యోగాల కల్పన ముఖ్యమైనది. ఈ ఐదు సంవత్సరాల్లో రిటైరైన పోస్టులు 90 వేలు. మొత్తం 2.40 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా ఈ ప్రభుత్వం రిక్రూట్‌ చెయ్యడం లేదు. ఇవన్నీ రిలీజ్‌ చేస్తాం. ఏపీపీఎస్సీతో పాటు అన్ని ఖాళీలు రిలీజ్‌ చేస్తాం. ఏదైనా మాట చెబితే  ఆ మాట మీద నిలబడాలి.
 
రుణమాఫీ సొమ్ము వడ్డీలకు సరిపోలేదు..
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రైతుల రుణాలు రూ.87,612 కోట్లు. మొత్తం మాఫీ చేస్తా అని చెప్పి మొదటి సంతకం మాఫీపైనే అని ఎన్నికలకు ముందు చెప్పి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత చూస్తే సంవత్సరానికి రూ.3 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. మొత్తం ఐదేళ్లలో ఎంత ఇచ్చాడో చూస్తే...రూ.14,800 కోట్లు. రైతులు రూ.87,612 కోట్లకు  కట్టే వడ్డీ కనీసం అంటే 9 లేదా 10 శాతం వేసుకున్నా ఎంతలేదన్నా ఏడాదికి రూ. 8 వేల కోట్లు అవుతుంది. ఆయన ఇచ్చింది వడ్డీకి కూడా సరిపోలేదు. 

మన ప్రభుత్వం రాగానే అందరికీ సాయం...
మేం రాగానే 85 లక్షల మంది రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద నాలుగేళ్లపాటు ఏటా రూ.12,500ల చొప్పున రూ.10,600 కోట్లు ఇస్తాం. ఆయన (చంద్రబాబు) రూ.4,000 కోట్లు ఇవ్వడానికే ఆపసోపాలు పడిన పరిస్థితుల్లో మనం రూ.10,600 కోట్లు  రైతులకు సాయం చేస్తామని చెబుతున్నాం. కచ్చితంగా మే నెలలో రూ. 12,500 రైతుల చేతిలో పెడతాం. ఆశ్చర్యమేమిటంటే మన రాష్ట్రంలోని 85 లక్షల మంది రైతు కుటుంబాలలో ఒక ఎకరా లోపు ఉన్న రైతులు 42 లక్షల మంది దాకా ఉంటారు. అంటే 50 శాతం మందికి నేరుగా రూ. 12,500 వారి చేతికే అందిస్తే వరి రైతులకు పెట్టుబడిలో 60 నుంచి 70 శాతం సాయం అందుతుంది. అదే వేరుసెనగ రైతులకైతే దాదాపు 90 శాతం పెట్టుబడి చేతిలో పెట్టినట్టే అవుతుంది. పెట్టుబడి లేదని బాధపడటం, ఆత్మహత్య చేసుకోవడం లాంటి పరిస్థితులుండవు.

ఆ తపన ఉండాలి...
నాకు బాగా గుర్తు. నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగున్నరకే నిద్ర లేచేవారు. ఐదు గంటలకు ముఖ్యమైన పథకాలు ఆరోగ్యశ్రీ లాంటి వాటి గురించి ఎలా అమలు జరుగుతున్నాయో నేరుగా ఫోన్‌ చేసి అడిగి తెలుసుకునేవారు. ఏ ముఖ్యమంత్రి అయినా కొన్ని ఇష్టమైన ప్రాజెక్టులు  ఉంటాయి. ఇది నా పథకం, దీన్ని బాగా నిర్వర్తించాలనే తపన ఉండాలి. ఆ తపన ఉన్నప్పుడు ఏ పథకమైనా బాగా జరుగుతుంది. వెంటపడే గుణం ఉండాలి. కానీ చంద్రబాబుకు ఇవేమీ లేవు. మన ఖర్మమేంటంటే ఆరోగ్యశ్రీ బాగుంటే వైఎస్‌ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందని ఆయనకు భయం. ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ బాగుంటే రాజశేఖరరెడ్డికి పేరొస్తుందేమోననే బాబుకు భయం. కాబట్టి ఏ పథకమూ అమలు చేయాలనే తపన చంద్రబాబుకు లేదు. నా తపన ఏంటంటే నేను చనిపోయాక కూడా బతకాలని ఉంది. ఆ తపన ఉన్నప్పుడు కచ్చితంగా చేసే ఆలోచనలు వేరే ఉంటాయి. నవరత్నాల్లో మేం చెప్పాం. ఫీజు రీఇంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీకి సంబంధించి ఏం చేస్తామో స్పష్టంగా చెప్పాం. 

చేనేతలకు నెలనెలా సాయం...
చేనేతన్నలు ఆత్మహత్యలు చేసుకోకుండా మగ్గం ఉన్న ప్రతి ఇంటికీ సబ్సిడీ కింద గానీ ఇంకేదైనాగానీ నెలనెలా రూ.2,000 చేతిలో పెడతాం. ఆ తరువాత నవరత్నాల పథకాలు ఎలానూ ఉన్నాయి. పిల్లలను బడికి పంపిస్తే సంవత్సరానికి 15వేలు ఇస్తాం.  చేయూత పథకం కింద 45 సంవత్సరాలు నిండిన అక్క ఇంటిలో ఉంటే రూ.19 వేలు వస్తాయి. ఇంటిలో అవ్వాతాత ఉంటే నెలకు రూ.2000  పెన్షన్‌ వస్తుంది.దీంతో నాకు తెలిసి సగం సమస్యలు తీరిపోతాయి. చేయూత ద్వారా ఏటా రూ.75 వేలు ఇస్తాం కరెంటు రేటు కూడా తగ్గించి ఏ రూపాయిన్నరకో రెండు రూపాయలకో ఇవ్వగలిగితే మేలు జరుగుతుంది. అది కచ్చితంగా జరిగేటట్టు చూద్దాం. 

జంబో డీఎస్సీ నిర్వహిస్తా...
పాదయాత్ర సభల్లోనే చెప్పా. అధికారంలోకి వచ్చిన వెంటనే టీచర్‌ పోస్టుల భర్తీకి జంబో డీఎస్సీ ప్రకటిస్తా. స్కూళ్లలో, విద్యుత్తు శాఖలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పా. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పా. కాంట్రాక్ట్‌ సిబ్బంది అర్హతలు, సర్వీసును బట్టి వీలైనంత వరకు ప్రభుత్వపరంగా తీసుకుని న్యాయం చేస్తామని ఇప్పటికే చెప్పా.

ఉపాధి చట్టానికి తూట్లు..
చంద్రబాబు పాలనలో ఉపాధిహామీలో దోచేయడానికి విపరీతంగా మెటీరియల్‌ కాంపొనెంట్‌ను పెంచుతున్నారు. ఏ పనికైనా ఉపాధిహామీతోనే చేయడం ప్రారంభించారు. చివరకు అంగన్‌వాడీ బిల్డింగ్‌లను కూడా ఉపాధి హామీ నిధులతోనే కడుతున్నారు. ఉపాధిహామీ రాష్ట్రంలో నిర్వీర్యమైపోయింది. ఉపాధిహామీ స్ఫూర్తి పోయింది. దీన్ని రైతులకు నేరుగా అనుసంధానించాలంటే చట్టం అడ్డం వస్తుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో సవరించాలి. దీనిపై సూచనలు ఆహ్వానిస్తున్నాం.

మేమూ మనుషులమే కదా సర్‌...
చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలాంటి మాటలు మాట్లాడకూడదు. అయినా మాట్లాడారు మరి ఏం చేద్దాం? (సీఎం తీరుపై తనవద్ద ఆవేదన వ్యక్తం చేసిన వారితో జగన్‌ స్పందిస్తూ...) అలాంటివారు ఉన్నారు. అయినా అలా అనకూడదు. దాదాపు గంటన్నరకుపైగా మీ అందరితో కలిసి గడపడం నిజంగా నా అదృష్టంగానే భావిస్తున్నా. సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం సొంత ఖర్చులు పెట్టుకుని ఇక్కడకు వచ్చి నన్ను కలసినందుకు మరోసారి కృతజ్ఞతలు చెబుతున్నా. మీ సూచనలు, సలహాలు నా డేటాబేస్‌లో ఉంటాయి. కచ్చితంగా వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నేను, నా టీమ్‌ వాటిని అమలు చేసే కార్యక్రమాలు చేస్తాం. ఇదొక్కటే కాకుండా నేను మీ జిల్లాలకు ఎలాగూ వస్తా. మీ అందరి పేర్లు, వివరాలు గుర్తు పెట్టుకుంటా. నా అంతట నేనే మీ వద్దకు మనుషులను పంపించి  మీతో సత్సంబంధాలు కొనసాగించాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేపట్టా. ఈ సంబంధాలు జీవిత కాలం ఉండాలనేదే నా లక్ష్యం. ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా అదే. అందరినీ ఇప్పుడు కలవలేకపోవచ్చేమోగానీ ఏదో ఒకరోజు ఎక్కడో ఒకచోట కలుసుకునే కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. దీనికి సంబంధించి ఒక టీమ్‌ సమన్వయం చేస్తూ ఉంటుంది. ఏ రోజైనా మీరు నాతో టచ్‌లో ఉండవచ్చు. ఇక్కడకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top