బీజేపీతోనే రాష్ట్రాభివృద్ధి | with BJP State | Sakshi
Sakshi News home page

బీజేపీతోనే రాష్ట్రాభివృద్ధి

Jan 19 2015 2:46 AM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీతోనే రాష్ట్రాభివృద్ధి - Sakshi

బీజేపీతోనే రాష్ట్రాభివృద్ధి

దేశ ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు హరిబాబు తెలిపారు.

కడప రూరల్ : దేశ ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని  భారతీయ జనతా పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందని  ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు హరిబాబు తెలిపారు. ఆదివారం కడప నగరంలోని మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరిబాబు మాట్లాడారు.  విభజన జరిగినప్పుడు రాష్ర్ట పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.నరేంద్రమోడీ దేశ ప్రధాని కాగానే ఆంధ్రప్రదేశ్ భవితవ్యం మారిపోయిందన్నారు. బీజేపీ పాలన కారణంగానే  ఆంధ్రప్రదేశ్‌కు నిరంతరాయంగా విద్యుత్‌ను ఇస్తున్నామన్నారు.  

పలు ప్రాంతాల్లో సోలార్‌విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గడిచిన ప్రభుత్వ హయాంలో పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా  పెరిగేవన్నారు.  ప్రస్తుతం ఆ ధరలను పదిసార్లు తగ్గించుకుంటూ వచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించాలన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీని వాస్ మాట్లాడుతూ  అదుపు తప్పిన  భారత వ్యవస్థను దేశ ప్రధాని నరేంద్రమోదీ గాడిలో పెడుతున్నారన్నారు.
 
విభజన హామీలు సాధించడంలో టీడీపీ విఫలం - కందుల శివానందరెడ్డి
బీజేపీ తీర్థం పుచ్చుకున్న  కందుల శివానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తీరు చాలా బాధాకరమన్నారు. విభజన వల్ల రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లిందన్నారు.  విభజన హామీలను   సాధించడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.   

వైఎస్సార్ జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  జిల్లాలో ఉక్కు  కర్మాగారం వస్తుందో రాదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.  రాయలసీమ అభివృద్ధి  భారతీయ జనతాపార్టీతోనే సాధ్యమనే భావనతోనే తాము ఆ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. కందుల రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిని ఆకాంక్షించి బీజేపీలో చేరుతున్నామన్నారు.
 
బీజేపీలో చేరికలు
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో కందుల సోదరులు  శివానందరెడ్డి, రాజమోహన్‌రెడ్డి, శివానందరెడ్డి తనయుడు చంద్ర ఓబుల్‌రెడ్డి (నాని) తదితరులతోపాటు మాజీమంత్రి సరస్వతమ్మ, మైదుకూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మిపార్వతి, రైల్వేకోడూరుకు చెందిన పారిశ్రామికవేత్త గల్లా శ్రీనివాస్, కాంట్రాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, లేవాకు మధుసూదనరెడ్డి, సమరనాథరెడ్డి తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి వెంకయ్యనాయుడు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా  పార్టీ నాయకులు సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు నాగలిని బహూకరించారు. కార్యక్రమంలోపార్టీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు సానపురెడ్డి సురేష్‌రెడ్డి, చల్లపల్లి నరసింహారెడ్డి, వి ష్ణువర్దన్‌రెడ్డి, శ్యాం కిశో ర్, అల్లపురెడ్డి హరినాథరెడ్డి, ఒంటేరు శ్రీనివాసులురెడ్డి, రమేష్‌నాయుడు   పాల్గొన్నారు.
 
వెంకయ్యకు ఘన స్వాగతం
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు కడపలో ఘన స్వాగతం ల భించింది. ఉదయం 11 గంటలకు ఆయన కడ ప విమానాశ్రయానికి  చేరుకోవాల్సి ఉండగా, 12 గంటలకు వచ్చారు.  కడప నగర మేయర్ కె.సురేష్‌బాబుతోపాటు బీజేపీ నాయకులు శశిభూషణ్‌రెడ్డి, అల్లపురెడ్డి హరినాథరెడ్డి, కందుల  రాజమోహన్‌రెడ్డి, కందుల చంద్ర ఓబుల్‌రెడ్డి, చేపూరి శారద, రామ్మోహన్‌రెడ్డి, రమేష్‌నాయుడు, ఆర్డీఓ లవన్న, తహశీల్దార్  రవిశంకరరెడ్డి తదితరులు  కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. ఈ  సందర్భంగా కందుల శివానందరెడ్డి తనయుడు చంద్ర ఓబుల్‌రెడ్డి (నాని), బీజేవైఎం నాయకులు రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కడప నగరం నుంచి ఎయిర్‌పోర్టు వరకు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
 
 పోలియో చుక్కలు వేసిన వెంకయ్య
 కడప సెవెన్‌రోడ్స్ : కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం కడప నగరంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి ఇక్కడి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో చుక్కల మందును వేశారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీనివాస్, కలెక్టర్ కేవీ రమణ, ప్రత్యేక పరిశీలకులు డాక్టర్ నరసింహులు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి నారాయణ నాయక్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి నాగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement