
మంగళవారం విశాఖపట్నంలో మిరియాల వెంకటరావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్. చిత్రంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.
మిరియాల వెంకటరావు మృతితో రాష్ట్రం ఓ మంచి వ్యక్తిని కోల్పోయింది.
విశాఖపట్నంలో మిరియాల కుటుంబ సభ్యులను ఓదార్చిన జగన్
విశాఖపట్నం: మిరియాల వెంకటరావు మృతితో రాష్ట్రం ఓ మంచి వ్యక్తిని కోల్పోయింది. కాపు సామాజికవర్గం బలమైన నేతను కోల్పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఆదివా రం మృతి చెందిన కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకటరావు కుటుంబ సభ్యులను ఆయన మంగళవారం పరామర్శించారు. హైదరాబాద్‌నుంచి సాయంత్రం 4గంటలకు విశాఖపట్నం చేరుకున్న జగన్ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా చైతన్యనగర్‌లోని మిరియాల నివాసానికి వెళ్లారు. మిరియాల చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం మిరియాల సతీమణి ప్రమీల, కుమారుడు శేషగిరిబాబు, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. కాపు సామాజికవర్గంతోపాటు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి మిరియాల వెంకటరావు విశేష కృషి చేశారని కొనియాడారు.
వెంకటరావు సతీమణి ప్రమీల మాట్లాడుతూ... కాపులను బీసీల్లో చేర్చాలన్న ఆయన ఆశయం తీరకుండానే వెళ్లిపోయారని కన్నీటిపర్యంతమయ్యారు. మిరియాల కుటుంబానికి తాను, పార్టీ అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. మిరియాల కుటుంబాన్ని పరామర్శించినవారిలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, బూడి ముత్యాల నాయుడు, గిడ్డి ఈశ్వరి, కంబాల జోగులు, ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు బలిరెడ్డి సత్యారావు, తైనాల విజయ్‌కుమార్, మళ్ల విజయ్‌ప్రసాద్, గొల్ల బాబూరావు,చెంగల వెంకట్రావు, కర్రి సీతారాం, కరణం ధర్మశ్రీ, ధర్మాన కృష్ణదాస్, పిరియా సాయిరాజ్, తదితరులు పాల్గొన్నారు.