అసెంబ్లీని తక్షణమే సమావేశపరచాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు.
వైఎస్సార్ జిల్లా:అసెంబ్లీని తక్షణమే సమావేశపరచాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ అంశంపై ఒకసారి అసెంబ్లీని సమావేశ పరిస్తే విభజనకు ఎంతమంది అనుకూలమో తెలుస్తోందని ఆయన తెలిపారు. 294 ఎమ్మెల్యేల్లో విభజనకు ఎందరు అనుకూలమో తెలియాలంటే అసెంబ్లీని సమావేశపరచాలని ఆదినారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ సీపీ స్పష్టంగా చెప్పినట్లు అందరూ సమైక్య నినాదాన్ని వినిపించాలన్నారు. వైఎస్ విజయమ్మ ఢిల్లీలో మద్దతు తెలిపినట్లే ఉద్యమానికి మద్దతు తెలపాలన్నారు. సీఎం కిరణ్ సమైక్య వాదైతే వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
విభజనను అడ్డుకోవడానికి రాజీనామాలు అవసరం లేదని సీమాంధ్ర మంత్రలు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సమైక్య తీర్మానానికి సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. ఆ పార్టీ ప్రతిపాదించిన సమైక్య తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని సచివాలయం సీమాంధ్ర ఉద్యోగ జేఏసీ నేత మురళీకృష్ణ శుక్రవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. సమైక్య తీర్మానం ద్వారా విభజన ప్రక్రియ ఆగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ సచివాలయం సీమాంధ్ర ఉద్యోగులు న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది.