
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయాధికారులను రెండు నూతన రాష్ట్రాల మధ్య విభజించే అధికారం హైకోర్టుకే ఉందని ఏపీ న్యాయాధికారుల సంఘం వాదించగా.. ఒకవేళ రెండు కొత్త రాష్ట్రాల్లో విడిగా హైకోర్టులు ఉండి ఉంటే అప్పుడు ఎవరి బాధ్యత అవుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. న్యాయాధికారుల విభజన జరగకుండా నియామకాలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం వారంరోజులుగా విచారిస్తోంది. బుధవారంనాటి విచారణలో ఏపీ న్యాయాధికారుల సంఘం తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ‘‘న్యాయాధికారుల నియామకాలను ఇతర సివిల్ అధికారుల నియామకాలతో పోల్చరాదు.
న్యాయవ్యవస్థలోని సిబ్బంది స్వతంత్రతకు ఇబ్బంది రాకుండా చూడడమే ఇందులోని తార్కిక ఆలోచనగా గమనించాలి.. అందువల్ల న్యాయాధికారుల విభజనకు హైకోర్టు రూపొందించిన మార్గదర్శకాలను గమనంలోకి తీసుకోవాలి’’ అని నివేదించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ చలమేశ్వర్ జోక్యం చేసుకుంటూ ‘‘ఒకవేళ రెండు రాష్ట్రాలకు విడివిడిగా రెండు హైకోర్టులు ఏర్పడి.. ఈ అంశంలో రెండు హైకోర్టుల మధ్య ఏకాభిప్రాయం కుదరని పక్షంలో విభజన ప్రక్రియ ఎవరు చేపట్టాలి?’’ అని ప్రశ్నించారు. అలాంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు తిరిగి సుప్రీంకోర్టునే ఆశ్రయించాల్సి వస్తుందని ఆదినారాయణరావు సమాధానం ఇచ్చారు. హైకోర్టు సూచించిన మార్గదర్శకాలను ఆమోదించాలని నివేదించారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదావేసింది.