ఆర్‌అండ్‌బీ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం | Wrath of the collector on R&B officials | Sakshi
Sakshi News home page

ఆర్‌అండ్‌బీ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

Jun 13 2014 4:47 AM | Updated on Sep 2 2017 8:42 AM

ఆర్‌అండ్‌బీ అధికారులపై  కలెక్టర్ ఆగ్రహం

ఆర్‌అండ్‌బీ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం

‘పీసీపల్లి మండలం అలవలపాడు వద్ద సిమెంట్ రోడ్డుకు అప్రోచ్ వేయమని మూడు నెలల క్రితం చెప్పా. ఇంతవరకూ వేయలేదు.

ఒంగోలు కలెక్టరేట్ : ‘పీసీపల్లి మండలం అలవలపాడు వద్ద సిమెంట్ రోడ్డుకు అప్రోచ్ వేయమని మూడు నెలల క్రితం చెప్పా. ఇంతవరకూ వేయలేదు. అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగి జనాలు చనిపోయిన తర్వాత అప్రోచ్ వేస్తారా? మీకు సొంత జ్ఞానం ఉండదా? ఇంజినీరింగ్ చదివే వచ్చారా’ అని ఆర్‌అండ్‌బీ ఇంజినీరింగ్ అధికారులపై కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం గురువారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో జరిగింది.
 
జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల పట్ల కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల సంఖ్యను సాధ్యమైనంత మేరకు తగ్గించేందుకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని సూచించారు. జాతీయ రహదారితో పాటు రాష్ట్ర రహదారులన్నింటిపైనా ప్రమాదకర  ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాదాలన్నీ ఎక్కువ శాతం తెల్లవారు జామున రెండు నుంచి నాలుగు గంటల మధ్యలో జరుగుతున్నాయని, ఆ సమయాల్లో వాహనాలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

 జిల్లాలోని వల్లూరు, మార్టూరు ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాలను అభివృద్ధి చేసి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల డ్రైవర్లు అక్కడ విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జాతీయ రహదారి అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారితో కలిపే ప్రాంతాల్లో అన్ని రహదారులపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి వాహనాలు వేగంగా రోడ్డుపైకి రాకుండా నివారించాలని కలెక్టర్ చెప్పారు.
 
వంద మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉండొద్దు
జాతీయ రహదారికి ఇరువైపులా వంద మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ, రాష్ట్రీయ రహదారులన్నింటిపై ఆక్రమణలు తొలగించాలన్నారు. రోడ్లపై వాహనాలు పార్కు చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపై అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని సూచించారు. ఒంగోలు నగరంలోని ఫ్లయిఓవర్ బ్రిడ్జి కింద ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి గ్రీనరీ పెంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ విజయకుమార్ సూచించారు.
 
కార్పొరేషన్ కమిషనర్‌కు చార్జి మెమో: ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ విజయలక్ష్మికి కలెక్టర్ విజయకుమార్ చార్జి మెమో జారీ చేశారు. నగరంలోని తొమ్మిది ప్రాంతాల్లో సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని గతేడాది మే 23వ తేదీన నిర్ణయం తీసుకున్నా ఇంతవరకు అమలు చేయకపోవడంతో ఆమెపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పాలక సంస్థ పరిధిలో అప్రోచ్ రోడ్ల వివరాలు అడిగినా సకాలంలో స్పందించకపోవడంతో కమిషనర్‌పై కలెక్టర్ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement