చిన్నాకు పెద్ద మనసు

Young Businessman Is Married A Orphan  - Sakshi

ప్రేమసమాజం యువతితో పెళ్లికి నిర్ణయం

అనాథ పిల్లలే పెళ్లి పెద్దలుగా..

ముందుకొచ్చిన దాతలు

21న చిన్నా..పద్మల పరిణయం

(చిన్నా) ఆర్థికంగా స్థితిమంతుడైన ఓ యువ వ్యాపారి. అతను కావాలనుకుంటే పెళ్లికి కోట్ల రూపాయలు కట్నకానుకలుగా వస్తాయి. కానీ చిన్నా మాత్రం ఓ అనాథ యువతిని భార్యగా చేసుకోవాలని భావించాడు. ఆ మేరకు విశాఖలోని ప్రేమసమాజంలో ఉంటున్న ఓ అనాథ యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి కూడా సాదాసీదా కాకుండా అనాథ పిల్లల మధ్య ఈనెల 21న  చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వ్యాపారస్తుడైనా..ఉద్యోగస్తుడైనా..పెళ్లి చేసుకోవాలంటే ఎంతో కొంత కట్నం ఆశిస్తాడు. ఉద్యోగస్తుడైతే సుమారుగా రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు..వ్యాపారస్తుడైతే..రూ.15 నుంచి రూ.20లక్షలు కట్న రూపంలో గానీ...ఆస్తుల రూపంలో గానీ ఆశించడం సహజం. చిన్నా మాత్రం పెద్ద మనసు చాటుకున్నాడు. కట్న కానుకలు వద్దనుకున్నాడు. ఆదర్శ వివాహం చేసుకోవాలనుకున్నాడు. 

సాక్షి, డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ) : మమతల కోవెలలో పెళ్లి సందడి. వేద మంత్రాలు..పచ్చని తోరణాలు..బాజా భజంత్రీలు..మంగళ వాయిద్యాలు..దాతల దీవెనలు..విందు భోజనాలు. కల్యాణ కాంతులతో ప్రేమసమాజం కళకళలాడుతోంది. పెద్దల దీవెనలతో ప్రేమసమాజం అమ్మాయికి..పాయకరావుపేటకు చెందిన కక్కిరాల వెంకటరమణ (లేటు) సత్యవతి దంపతుల కనిష్ట పుత్రుడు వెంకట సత్యనారాయణ(చిన్న)కు ఈ నెల 21న పెళ్లి జరగనుంది. అందుకు ప్రేమసమాజం అన్నపూర్ణ ఆడిటోరియం వేదిక కానుంది. అనాథ పిల్లలే పెద్దలను కల్యాణానికి ఆహ్వానించనున్నారు. 21 ఉదయం 10.59 గంటలకు ఈ వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.

ఇరవై ఏళ్లుగా ప్రేమసమాజంలో ఆశ్రయం పొందుతున్న పద్మకు పాయకరావుపేటకు చెందిన యువ వ్యాపారి వెంకట సత్యనారాయణతో వివాహం కానుంది. ప్రేమసమాజం అధ్యక్షుడు కంచర్ల రాంబ్రహ్మం, కార్యదర్శి మట్టుపల్లి హనుమంతరావు పాలకవర్గం సమక్షంలో ఈ వివాహం జరగనుంది. మమతల కోవెల ప్రేమసమాజంలో ఇది 110 వివాహం. ప్రేమ సమాజంలో పెళ్లి రాట ప్రేమసమాజంలో ఆశ్రయం పొందుతున్న పద్మను, పాయకరావుపేటకు చెందిన కక్కిరాల సత్యనారాయణతో ఈ నెల 21న ప్రేమసమాజం అన్నపూర్ణ ఆడిటోరియంలో జరగనున్న వివాహంలో భాగంగా సోమవారం ప్రేమసమాజంలో పెళ్లిరాట వేశారు. పలువురు ముత్తైదువులు పద్మను పెళ్లి కుమార్తెను చేసి ఆశీర్వదించారు. ప్రేమసమాజం పూర్వపు కార్యదర్శి పి.గణపతిరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రేమసమాజం కార్యదర్శి మట్టపల్లి హనుమంతరావు, సహాయ కార్యదర్శులు జగదీశ్వరరావు, సత్యనారాయణ, జి.రాధాకృష్ణ, పీఆర్వో ఎం.వి.రాజశేఖర్‌ ప్రేమసమాజం సిబ్బంది పాల్గొన్నారు. 

ముందుకొచ్చిన దాతలు..పెద్ద ఎత్తున కానుకలు..
ప్రేమసమాజం అమ్మాయికి పెళ్లి జరుగుతుందన్న విషయం తెలుసుకున్న పలువురు దాతలు ముందుకొచ్చారు.  కనకమహాలక్ష్మి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్‌ ఉప్పల భాస్కరరావు, వరాహలక్ష్మి దంపతులు కన్యాదాతగా నిలిచారు. ప్రేమసమాజం మాజీ కార్యదర్శి గణపతిరావు దంపతులు దగ్గరుండీ పెళ్లి కుమార్తెను చేశారు. ఇదిలా ఉండగా..ప్రేమసమాజం అధ్యక్షుడు కంచర్ల రాంబ్రహ్మం రూ.10వేలు, హైదరాబాద్‌కు చెందిన సీహెచ్‌ కల్యాణ్‌కుమార్‌ రూ.10,116, ప్రేమసమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ విశ్వేశ్వరరావు రూ.10వేలు, ప్రేమసమాజం మాజీ కార్యదర్శి ఎం.వి.రమణ రూ.5వేలు, ఏ.కె.చైతన్య రూ.5వేలు, కటిల్, జగన్‌ పటేల్‌ రూ.6,500, సీహెచ్‌ శేఖర్‌ రూ.15వేలు, కిరణ్‌ రూ.6,500, టి.వినీష్‌ రూ.10వేలు ఇవ్వగా అగర్వాల్‌ మహాసభ ప్రతినిధులు పుస్తుల తాడు, చెవి రింగులు, పుస్తులు, సంపతి గొట్టాం, పట్టీలు, కాళ్ల మెట్టెలు వంటి పెళ్లి సామాన్లు, అనేక మంది చీరలు, సారె సామగ్రి అందజేశారు. 

ఆదర్శ వివాహమే చేసుకోవాలనుకున్నా..
తల్లిదండ్రులు మంచివారు. ఇద్దరు అక్కలు, బావలు చాలా మంచివారు. అన్నయ్య ఐదేళ్ల కిందట ప్రమాదవశాత్తు చనిపోయాడు.  నేను..నాన్న ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుంటున్నాం. పాయకరావుపేటలోనే మా ఇల్లు. వ్యాపార నిమిత్తం తుని వెళ్తుంటాం. అమ్మ చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను. నన్ను, నాన్నను, అక్కలు, బావల్ని బాగా చూసుకునే అమ్మాయి కావాలనుకున్నా. అందుకు ఆదర్శ వివాహమైతే బాగుంటుందని అనుకున్నా. ప్రేమసమాజంలో అమ్మాయిని చూశాను. చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలనుకున్నా. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరూ లేరని తెలుసుకున్నా. అటువంటి అమ్మాయికి జీవితం ఇచ్చిన వాడినవుతానని అనుకున్నా. 
వెంకట సత్యనారాయణ(చిన్నా), పెండ్లి కుమారుడు

ప్రేమసమాజమే అమ్మా..నాన్న
తల్లిదండ్రులు చిన్నవయస్సులోనే చనిపోయారు. ఐదేళ్ల వయస్సులో నన్ను, అన్నయ్య లక్ష్మణ్‌ను బంధువులు ప్రేమసమాజంలో చేర్పించారు. అప్పటి నుంచి మా ఇద్దరికి అమ్మా..నాన్న అంటే ప్రేమసమాజమే. చిన్నప్పటి నుంచి మా ఇద్దర్ని ప్రేమసమాజం ఎంతగానో ఆదుకుంది. తల్లిదండ్రులు లేని మా ఇద్దరికి ప్రేమసమాజమే దైవం. ఇంటర్మీ డియట్‌ వరకు చదివించారు. అధ్యక్షుడు రాంబ్రహ్మం, కార్యదర్శి హనుమంతరావు ఇక్కడి పిల్లల శ్రేయస్సు కోసం పరితపిస్తుంటారు. పదిహేడేళ్ల పాటు ఇక్కడే ఉన్నాను. కొత్త జీవితంలో అడుగుపెడతున్నాను. అంతా మంచే జరుగుతుందని భావిస్తున్నా. ఆదర్శ వివాహంచేసుకుంటున్న..కాబోయే భర్త సత్యనారాయణ(చిన్న), అందుకు సహకరించి ముందుకొచ్చిన మావయ్య వెంకటరమణకు కృతజ్ఞతలు. వారికి మంచిపేరు తెస్తాను. 
–పద్మ, ప్రేమసమాజం పుత్రిక..పెళ్లి కుమార్తె

కుమారుడి అభీష్టం మేరకే..
భార్య సత్యవతి అనారోగ్యంతో ఏడాది కిందట చనిపోయింది. నాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుమార్తెలు ఇద్దరికీ పెళ్లి చేసేశాను. ఇద్దరు కుమారుల్లో పెద్దోడు ఐదేళ్ల కిందట వినాయక చవితి ఉత్సవాల నిమజ్జన సమయంలో ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి చనిపోయాడు. చిన్నోడు వెంకటసత్యనారాయణ(చిన్నా)ఇంటర్మీడియట్‌ వరకు చదివాడు. నాతోనే తునిలో కారం(మసాల సామాన్లు విక్రయం) పనులు చేస్తుంటాడు. ప్రేమ సమాజం అమ్మాయిని చేసుకుంటే ఒకరికి దారి చూపిన వాడినవుతానని చెప్పడంతో సరేనన్నా. నాలుగేళ్ల కిందట రూ.25 లక్షలతో ఇల్లు నిర్మించాను. 300 గజాల ఖాళీ స్థలం ఉంది. నా కుమారుడికి ఆదర్శ వివాహమంటే ఇష్టం. అందుకే ప్రేమసమాజం అమ్మాయితోనే పెళ్లి చేస్తున్నాం.
– కక్కిరాల వెంకటరమణ, పెళ్లి కుమారుడు తండ్రి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top