భారతదేశ సమైక్యత, సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం విదేశీయురాలైన సోని యాకు ఏం తెలుసని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ధ్వజమెత్తారు.
ఉదయగిరి, న్యూస్‌లైన్: భారతదేశ సమైక్యత, సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం విదేశీయురాలైన సోని యాకు ఏం తెలుసని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉదయగిరిలో బుధవారం నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో ఆయన మాట్లాడారు. స్వప్రయోజనాల కోసమే ఆమె తొమ్మిది కోట్ల మంది తెలుగు ప్రజలను నిట్టనిలువునా చీల్చేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు.
సోనియాగాంధీ తెలుగువారి ఉసురుపోసుకోక తప్పదన్నారు. అటు తెలంగాణ, ఇటు సీమాంధ్రలో ఎవరూ విభజనను కోరుకోవడం లేదన్నారు. తెలంగాణలోని కొందరు రాజకీయ బికారులు మాత్రమే విభజనను కోరుకుంటుంటే, వారి మాటలు నమ్మి రాష్ట్రాన్ని ముక్కలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిందని, ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర విభజన ఆలోచనను విరమించుకోవాలన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కృషి సత్ఫలితమిస్తుందనే నమ్మకముం దన్నారు. ఆర్టికల్ 3ను రద్దు చేయాలనే డిమాండ్‌కు అందరూ మద్దతు పలకడం శుభపరిణామమన్నారు. చంద్రబాబు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా తయారైందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్, టీడీపీని ఓడించి వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నానని, మరో అవకాశం తమకు కల్పిస్తే మరిం త అభివృద్ధికి ప్రయత్నిస్తానన్నారు. మొదట ఆయన రైతు వేషధారణలో ట్రాక్టర్‌ను స్వయంగా నడుపుతూ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో ముందుకుసాగారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కల్లూరి రమణారెడ్డి, అక్కుల్‌రెడ్డి, ఓబుల్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, ఆనందరావు, గడియాల్చి ఎస్ధాని, ఖిల్జీ సలీం, ఏడుకొండలు, ముర్తుజా హుస్సేన్, పెద్దిరెడ్డి, సోమిరెడ్డి, అశోక్‌కుమార్, ఎం.వెంకటేశ్వర్లు, గుంటుపల్లి నాగభూషణం, పాణెం రమణయ్య పాల్గొన్నారు.