యనమల అరాచక పాలనకు చరమగీతం తప్పదు
అధికారం అండతో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడు సాగిస్తున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు
ప్లీనరీలో నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా
తుని : అధికారం అండతో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన సోదరుడు యనమల కృష్ణుడు సాగిస్తున్న అరాచక పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. తుని మండలం చామవరం శివారులో ఆదివారం రాత్రి జరిగిన వైఎస్సార్ సీపీ తుని నియోజకవర్గ ప్లీనరీకి ఆయన అధ్యక్షత వహించారు. తొలుత దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి, మాజీ మంత్రి, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబులతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, 2004కు ముందు టీడీపీకి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించుకునే అవకాశం ప్రతిపక్షాలకు ఉండేది కాదన్నారు. ఇప్పుడు గుండెధైర్యంతో ఎక్కడైనా ఎప్పుడైనా సభలు నిర్వహించుకునే అవకాశాన్ని ప్రజలు కల్పించారన్నారు.
ఎన్నో కేసులు పెట్టి నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ వెరవక.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో వేలాదిమంది తనవెంట నడవడం ఎంతో ఉత్సాహాన్నిచ్చిందన్నారు. మూడు నియోజకవర్గాలకు సేవలందించే తుని ఏరియా ఆస్పత్రిని టీడీపీ నాయకులు ఆదాయ వనరుగా చేసుకుని పేదల రక్తాన్ని సొమ్ముల రూపంలో పిండుకుంటున్నారన్నారు. తుని నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్, భూములవంటివాటిని విచ్చలవిడిగా దోచుకునేందుకు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఆర్థిక మంత్రి సొంత గ్రామమైన ఏవీ నగరంలో 105 మందికి చెందిన పింఛన్ల సొమ్మును స్వాహా చేస్తున్నా స్పందించలేదన్నారు. నిజంగా సిగ్గుంటే దీనిపై విచారణ జరిపించి పేదలకు పింఛను సొమ్ము ఇప్పించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ నలుమూలల నుంచీ వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో సభాప్రాంగణం కిక్కిరిసింది.
టీడీపీని ఎప్పుడు ఓడిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారనడానికి ప్లీనరీకి వచ్చిన జనసందోహమే నిదర్శనమని రాజా అన్నారు. కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. ప్లీనరీ ఇన్‌చార్జి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, కాకినాడ పార్లమెంటరీ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరి, పెండెం దొరబాబు, ప్రత్తిపాడు పార్టీ కో ఆర్డినేటర్ పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్, ప్రచార కమిటీ రాష్ట్ర కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాకినీడి గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.