ఎటువంటి ఆంక్షల్లేని సంపూర్ణ తెలంగాణ కోసం బిల్లులో అవసరమైన సవరణలు చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు
సాక్షి, హైదరాబాద్: ఎటువంటి ఆంక్షల్లేని సంపూర్ణ తెలంగాణ కోసం బిల్లులో అవసరమైన సవరణలు చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తోనే జనవరి 7న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ‘సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష’ను చేపడుతున్నట్టు వెల్లడించారు. దీక్షకు సంబంధించిన విషయాలపై చర్చించేందుకు జేఏసీ కార్యవర్గం మంగళవారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సమావేశమైంది. సమావేశం తరువాత కోదండరాం విలేకరులతో మాట్లాడారు.
‘‘విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగాలి... సంపూర్ణ తెలంగాణ కోసం బిల్లులో అవసరమైన సవరణ చేయాల’’ని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి విభజన ప్రకటన వచ్చి నాలుగేళ్లవుతున్నా ఇంకా సాగదీయడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కుట్రపూరితంగా బిల్లును అడ్డుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీక్ష విజయవంతం కావడానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు జనవరి 3 నుంచి పునఃప్రారంభం కానున్నందున ప్రతిరోజూ జేఏసీ కూడా హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహిస్తామని టీఎన్జీవో సంఘ అధ్యక్షుడు దేవీప్రసాద్ వెల్లడించారు. కాగా, జనవరి 5న హైదరాబాద్‌లో తెలంగాణ ప్రాంత న్యాయవాదుల సదస్సు ఉంటుందని టీ న్యాయవాదుల నేత రాజేందర్‌రెడ్డి తెలిపారు. జేఏసీ నేతలు శ్రీనివాస్‌గౌడ్ ,అద్దంకి దయాకర్, కత్తి వెంకటస్వామి, రఘు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.