నా జీవితం నాశనం చేశారు | Vizianagaram Bride Press meet On Husband Suicide Case | Sakshi
Sakshi News home page

నా జీవితం నాశనం చేశారు

Sep 6 2018 2:31 PM | Updated on Sep 6 2018 6:38 PM

Vizianagaram Bride Press meet On Husband Suicide Case - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న నవ వధువు ముబీనా, తండ్రి జానీలు

విజయనగరం టౌన్‌: ‘మా నాన్నకు నేనొక్కతినే కుమార్తెను. రంజాన్‌ నుంచి నన్ను చూస్తున్నారు. మా ఇంటికి మూడు నెలలుగా నా భర్త వస్తుండేవారు. ఇప్పుడు ఆయన మరణించాక... పెళ్లి కుమార్తె మారిపోయిందంటూ నాపై అభాండాలు వేస్తున్నారు. అసలు నా భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదు.. ఇదంతా నా అత్తింటివారి కుట్ర’ అని విజయనగరానికి చెందిన నవ వధువు మహ్మద్‌ ముబీనా తెలిపారు. వధువు మార్చేశారన్న మనస్తాపంతో పెళ్లయిన మూడు రోజులకే ఫ్యాన్‌కు ఉరివేసుకుని వీఆర్‌ఓ షేక్‌ మదీన్‌ మంగళవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా ముబీనా తన తండ్రి ముగ్గుల్‌ జానీతో కలసి మీడియాతో మాట్లాడారు. రంజాన్‌ నెలలో తనను చూసేందుకు మదీన్‌ వచ్చారని, నాటి నుంచి పలుమార్లు రావడం, వెళ్లడం చేసేవారని చెప్పారు. కానీ పెళ్లయిన నాటి నుంచి అత్త, ఆడపడుచులు వేధింపులు మొదలుపెట్టారని తెలిపారు. తన భర్త మదీన్‌ చాలా మంచి వారనీ, అన్యాయంగా వేధించి, ఆయన్ను చంపేశారని ఆరోపించారు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి తన తల్లిదండ్రులు పెళ్లిచేశారని, వచ్చినప్పటి నుంచి కనీసం ఒక్కరోజు కూడా తనను ప్రశాంతంగా ఉండనివ్వలేదని, గదిలో నిర్బంధించారనీ ఆరోపించారు. ఇప్పుడు పెళ్లి సమయంలో పిల్లను మార్చేశారంటూ కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.

కొన్ని నెలలుగా మా ఇంటికి వచ్చిన మదీన్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు తాను తెలుసనీ, తన ఆధార్, రేషన్‌కార్డు ఏదైనా అన్నీ చూడాలనీ, విచారణ చేయాలని కోరారు. ఎప్పుడూ బ్యూటీక్లినిక్‌కు వెళ్లని తనను ముఖంపై చిన్న మచ్చలున్నాయంటూ అత్త, ఆడపడుచులు తీసుకెళ్లారనీ, పొడవాటి జుత్తును కత్తిరించేశారనీ, ఏవో క్రీమ్స్‌ రాయడంతో ముఖంపై మచ్చలు ఎక్కువయ్యాయని, అయితే వైద్యులు ఆ మచ్చలు తగ్గిపోతాయని చెప్పారన్నారు. తన భర్త ఆస్పత్రికి తీసుకెళ్తున్నప్పుడే తనతో మాట్లాడుతూ ‘మా అమ్మా, చెల్లి ఏమన్నా పట్టించుకోవద్దు... నేనున్నాన’ని నచ్చచెప్పారన్నారు.  పదిగంటలకు చౌట్రీకి వెళ్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి మరి తిరిగిరాలేదని కన్నీటిపర్యంతమయ్యారు. తనను రూమ్‌లోనే బంధించారని, చచ్చిపోయేంత పిరికివాడు కాదని, తనకు న్యాయం జరిగే వరకూ వదిలే ప్రసక్తేలేదని తెలిపారు. ముబీనా తండ్రి ముగ్గుల్‌ జానీ మాట్లాడుతూ తనకు ఒకే కుమార్తె, ఇద్దరు మగపిల్లలు ఉన్నారనీ, అలాంటిది పిల్లనే మార్చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తన కూతురు బతుకు నాశనం చేశారన్నారు. రూ. 20 లక్షలపైగా ఖర్చుపెట్టి విశాఖలో ప్రధానం, పెళ్లి  చేశామని, ఎంతో ఆనందంగా ఉండాల్సిన సమయంలో ఇటువంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. పెళ్లికొడుకు మదీన్‌ రెండు, మూడుసార్లు ఇంటికి వచ్చినప్పుడు బట్టలు కొనడానికి బయటకు తీసుకెళ్తానంటేనే తాను పంపలేదని, అలా వెళ్లకూడదని చెప్పానని, అటువంటిది బిడ్డను ఎలా మార్చుకుంటాననీ ప్రశ్నించారు. తల్లి, కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్లనే ఏదో జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement