నెత్తిపై మృత్యు దేవత

Worst Govt Schools In Vizianagaram - Sakshi

పెంకులు పడిపోతుంటాయి. నెత్తిన బొప్పి కడుతుంటాయి. పైకప్పులోంచి చువ్వలు కనిపిస్తుంటాయి. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయం.. ఎప్పుడే ప్రాణం పోతుందోనని కలవరం. శిధిలమవుతున్న ప్రభుత్వ భవనాలు మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. కూలిపోయే స్థితిలో ఉన్న గదుల్లో పాఠశాలలు సాగుతున్నాయి. పాచిపెంటలో ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్డి గోడ కూలి ఓ విద్యార్థి నిండు ప్రాణం రాలిపోయింది. నెత్తిపైనే మృత్యుదేవత తాండవిస్తోంది.  

సాక్షి,విజయనగరం:

సీతానగరం పీహెచ్‌సీ సిబ్బంది నివాసాలు శిధిలమయ్యాయి. పెదంకలాం పీహెచ్‌సీ భవనం శిధిలమై పాములకు నివాసంగా మారింది. గుమ్మిడివరంలో ఎంపీఈ స్కూల్‌ అదనపు భవనం కూడా కూలిపోయే స్థితికి చేరుకుంది.
– సీతానగరం (పార్వతీపురం) 

మండలంలోని భోజరాజపురంలో పాఠశాల భవనం పూర్తిగా పాడైనా అందులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. గోపాలరాయుడిపేట ఎంపీపీ పాఠశాల భవనంలో తరగతి గది పైకప్పు పెచ్చులూడిపోయింది.
 – బొబ్బిలి రూరల్‌  

నెల్లిమర్ల మండల పరిషత్‌ భవనం శిథిలమై ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. ఈ భవనాన్ని 1998లో మిమ్స్‌ ఆస్పత్రి సేవలకు అప్పగించగా 2002లో ఖాళీ చేసినా తొలగించలేదు.
– నెల్లిమర్ల 

చీపురుపల్లి ఆర్‌ అండ్‌ బి సహాయ ఇంజనీర్‌ అధికారి కార్యాలయం శిధిలం కావడంతో సిబ్బంది ఖాళీ చేశారు. కొన్నాళ్లకు భవనం కొంత కూలిపోయినా ఇంతవరకు తొలగించలేదు. జీవీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మొదటి అంతస్తులోని పలు భవనాలు కూడా శిధిలావస్థకు చేరుకున్నాయి.      – చీపురుపల్లి 

మెరకముడిదాంలో రెండేళ్ల క్రితం ఎస్సీ బాలుర వసతిగృహాన్ని ఎత్తివేశారు. అప్పటి నుంచి భవనం వృధాగా పడి ఉండటంతో శిధిలావస్థకు చేరింది. 
– మెరకముడిదాం
(చీపురుపల్లి) 

వేపాడ మండలంలో శిధిలమైన భవనాల్లోనే చదువులు సాగుతున్నాయి. ఆకులసీతంపేట, సోంపురం, గుడివాడ, కుమ్మపల్లి, జగ్గయ్యపేట, ఎస్‌.కోట సీతారాంపురం, వేపాడ తదితర ప్రాథమిక పాఠశాలలు ఏ క్షణాన్నయినా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి.
– వేపాడ (శృంగవరపుకోట)  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top