అక్రమ రిజిస్ట్రేషన్లలో బెజవాడ టాప్‌

Vijayawada tops the list of illegal registrations - Sakshi

ఆస్తుల విలువలు బాగా పెరగడంతో అడ్డదారులు

మోసాల అడ్డుకట్టకు సర్కారు చర్యలు.. త్వరలో ఉత్తర్వులు

సాక్షి, అమరావతి : మోసపూరిత, డబుల్‌ రిజిస్ట్రేష్రన్లలో విజయవాడ అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రం మొత్తమ్మీద ఇటీవల కాలంలో మొత్తం 282 తప్పుడు/డబుల్‌ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు రాగా అందులో ఒక్క విజయవాడ రిజిస్ట్రేషన్‌ జిల్లాలోనే 84 ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 రిజిస్ట్రేషన్‌ జిల్లాలు ఉండగా ఆరింటిలో ఎలాంటి ఫిర్యాదుల్లేవు. మిగిలిన 20 రిజిస్ట్రేషన్‌ జిల్లాలను పరిశీలిస్తే విజయవాడలో 84, విశాఖపట్నంలో 39, ఒంగోలులో 27, చిత్తూరులో 24, అనంతపురంలో 20 అక్రమ రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు ఫిర్యాదులున్నాయి. ఈ మొత్తం ఫిర్యాదులపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విచారణ జరిపింది. 44 కేసులకు సంబంధించి ప్రాసిక్యూషన్‌ సాగుతోంది. కొన్ని పెండింగులో ఉండగా.. మరికొన్నింటిని రకరకాల మార్గాల్లో పరిష్కరించారు.

స్థిరాస్తుల విలువ పెరగడంతో..
భూములు, స్థలాలు తదితర స్థిరాస్తుల విలువలు భారీగా పెరిగినందువల్లే భారీ మోసాలు జరుగుతున్నాయి. తమది కాని భూమిని యజమానులకు తెలియకుండా నకిలీ పత్రాల ద్వారా అక్రమార్కులు విక్రయిస్తున్న సంఘటనలు కోకొల్లలు. దీంతో బాధితులు లబోదిబోమంటూ తప్పుడు రిజిస్ట్రేషన్లు రద్దుచేయాలంటూ ఫిర్యాదు చేయడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి. సివిల్‌ కోర్టుల ఆదేశాలు లేనిదే రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి కూడా లేకపోవడం గమనార్హం. దూర ప్రాంతాల్లోనూ స్థిరపడిన వారి భూములు, స్థలాలపై మాఫియా గ్యాంగులు కన్నేసి నకిలీ ఆధార్, ఇతర పత్రాలు సృష్టించి వాస్తవ యజమానులకు తెలియకుండానే విక్రయించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నాయి. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో ఈ మోసాలు ఎక్కువ. వాస్తవ యజమానులు వీటిని విక్రయించడానికి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లే వరకూ తెలీని పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సంకల్పించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో జారీచేయనుంది.  

ప్రాసిక్యూషన్‌ చేయిస్తాం
ఎవరైనా తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలిస్తే ప్రాసిక్యూషన్‌ చేయించి క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాంబశివరావు ‘సాక్షి’కి తెలిపారు. సబ్‌ రిజిస్ట్రార్లు తప్పుచేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తరహా మోసాల నియంత్రణకు ఆయన పలు సూచనలు చేశారు. అవి..
- తమ స్థిరాస్తులను వేరేవారు విక్రయించినట్లు తెలిస్తే వెంటనే ఛీటింగ్‌ కేసులు పెట్టాలి. 
తమ భూమిని వేరేవారు అమ్మేసినట్లు తెలియగానే భూ యజమాని మ్యుటేషన్‌ (రెవెన్యూ రికార్డుల్లో మార్పులు) చేయవద్దని తహసీల్దారుకు ఫిర్యాదు చేయాలి. అప్పుడా రిజిస్ట్రేషన్‌కు విలువ ఉండదు. 
వెబ్‌ల్యాండ్‌లో మోసాలు జరగకుండా భూ యజమానుల ఆధార్‌ నంబరు, ఫోన్‌ నంబరు కూడా పక్కాగా నిర్వహించడం ద్వారా ఎలాంటి మోసాలకు అవకాశంలేకుండా చేయొచ్చు.  

మోసాలివీ..
రాజమహేంద్రవరానికి చెందిన రామకృష్ణమ్మకు భర్త చిన్న సూర్యనారాయణ ద్వారా బహుమతి రూపంలో 15.14 ఎకరాల భూమి లభించింది. కానీ, రామకృష్ణమ్మ 20.78 ఎకరాలను ఇతరులకు విక్రయించి రిజిస్ట్రేషన్లు చేశారు. అంటే.. ఆమె తనకున్న భూమి కంటే 5.64 ఎకరాలు అదనంగా అమ్మేశారు.  తనను మోసగించిన బాధ్యుల (రామకృష్ణమ్మ, సబ్‌ రిజిస్ట్రారు)పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు వెంకట సుధామయి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. లేని భూమిని విక్రయించిన రామకృష్ణమ్మ చనిపోయారు. ఆమె పిల్లల పేరుతో బహుమతి కింద చేసిన రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి లేదు. 
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో పయనీర్‌ ఫాస్పేట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన 3.66 ఎకరాల భూమిని మాజీ డైరెక్టర్లు తప్పుడు మార్గంలో విక్రయించి రిజిస్ట్రేషన్‌ చేశారు. వారు డైరెక్టర్‌ పదవుల నుంచి వైదొలిగినప్పటికీ డైరెక్టర్లుగా ఉన్నట్లు రికార్డులు చూపించి భూమిని అమ్మేశారు. 
అమెరికాలో నివాసం ఉంటున్న కాకినాడకు చెందిన మహిళ స్థలాన్ని ఆమెకు తెలియకుండా వేరే వారు విక్రయించారు. ఈ రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసి తనకు న్యాయం చేయాలని ఆమె ఇటీవలే ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు విజ్ఞప్తి చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top