ఈ పాపం ఎవరిదీ! 

A woman Who Is Insane Has Given Birth To Baby In Adoni - Sakshi

ఓ దుర్మార్గుడు దారుణానికి ఒడి గట్టాడు. కామంతో కళ్లు మూసుకుపోయి మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి చేశాడు. సభ్య సమాజాన్ని నివ్వెరపరిచాడు. మానవీయతకు మాయని మచ్చ తెచ్చాడు. ఫలితంగా ఆ పిచ్చి తల్లి మగ బిడ్డకు జన్మనిచ్చింది. గమనించిన స్థానికులు బిడ్డను అక్కున చేర్చుకొని ఆసుపత్రికి తరలించారు. ఇంతటి పాపానికి ఒడిగట్టిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.  

సాక్షి, ఆదోని : పట్టణంలోని రాయలసీమ పైకొట్టాల ప్రాంతంలో మతిస్థిమితం లేని మహిళ నాలుగేళ్లుగా సంచరిస్తూ ఉంది. ఎవరైనా పెడితే తినేది. లేదంటే వీధుల వెంట తిరుగుతూ ఉండేది, రాత్రి పూట చెట్లు, గోడల చాటున తలదాచుకునేది. ఆమె ఎప్పుడు నోరు విప్పి మాట్లాడలేదు. స్థానికులు ఆమెను పిచ్చి తల్లి అంటూ పిలుచుకునేవారు.  

కాటేసిన దుర్మార్గుడు.. 
మతిస్థిమితం లేని ఆ మహిళలను చూస్తే ఎవరైనా అయ్యో పాపం అంటూ జాలి చూపుతారు. దయతో ఏదైనా ఆమె చేతిలో పెడతారు. అయితే ఆ కామాంధుడికి మాత్రం జాలి, దయ లాంటివేమి లేవు. సభ్యసమాజం తలదించుకునే పనికి ఒడి గట్టాడు. కాలంతో పాటు తనలో మార్పు వస్తున్నా ఆమెకు ఏం జరుగుతుందో తెలియలేదు.

దుర్మార్గుడి పాపాన్ని తొమ్మిది నెలలు మోసిన ఆ పిచ్చి తల్లి శనివారం ఓ చెట్టు కింద మగ బిడ్డకు జన్మనిచ్చింది. రెండు రోజుల తర్వాత పసిబిడ్డ ఏడుపు విన్న ఓ మహిళ చెట్టు దగ్గరకు వెళ్లి అక్కున చేర్చుకుంది. తోటి మహిళల సాయంతో ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించిన వైద్యులు స్థానిక ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. 

తల్లీబిడ్డను కర్నూలుకు తరలించిన అధికారులు 
తల్లీ, బిడ్డను ఐసీడీఎస్‌ అధికారులు సోమవారం కర్నూలుకు తరలించారు. అంతకు ముందు స్థానిక ఐసీడీఎస్‌ అధికారిణి సఫరున్నిసాబేగం బిడ్డ ఆరోగ్య విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మాధవీలతతో మాట్లాడారు. బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్‌ తెలిపారు. బిడ్డను కర్నూలులోని శిశు గృహకు తరలిస్తామని, తల్లిని కర్నూలు జనరల్‌ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పిస్తామని సఫరున్నిసాబేగం తెలిపారు. కాగా మతిస్థిమితం లేని మహిళను తల్లిని చేసిన దుర్మార్గుడు సమాజంలో ఉండకూడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారించి పాపానికి ఒడిగట్టిన దుర్మార్గుడిని జైలుకు పంపాలని కోరుతున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top