బోటు ప్రమాదంతో మైలపడింది..గోదారమ్మకు దూరంగా! | Village People Avoid Godavari Water Duet Boat Capsizes | Sakshi
Sakshi News home page

బోటు ప్రమాదంతో మైలపడింది..గోదారమ్మకు దూరంగా!

Sep 22 2019 9:17 AM | Updated on Sep 22 2019 9:40 AM

Village People Avoid Godavari Water Duet Boat Capsizes - Sakshi

దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం: జీవనది గోదావరి. ఉభయగోదావరి జిల్లాల ప్రజల జీవితాలు దానితోనే ముడిపడి ఉంటాయి. ఆ నదీమ తల్లి అంటే ఎంతో పవిత్రమైనదిగా వారు భావిస్తారు. జూన్‌ మొదటి వారంలో గోదావరి నుంచి కాలువలకు నీరు విడుదల చేసే సమయంలో ఈ ఏడాది సిరులు కురిపించమ్మా అంటూ దారిపొడవునా కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేయడం ఇక్కడి మహిళల్లో సంప్రదాయంగా వస్తోంది. అటువంటి గోదావరి నీటిని ఇప్పుడు ఆ పరీవాహక గిరిజన గ్రామాలు ముట్టుకోవడానికి ఇష్టపడటంలేదు. ఎందుకంటే.. దేవీపట్నం మండలం తున్నూరు గ్రామ పంచాయితీ కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిపోయి 36 మంది మృతిచెందాక ఆ గిరిజన గ్రామాలన్నీ గోదావరి నీరును వినియోగించడం మానేశారు.



బోటు మునిగిపోయిన ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉన్న కచ్చులూరు గ్రామంతో పాటు మండల కేంద్రం దేవీపట్నం సహా గోదావరి దిగువన ఉన్న 10–12 గ్రామాల్లో పరిస్థితిని ‘సాక్షి బృందం’ పరిశీలించగా గోదావరి నీటి వినియోగాన్ని వదిలేశారనే విషయం స్పష్టమైంది. ఇక్కడ సుమారు 100–150 వరకు కుటుంబాలున్నాయి. వంటా, వార్పుతోపాటు దైనందిన కార్యక్రమాలన్నిటికీ ఈ నీటిపైనే వీరంతా ఆధారపడే వారు. ఈ నీటిలో తీపిదనం ఉంటుందని, అందుకే ఆ నీటితో వండి వారుస్తామని గిరిజనులు పేర్కొంటారు. కొత్త నీరు బురదగా ఉన్నప్పటికీ అటవీ ప్రాంతంలో లభించే ఇండుగ పిక్కలు లేదా, స్పటికను వినియోగించి నీటిని శుద్ధిచేసుకుని మరీ గోదావరి నీటిని వినియోగిస్తారు.



ఈ నీటికి ఇంత ప్రాధాన్యతనిస్తున్న ఇక్కడి గిరిజనులు ఇప్పుడు దానిని ముట్టుకోవడానికి కూడా ముందుకు రావడంలేదు. మహిళలు దూరాభారమైనా బోర్లు లేదా కొండలపై నుంచి వచ్చే చల్ధికాలువ, ఎర్రగొండ కాలువ, కొండజల కాలువ వరకూ వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. ఆ గ్రామాల్లో ఎవరిని కదిపినా ఒకటే సమాధానం చెబుతున్నారు. గోదావరమ్మ మైలపడింది.. గోదావరిలో ఉన్న మృతదేహాలన్నీ బయటకు తీసిన తరువాతనే శుద్ధిచేసే వరకూ చుక్క నీటిని కూడా ముట్టమంటున్నారు. కాగా, 2018 మే 15న మంటూరు వద్ద ప్రమాదం జరిగి 19మంది మృతిచెందినప్పుడు కూడా వీరు ఇదేరకంగా గోదావరిని దూరం పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement