తెలంగాణను అడ్డుకుంటే మహాయుద్ధమే: శ్రవణ్‌కుమార్ | War will start, if prevent to Telangana formation, warns Sravan kumar | Sakshi
Sakshi News home page

తెలంగాణను అడ్డుకుంటే మహాయుద్ధమే: శ్రవణ్‌కుమార్

Published Sat, Nov 23 2013 3:58 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకులు కల్పించినా, ఆంక్షలు పెట్టినా మహాయుద్ధం చేపడతామని టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రవణ్‌కుమార్ హెచ్చరించారు.

 శామీర్‌పేట్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకులు కల్పించినా, ఆంక్షలు పెట్టినా మహాయుద్ధం చేపడతామని టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రవణ్‌కుమార్ హెచ్చరించారు. శుక్రవారం అలియాబాద్‌లోని సంగీత్ ఫంక్షన్‌హాల్‌లో టీఆర్‌ఎస్ మండలస్థాయి కార్యకర్తలకు శిక్షణ తరగతుల్లో ఆయన ప్రసంగించారు. సీమాంధ్రుల ఒత్తిడికి లొంగి హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించినా, వెనుకంజ వేసినా మహోద్యమానికి కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టీడీపీల ద్వంద్వ వైఖరిని ప్రజలకు విడమర్చి చెప్పాలన్నారు.
 
 కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేయాలనే నిర్ణయం వెనుక ఈ ప్రాంతం పైన, ప్రజల పైన ప్రేమతో కాదని, ఎన్నికల్లో లబ్ధికోసమేననే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనం గాని, ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్ ఎలాంటి త్యాగాలు చేసిందో ప్రజలకు వివరించాలని, పార్టీ పటిష్టానికి కృషి చేయాలని సూచించారు. టీఆర్‌ఎస్ సుదీర్ఘ పోరాటం, వెయ్యిమంది తెలంగాణవాదుల అత్మ బలిదానాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. అనంతరం ప్రొఫెసర్ శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో టీఆర్‌ఎస్ కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో పార్టీ సొంతంగా పోటీ చేసి అత్యధిక స్థానాలు గెలుపొందాల్సి ఉంటుందని సూచించారు.
 
 ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మద్దతుతో గెల్చిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వప్న, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ పల్లె సీతారాములుగౌడ్, టీఆర్‌ఎస్ శామీర్‌పేట్, మేడ్చల్, కీసర మండలాల పార్టీ అధ్యక్షులు విష్ణుగౌడ్, భాస్కర్, రవికాంత్, టీఆర్‌ఎస్ యూత్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి చాప భాస్కర్, మండల యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌వీ మండల అధ్యక్షుడు మురళిగౌడ్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ధూంధాంలో జవహర్‌నగర్ ఆకాశరామన్న కళామండలి సభ్యులు తెలంగాణ గేయాలు, జానపద నృత్యాలతో సభికులను ఆకట్టుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement