పోస్ట్‌మార్టంలో ఏముంది | whats is thier in postmurdam | Sakshi
Sakshi News home page

పోస్ట్‌మార్టంలో ఏముంది

Jan 22 2014 3:42 AM | Updated on Nov 6 2018 7:53 PM

కోరుట్ల ఠాణాలో చనిపోయిన సాన చంద్రయ్యను పోలీసులు చిత్రహింసలు పెట్టిన అనుమానాలు బలపడుతున్నాయి.

కరీంనగర్ హెల్త్, న్యూస్‌లైన్ : కోరుట్ల ఠాణాలో చనిపోయిన సాన చంద్రయ్యను పోలీసులు చిత్రహింసలు పెట్టిన అనుమానాలు బలపడుతున్నాయి. పోస్ట్‌మార్టం చేసిన వైద్యులు అతని మృతదేహంపై కమిలిన గాయాలు ఉన్నట్లుగా గుర్తించారు. భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ.. చంద్రయ్య శరీరంపై ఉన్న గాయాలకు పొంతన లేదని భావిస్తున్నారు. చంద్రయ్య తల నుదిటి భాగం పగిలి ఉంది. చాలా వరకు నుజ్జునుజ్జు అయింది. ముక్కులోని కండరాలు దెబ్బతిన్నాయి. మెదడుకు సంబంధించిన సన్నని నరాలు తెగిపోయాయి. తల కపాలంలో తీవ్ర రక్తస్రావమైంది. శరీరంలో ఎక్కడ కూడా ఎముకలు విరగలేదు. రెండు కాళ్లకు పిక్కలపై భాగం, తొడ, చేతి భుజాలపై కొట్టినట్లుగా కండరాలు కమిలిపోయి ఉన్నాయి. కమిలిన చోట వాపు వచ్చింది.
 
 గాయాలకు సంబంధించిన పూర్తి వివరాల సేకరణకు.. దెబ్బతిన్న భాగాల స్పెసిమెన్స్‌ను ల్యాబ్‌కు పంపించి నట్లు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారులు తెలిపారు. ఫోరెన్సిక్ సైంటిఫిక్ ల్యాబ్‌కు పంపించామని, రిపోర్టు వచ్చేవరకు 20 రోజులు పడుతుందన్నారు. ప్రాణం లేని వస్తువును విసిరితే ఎలాంటి చర్యలు జరుగుతాయో... చంద్రయ్య మృతదేహం అదేవిధంగా కనిపిస్తున్నట్లు వైద్యనిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. భవనంపై నుంచి దూకినా, ప్రమాదవశాత్తూ కింద పడినా ఎముకలు విరుగుతాయి. కానీ.. శరీరంలో ఏ ఒక్క ఎముక విరుగకపోవటం సందేహానికి తావిస్తోంది. భవనంపై నుండి తనంతట తాను దూకితే ముందుగా కాళ్లు, చేతులు భూమికి తగులుతాయని.. ఈ కేసులో అలా జరుగలేదని నిపుణులు విస్మయం వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement