యువత రమ్మీ రాగం..!

Young People Addicted To An Online Games - Sakshi

ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌కు బానిసలవుతున్న యువత

రాత్రి పగలు తేడా లేకుండా ఆన్‌లైన్‌ పేకాట

అప్పులపాలవుతున్న వైనం

అధిక శాతం మంది విద్యార్థులే..

సాక్షి, కందుకూరు రూరల్‌: స్మార్ట్‌ ఫోన్‌ ఏ విధంగా ఉపయోగపడుతుందో అదే స్థాయిలో నష్టాలను కూడా కొనితెస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌లో నెట్‌ బ్యాలెన్స్‌ ఉంటే ఏదైనా చేయవచ్చు. పిల్లలు వివిధ రకాల గేమ్స్‌ ఆడుతుంటారు. టైమ్‌ పాస్‌కి కొందరు పెద్దలు, విద్యార్థులు, యువకులు కూడా ఆడుతున్నారు. అవి కాస్తా వ్యసనంగా మారి అప్పులు పాలవుతున్నారు. ఆన్‌లైన్‌ మనీ గేమ్స్‌ పేకాటలో రమ్మీ అధికంగా ఆడుతున్నారు. 

యాప్స్‌ సాయంతో..
ఆన్‌లైన్‌ పేకాట యాప్స్‌ ఐదారు రకాలున్నాయి. దీంతోపాటు డ్రిమ్‌ 11 యాప్‌ ద్వారా క్రికెట్, కబడ్డీ, ఫుట్‌ బాల్‌ ఆటలుంటాయి. వీటిల్లో ప్లేయర్స్‌ను ఎంచుకొని ఒక టోర్నమెంట్‌ పెట్టుకోవాలి. ఇందులో రూ. 10 వేల వరకు బెట్టింగ్‌ వేస్తారు. పాయింట్ల వారీగా నగదు వచ్చే అవకాశం ఉంది. ఈ ఆన్‌లైన్‌ గేమ్స్‌కు విద్యార్థులు ఎక్కువగా ఆకర్షణకు గురవుతున్నారు. ఎవరికీ తెలియకుండా ఫోన్‌లో ఆడే ఆటలు కావడంతో ఏమి చేస్తున్నారే విషయం బయటకు రాదు. నెట్‌ బ్యాలెన్స్‌ ఉంటే చాలు ఏ ఆటైనా ఆడుకోవచ్చు. నగదు వస్తే సంతోష పడతారు.  రాకపోతే పోయిన నగదు కూడా ఎలా రాబట్టాలనే ఆలోచనలో పడుతున్నారు. ఇలా ఎక్కువ శాతం విద్యార్థులు వీటికి బానిసై చదువుకు దూరవుతున్నారు. నష్టపోయిన నగదును చేకూర్చేందుకు ఇంట్లో తల్లిదండ్రులను మోసం చేయడం, తోటి విద్యార్థుల వద్ద అప్పులు చేయడం, తెలిసిన వారి దగ్గర అప్పులడగడం చేస్తున్నారు. అవీ చాలకపోతే దొంగతనాలకు పాల్పడుతూ భవిష్యత్‌ నాశనం చేసుకుంటున్నారు.

ఒక్క సారిగా కష్టం లేకుండా నగదు సంపాదించాలనే ఆలోచనలతోపాటు ప్రస్తుతం పెరిగిపోయిన సరదాలు, వ్యక్తి గత ఖర్చుల కోసం డబ్బు సంపాదించాలనే ఆశతో ఇలా బానిసలవుతున్నారు. వీటిల్లో తక్కువ నగదు వెచ్చించి ఎక్కువ నగదు సంపాదించన వారు కూడా ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు ఆన్‌లైన్‌ మనీ గేమ్స్‌ను బ్యాన్‌ చేశాయి. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం అయిన తెలంగాణలో ఇలాంటి చర్యలు తీసుకున్నారు. 

ఇలా..
ముందుగా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం లేదా నేరుగా లాగిన్‌ కావాలి. తర్వాత ఆన్‌లైన్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకొని ఆ అకౌంట్‌లోకి నగదు బదిలీ చేసుకుంటారు. ఆ తర్వాత వారికి నచ్చిన నగదు పెట్టి గేమ్‌ ఆడతారు. ఇలా పేకాటలో రమ్మీ మొదటి స్థానంలో ఉంది. ఇది ముందుగా టైమ్‌ పాస్‌గా మొదలై చివరికి వేలకు వేలు నగదు వెచ్చించి బానిసలువుతున్నారు. ఒకరితో సంబంధం లేకుండా ఫోన్‌లో ఒంటిరిగా కూర్చొని రాత్రింబవళ్లు ఈ ఆట ఆడుతున్నారు. ఇలాంటి వారికి ఒక్కొక్క సారి నగదు వస్తుంది. దానికి ఆశ పడి.. ఇంకా వస్తాయనుకుని వేలకు వేలు వెచ్చించి ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతున్నారు. ఇలా లక్షల రూపాయిలు అప్పులైన వారు అనేక మంది ఉన్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌లో ఐపీఎల్, వన్‌డే మ్యాచ్‌లు, ప్రపంచ కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగేటప్పుడు మాత్రమే క్రికెట్‌ బెట్టింగ్‌ జోరుగా ఉంటుంది. కానీ ఆన్‌లైన్‌ రమ్మీకి సమయ పాలన ఉండదు. ఎప్పుడు ఆడాలనిపిస్తే అప్పుడు ఆన్‌లైన్‌లోకి వెళ్లిపోవడమే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top