సంక్షేమానికి చెదలే..! | welfare schemes are stopped | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి చెదలే..!

Jan 21 2014 1:02 AM | Updated on Sep 2 2017 2:49 AM

లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు ఈ ఏడాది దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు సబ్సిడీ ఎటూ తేలకపోవడంతో యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ మొదలు కాలేదు.

 సాక్షి, నల్లగొండ
 లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు ఈ ఏడాది దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు సబ్సిడీ ఎటూ తేలకపోవడంతో యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ మొదలు కాలేదు. ఈ నెల మొదట్లో సబ్సిడీపై ప్రభుత్వం స్పష్టత (జీఓ101) ఇచ్చింది. అయితే వయో పరిమితి కుదించడం, ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని నిబంధన విధించింది. ఆరునెలల పాటు నాన్చి మొక్కుబడిగా సబ్సిడీ పెంచింది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు యూనిట్ విలువలో 60శాతం రాయితీని రూ.లక్షకు మించకుండా ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. బీసీ, మైనారిటీ, వికలాంగ లబ్ధిదారులకు యూనిట్ విలువలో 50 శాతం రాయితీని రూ.లక్షకు మించకుండా వర్తింపజేయనుంది. అయితే ఈ పథకాలకు వయోపరిమితి లేకుండేది. ఇప్పుడు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 21-45 ఏళ్లు, ఇతరులకు 21-40 వయోపరిమితి కలిగి ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
 ముంచుకొస్తున్న కోడ్...
 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగులకు స్వయం ఉపాధి కల్పన కోసం అమలు చేస్తున్న పథకాలు ఇప్పటికే చతికిలబడ్డాయి. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్నాయి. మార్చిలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే అభివృద్ధి, సంక్షేమ పథకాల గ్రౌండింగ్‌పై తీవ్ర ప్రభావం ఉంటుంది. తద్వారా లబ్ధిదారులకు యూనిట్లు అందజేయడం నిలిచిపోతుంది. ఎన్నికల్లో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ పెంచుతామని గాలం వేసింది. ఈ అంశాన్ని సుదీర్ఘంగా పరిశీలనలో ఉంచింది. అయితే, రాయితీ పెంపుపై ప్రభుత్వ నిర్ణయం వెలువడే సరికి తీవ్ర ఆలస్యం జరిగిపోయింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోగా సత్వర చర్యలు తీసుకోకపోతే లబ్ధిదారుల ఆశలపై నీళ్లు చల్లినట్టే.
 
 గ్రౌండింగ్‌పై ప్రభావం...
 ఏటా అన్ని పనులూ దశల వారీగా జరిగితేనే లక్ష్యం మేరకు యూనిట్లు గ్రౌండ్ కావడం గగనమవుతోంది. అయితే ఈ ఏడాది ఇంతవరకు అతీగతీ లేకపోవడంతో గ్రౌండింగ్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. యూనిట్ల మంజూరు, బ్యాంక్ కాన్సెంట్ , రుణం అందజేయడం ఎప్పటిలోగా చేస్తారో సర్కారుకే తెలియాలి. మరో రెండున్నర నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగిస్తుంది. మరి ఏమేరకు లబ్ధిదారులకు పథకాలు అందజేస్తుందో చూడాలి.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement